జిల్లా విద్యాశాఖలో ఇన్‌చార్జిలతో కాలం గడుపుతున్నారు. భారీ సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా, వాటిని భర్తీ చేసే ప్రయత్నం జరగడం లేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, పర్యవేక్షణ ప్రశ్నార్థకంగా మారాయి.
* బోధనా లేదు.. పర్యవేక్షణా లేదు
* 36 మంది ఎంఈవోలు, ఐదుగురు డీవైఈవోలు ఇన్‌చార్జిలే
* 423 ఎస్‌జీటీ, 378 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ
* డైట్‌లో భర్తీకాని 19 పోస్టులు
నూజివీడు : జిల్లాలో విద్యాశాఖ దిక్కులేని దివాణంగా మారింది. భావి భారత పౌరులను తీర్చిదిద్దే విద్యావ్యవస్థకు గత కొన్నేళ్లుగా ఇన్‌చార్జిలే దిక్కవుతున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి పాఠశాలల పనివేళలను పొడిగించినా.. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులందరూ ఇన్‌చార్జిలే కావడంతో పర్యవేక్షణే లేకుండా పోయింది. దీంతో ఉపాధ్యాయులు ఆడిందే బడి, చెప్పిందే పాఠం అన్నచందంగా తయారైంది.
వడ్డీ వ్యాపారం, రియల్ ఎస్టేట్ బిజినెస్, చిట్‌ఫండ్ వ్యాపారం ఇలా అనేక ఇతర కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు మునిగి తేలుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏడాదికేడాదికి పిల్లల సంఖ్య దారుణంగా పడిపోతున్నా పాలకులు వాటిని బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలు శూన్యం. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 3,450, ప్రాథమికోన్నత పాఠశాలలు 575, జిల్లా పరిషత్ హైస్కూళ్లు 450 వరకు ఉన్నాయి. వాటిలో విద్యనభ్యసిస్తున్న వారంతా పేద వర్గాలకు చెందిన, కాన్వెంట్లలో ఫీజులు చెల్లించే స్తోమత లేని కుటుంబాల విద్యార్థులే.
ఖాళీలే ఖాళీలు...
జిల్లాలో ఐదు డీవైఈవో పోస్టులు ఉండగా, అన్నీ ఖాళీగానే ఉన్నాయి. నూజివీడు, గుడివాడ, మచిలీపట్నం, విజయవాడ, నందిగామలలో ఈ పోస్టులుండగా అన్నిచోట్లా ఇన్‌చార్జిలే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎంఈవో పోస్టులు 50 ఉండగా, అందులో 36 మండలాల్లో ఇన్‌చార్జిలే పనిచేస్తున్నారు. ఆయా మండలాల హైస్కూళ్లలోని స్కూల్ అసిస్టెంట్లలో ఎంఈవోగా పనిచేయడానికి అంగీకరించినవారిని ఇన్‌చార్జిలుగా నియమించారు. దాదాపు దశాబ్దకాలంగా విద్యాశాఖలో ఇదే పరిస్థితి నెలకొన్నప్పటికీ దీనిని మార్చే ప్రయత్నం చేయడం లేదు.
విస్సన్నపేట, చాట్రాయి, ఆగిరిపల్లి, విజయవాడ అర్బన్, ఇబ్రహీంపట్నం, నందిగామ, జగ్గయ్యపేట, గన్నవరం, తోట్లవల్లూరు, వత్సవాయి, పెనుగంచిప్రోలు, వీరులపాడు, గుడివాడ, కోడూరు మండలాలకు సంబంధించి మాత్రమే రెగ్యులర్ ఎంఈవోలు ఉన్నారు. మిగిలిన మండలాలకు పనిచేస్తున్నవారంతా ఇన్‌చార్జిలే. దీంతో ఆయా మండలాల్లో పాఠశాలల పర్యవేక్షణ చాలా దారుణంగా ఉంటోంది. మరికొన్నిచోట్ల ఎంఈవో తమ కులం వాడే కాబట్టి తమను ఏమీ అనడంటూ పాఠశాలలకు వెళ్లకుండా ఉపాధ్యాయులు రోడ్ల వెంట కాలక్షేపం చేస్తున్నారు.
డైట్ పరిస్థితి దారుణం
అంగలూరులోని డైట్ పరిస్థితి దారుణంగా ఉంది. ఉపాధ్యాయులను తయారుచేసే డైట్‌లో కూడా ఖాళీలు ఉన్నాయి. 14 లెక్చరర్ పోస్టులు, 5 సీనియర్ లెక్చరర్ పోస్టులు కలిపి మొత్తం 19 ఖాళీగా ఉన్నాయి. రెగ్యులర్‌గా పనిచేసేవారు కేవలం ఐదుగురు ఉన్నారు. వారిలో ముగ్గురు లెక్చరర్లు కాగా, ఇద్దరు సీనియర్ లెక్చరర్లు. విద్యార్థులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో అర్హత ఉన్న స్కూల్ అసిస్టెంట్లు ఏడుగురు డిప్యుటేషన్‌పై డైట్‌లో పనిచేస్తున్నారు.
వీటికి తోడు జిల్లాలో 423 ఎస్‌జీటీ పోస్టులు, 378 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది జిల్లాలో 169 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఎనిమిదో తరగతిని ప్రవేశపెట్టినప్పటికీ ఆయా పాఠశాలలకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మంజూరు చేయలేదు. జిల్లాలో విద్యాశాఖ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే పేదవర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య లభించడం ప్రశ్నార్థకమే.
విద్యాశాఖకు ఇన్‌చార్జిలే దిక్కు!
Published Thu, Nov 6 2014 3:06 AM | Last Updated on Fri, Sep 28 2018 4:43 PM
Advertisement
Advertisement