యంత్రాంగం.. నిర్లక్ష్యం.. | Warangal R&B ee Janardanreddy surrender | Sakshi
Sakshi News home page

యంత్రాంగం.. నిర్లక్ష్యం..

Published Wed, Dec 31 2014 3:47 AM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM

యంత్రాంగం.. నిర్లక్ష్యం..

యంత్రాంగం.. నిర్లక్ష్యం..

‘అధికారులు అలక్ష్యం వద్దు.. యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి సాగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రెండు నెలల్లో మరోసారి వస్తా. రెండు రోజులపాటు సమీక్ష నిర్వహిస్తా.  అందరూ సన్నద్ధంగా ఉండాలి’     - సోమవారం సమీక్షలో కేసీఆర్
 
సీఎం సమీక్షలో వెల్లడైన అధికారుల అలక్ష్యం
వరంగల్ ఆర్‌అండ్‌బీ ఈఈ జనార్దన్‌రెడ్డి సరెండర్
సీఎం ఫోన్ చేసినా స్పందించని ఈఈ
ఉత్సవాల తేదీల ఖరారుపై అసంతృప్తి

సాక్షి ప్రతినిధి, వరంగల్ : పరిపాలన, అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యక్రమాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రోడ్లు, భవనాల శాఖ వరంగల్ డివిజన్ ఈఈ జనార్దన్‌రెడ్డిపై వేటు పడింది. ఈఈ జనార్దన్‌రెడ్డిని ఆ శాఖ రాష్ట్ర కార్యాలయానికి సరెండర్ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబాబాద్ ఈఈ చిన్నపుల్లదాస్‌కు వరంగల్ ఈఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

పరిపాలన అంశాల విషయంలో జిల్లా యంత్రాంగం తీరుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమీక్షలో జిల్లా అభివృద్ధి విషయంలో అధికారుల వైఖరి కేసీఆర్‌ను అసహనికి గురి చేసింది. ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా తాను ఫోన్ చేసి చెప్పినా అంశాలను పట్టించుకోకపోవడంతో ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ జి.కిషన్ సహా పలువురు శాఖల అధికారుల పనితీరు, సమావేశంలో ఇచ్చే వివరణపై అసంతృప్తి దాచుకోలేకపోయారు.

అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష కోసం సోమవారం జిల్లాకు వచ్చిన కేసీఆర్.. ప్రధానంగా టెక్స్‌టైల్ పార్క్, రోడ్ల నిర్మాణం, కాకతీయ ఉత్సవాలపై సమీక్షించారు. వరంగల్ నగరంలోని ప్రధాన రహదారుల విషయంలో సమగ్ర సమాచారం ఇవ్వాలని ఇటీవల కేసీఆర్ నేరుగా వరంగల్ డివిజన్ రోడ్లు, భవనాల శాఖ వరంగల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జనార్దన్‌రెడ్డిని ఆదేశించారు. స్వయంగా సీఎం ఫోన్ చేసి చెప్పినా జనార్దన్‌రెడ్డి పట్టించుకోలేదు.

ఇదే విషయాన్ని సీఎం సమీక్ష సమావేశంలో ప్రస్తావించారు. జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖ సూపరింటెండెంట్ ఇంజనీరును ప్రశ్నించారు. అందరూ ఏమి తెలియదని చెప్పినట్లుగా ఉండడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈఈ జనార్దన్‌రెడ్డికి మద్దతుగా ఈ శాఖ ఎస్‌ఈ మోహన్‌నాయక్ సర్ది చేప్పేందుకు ప్రయత్నించారు. ఎస్‌ఈ తీరుపైనా కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఈఈ జనార్దన్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సమీక్ష సమావేశంలో ఉన్న రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు సూచించారు.
 
అటవీ శాఖపై..
టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు కోసం అవసరమైన భూముల స్థలాల సమాచారంపైనా కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. టెక్స్‌టైల్ పార్క్ కోసం కనీసం వెయ్యి ఎకరాలు తగ్గకుండా స్థలాలు కావాలని సూచించినా.. జిల్లా అధికారులు 500 లోపు ఎకరాలు ఉన్న స్థలాలనే ప్రతిపాదనల్లో పెట్టారు. ఈ కారణంతోనే కేసీఆర్ ఏరియల్‌సర్వే షెడ్యూల్ మారింది. నగరానికి సమీపంలో ఒకే చోట 2 వేల ఎకరాల వరకు ఉన్న స్థలాలను సూచించాలని సమీక్షలో అటవీ అధికారులను ఆదేశించారు.

 నగరానికి 20 కి.మీ పరిధిలో, 30 కి.మీ పరి ధిలోని అటవీ శాఖ భూముల వివరాలను అటవీ శాఖ ముఖ్య అధికారి రాజారావు  ఇవ్వలేకపోయారు. గంటలోపు కావాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇలా చెప్పిన 45 నిమిషాల తర్వాత అటవీ శాఖ అధికారులకు సీఎం గుర్తు చేశారు. అయినా ఫలితం లేకపోయింది.
 
కాకతీయ ఉత్సవాలపైనా..

కాకతీయ ఉత్సవాల నిర్వహణ తేదీలను కలెక్టర్ జి.కిషన్ ప్రకటించడంపైనా ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. తేదీలను ఎలా ప్రకటిస్తారని పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ.ఆచార్య మొదట కలెక్టర్ జి.కిషన్‌ను ప్రశ్నిం చారు. ప్రజాప్రతినిధులకు భాగస్వామ్యం కల్పించకుం టే ఎలా అని సీఎం కేసీఆర్ అన్నట్లు తెలిసింది. సమీక్ష సమావేశానికి సంధించిన సమాచారాన్ని పొందుపరిచిన పుస్తకాలను సమావేశంలో ముఖ్యమంత్రి పక్కన కూర్చున్న స్పీకర్, మంత్రులకే ఇవ్వడంపై రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్.. కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.

మనది పారదర్శక ప్రభుత్వమని ఎంపీలు, ఎమ్మెల్యేలకు సమీక్ష వివరాలు అందరికీ ఇవ్వకపోతే ఎలా అని కలెక్టర్ జి.కిషన్‌ను కేసీఆర్ ప్రశ్నించారు. ఈ సమాచార పుస్తకం నేరుగా రాష్ట్ర కార్యాలయం నుంచే వచ్చాయని కలెక్టర్ వివరణ ఇచ్చుకున్నారు. మొత్తంగా ప్రధాన అంశాలపై అధికారుల తీరు సరిగా లేకపోవడంతో కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు.

‘అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సాగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. 2 నెలల్లో మరోసారి వస్తా. రెండు రోజులపాటు సమీక్ష నిర్వహిస్తా. అప్పుడు అందరం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలి’ అని కేసీఆర్ చెప్పారు. రోడ్లు, భవనాల శాఖ తీరుతో జిల్లా యంత్రాంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, రాష్ట్ర ఉన్నతాధికారులకు చులకన భావం ఏర్పడిందని జిల్లా ఉన్నతాధికారులే అంగీకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement