హామీలు.. దిగాలు!
► మాటల ముఖ్యమంత్రి
► రెండేళ్ల కాలంలో 10 విడతల పర్యటన
► జిల్లాకు ఇచ్చిన హామీలు 76
► ఇప్పటి వరకు అమలు చేసినవి 25
► కరువు సీమపై కపట ప్రేమ
కర్నూలు(అగ్రికల్చర్): తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈనెల 8వ తేదీ నాటికి రెండేళ్లు పూర్తయింది. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలో పదిసార్లు పర్యటించారు. ఏడు పర్యటనల సందర్భంగా జిల్లాకు సుమారు 76 హామీలు ఇచ్చారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం పేరిట వరాల వర్షం కురిపించడం తప్పిస్తే.. వీటిలో అధిక శాతం ఇప్పటికీ అమలుకు నోచుకోని పరిస్థితి. మొత్తం హామీల్లో 25 పరిష్కరించినట్లు చూపుతున్నా.. అందులోనూ స్పష్టత కరువయింది. దాదాపు పరిష్కరించిన హామీల్లోనూ 40 శాతం పురోగతిలో ఉన్నట్లు అధికారులే అంగీకరిస్తున్నారు. వాస్తవానికి 10 హామీలకు సంబంధించిన జీఓలు మాత్రమే ఇప్పటి వరకు జారీ అయినట్లు తెలుస్తోంది. రాష్ట్ర పరిపాలన సారథి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకే దిక్కు లేకపోతే.. ఇక అభివృద్ధి ఎలా సాధ్యమనే చర్చ జరుగుతోంది.
మాటల్లోనే ఆర్థిక సంక్షోభం
రాష్ర్ట విభజన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పాలకులు అనేక సందర్భాల్లో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని.. రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్ వెంటాడుతోందని మాట్లాడటం సర్వసాధారణమైంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ముఖ్యమంత్రి విచ్చలవిడి ఖర్చు చూస్తే రాష్ట్రం నిజంగానే ఆర్థిక సంక్షోభంలో ఉందా అనే సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఆర్థిక సమస్యలే ఉంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇంతటి ఆర్భాటం అవసరమా? ఏడు రోజుల నవ నిర్మాణ దీక్షలను ఇంతటి అట్టహాసంగా చేపడతారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఒక్క కర్నూలు జిల్లాలోనే ముఖ్యమంత్రి పర్యటన ఖర్చు రూ.10కోట్లు దాటిందంటే ప్రభుత్వం ఏ స్థాయిలో ప్రజాధనం వృథా చేస్తుందో అర్థమవుతోంది. ముఖ్యమంత్రి జిల్లాల్లో పర్యటించాల్సిందే.. క్షేత్ర స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందే.. వీటికి లేని ఆర్థిక ఇక్కట్లు హామీల అమలు విషయంలో అడ్డు రావడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.