అలవిమాలిన హామీలతో మభ్యపెట్టే యత్నం
స్మార్ట్ సిటీ లేదు, అందరికీ ఇళ్లూ లేవు..
అభివృద్ధి పేరుతో మోసగిస్తారా?
బాబు తీరుతో విస్తుపోతున్న కాకినాడ ప్రజలు
కాకినాడ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాకినాడకు ఇచ్చిన ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. భూ గర్భ డ్రైనేజీ, స్మార్ట్ సిటీ మొదలు కాపుల రిజర్వేషన్ల వరకు... ఒక్క హామీ కూడా అమలు కాలేదు. కాకినాడకు భూ గర్భ డ్రైనేజీ లేక పలు ప్రాంతాలు మురికి కూపాలుగా తయారయ్యాయి. ఈ పరిస్థితిని నివారించి సుందర నగరంగా తీర్చిదిద్దుతానని ఇటీవల కాకినాడ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే అది ఆచరణ సాధ్యం కాదని నగర ప్లానింగ్ అధికారులు ఎప్పుడో తేల్చారు. సాధ్యం కాదని తెలిసీ చంద్రబాబు ఈ హామీ ఇవ్వడం నగర ప్రజలను నిశ్చేష్టులను చేసింది. నగరం మురికి కూపంగా మారకుండా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తానన్న హామీ కూడా కాగితాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో కాకినాడకు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమిటి? వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటో ఒక్కసారి పరిశీలిస్తే...
అలవిమాలిన హామీలు.. అడుగు ముందుకు పడలేదు..
కాకినాడలో రూ.32 వేల కోట్లతో పెట్రో కెమికల్ కాంప్లెక్స్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్, కాకినాడకు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, ఔటర్ రింగ్‌రోడ్డు, నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేలా మరో ఫ్లైఓవర్, ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి, దోమల బెడద నివారించేలా డ్రైనేజీ, స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం, కాకినాడతో అనుసంధానం చేసేలా బకింగ్‌హాం కెనాల్ ప్రాజెక్టు, స్మార్ట్‌సిటీగా అభివృద్ధి, పేద ప్రజలకు మంచినీటిని సరఫరాకు 36 కోట్లతో ప్రాజెక్టు, కేంద్రప్రభుత్వ స్కీం కింద 3,600 ఇళ్ల నిర్మాణం, ఇంద్రపాలెం జంక్షన్ ఎన్టీఆర్ వంతెన మధ్య ఉన్న ఉప్పుటేరును రూ.90 కోట్లతో పర్యాటక ప్రాంతంగా మార్పు, బొమ్మల తయారీ పరిశ్రమ ఏర్పాటు, కాకినాడను హార్డ్‌వేర్ ఉత్పత్తుల తయారీ కేంద్రంగా మార్పు, 2 వేల ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి, రూ. 77.05 కోట్లతో మురికి కాలువల తవ్వకం, ఎల్‌ఈడీ లైట్లు, పేదల బస్తీలలో 34,179 ఇళ్ల నిర్మాణం, కొండాయపాలెం రైల్వే గేటు ప్రాజెక్టు... ఇలా లెక్కకు మిక్కిలి హామీలను ఇవ్వడంతో పాటు ఈ పనులన్నీ 2019 నాటికి పూర్తి చేస్తామన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం వచ్చి మూడున్నర ఏళ్లు గడిచినా ఈ హామీలలో ఏ ఒక్కదాన్నీ అమలు చేయలేదు. అధికారమే పరమావధిగా అలవిమాలిన హామీలు ఇచ్చిన చంద్రబాబు వాటి అమలు దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. పోర్టు రోడ్డు నుంచి జగన్నాధపురం మీదుగా యానాం వెళ్లేందుకు నిర్మిస్తామన్న ఫ్లైఓవర్ పనుల్ని ఇంతవరకు పట్టించుకోలేదు.
కొలిక్కిరాని డంపింగ్ యార్డ్ సమస్య
కాకినాడను పట్టిపీడిస్తున్న సమస్యల్లో అతి పెద్దది డంపింగ్ యార్డ్ సమస్య. ఈ సమస్య కొలిక్కిరాకపోవడంతో కాకినాడ నగరమే ఓ పెద్ద డంపింగ్ యార్డ్‌గా తయారైంది. ప్రతి నిత్యం కాకినాడలో 225 టన్నుల చెత్త తయారవుతోంది. డంపింగ్ యార్డ్, సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్ లేకపోవడంతో నగరం మురికి కూపంగా తయారవుతోంది.
అందరికీ ఇళ్లు... అదో పెద్ద స్కాం...
సెంట్రల్ అర్బన్ హౌసింగ్ స్కీం కింద 4,600 అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇస్తే లబ్ధిదారుల ఎంపిక పేరిట కొంతకాలం, స్థలం పరిశీలన పేరిట మరికొంత కాలం చంద్రబాబు సర్కార్ జాప్యం చేసింది. తీరా పర్లోపేట వద్ద 46 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేస్తే అందులో 25 ఎకరాల భూమి ఉప్పిరిసిన భూమి కావడంతో ఇళ్ల నిర్మాణానికి పనికి రాదని తేల్చారు. ఈలోగా అధికారులు, జన్మభూమి కమిటీ సభ్యులు హడావిడి చేసి లబ్ధిదారుల జాబితాలు తయారు చేసి ఒక్కొక్కరి నుంచి రు.25 వేలు వసూలు చేశారు. లబ్ధిదారులు అప్పొసప్పో చేసి తీసుకువచ్చి కట్టిన ఆ మొత్తం ఇప్పుడు మున్సిపాలిటీ వద్ద నిరుపయోగంగా పడి ఉంది. ఇలా ఏ పథకమూ ముందుకు సాగలేదు.
స్మార్ట్‌సిటీకి కేంద్ర నిధులే ఖర్చు చేయలేదు...
కేంద్రప్రభుత్వం కాకినాడను స్మార్ట్‌సిటీల జాబితాలో చేర్చి తొలి ఏడాది రూ. 393 కోట్ల నిధులను కేటాయిస్తే ఇంతవరకు కేవలం రూ. 5.25 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. రెండో సంవత్సరం నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా వాటిని తీసుకువచ్చి అభివృద్ధికి వినియోగించే పరిస్థితి లేకపోవడం విషాదం. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ (పీఎంసీ)లో తమ వారిని నియమించుకోవాలన్న తపనతో చంద్రబాబు అనుచరులు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడం, అది కోర్టుల దాకా పోవడంతో స్మార్ట్ సిటీ ప్రకటించి 20 నెలలు దాటినా ఏ ఒక్క పనీ పూర్తి కాలేదు. కమీషన్ల కక్కుర్తే ఇందుకు కారణమని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇంక మిగిలింది ఏడాదిన్నరే...
చంద్రబాబు కాకినాడకు ప్రకటించిన పథకాలన్నీ 2019 నాటికి పూర్తి కావాల్సి ఉంది. ఈ లెక్కన ఇక మిగిలింది కేవలం ఏడాదిన్నర కాలం. ఇంత స్వల్ఫకాలంలో ప్రణాళికలు తయారయ్యేదెప్పుడు, అభివృద్ధి పనులు చేపట్టెదెప్పుడో దేవుడికే తెలియాలని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.