
వికలాంగుల పింఛన్లకు ని‘బంధనాలు’
- పెరిగిన పింఛను అందుకోవడం కష్టమే
- జిల్లాలో 80 శాతం అర్హులకు నష్టం
కోటవురట్ల మండలం కె.వెంకటాపురానికి చెందిన వికలాంగుడు లాలం అప్పలనాయుడు ఏ పనీ చేయలేడు. అన్నిటికీ తల్లిపైనే ఆధారపడుతుంటాడు. అతనికి 75 శాతం వైకల్యం ఉందని గతంలో వైద్యాధికారులు ధ్రువీకరించారు. మాకవరపాలెం మండలం జి.కోడూరుకు చెందిన వెలగా రమణకు 79 శాతం వైకల్యం ఉంది. వీరిద్దరూ కొత్తగా పెంచిన పింఛను అందుకోలేరు. తెలుగుదేశం ప్రభుత్వం పింఛన్ల నిబంధనల్ని కఠినతరం చేయడమే కారణం. ఈ సమస్య వీరిద్దరిదే కాదు. జిల్లా వ్యాప్తంగా 80 శాతం వికలాంగులది. ప్రత్యేక నిబంధనలతో అత్యధిక సంఖ్యలో వికలాంగులు పింఛన్లకు నోచుకోలేరు.
నర్సీపట్నం రూరల్: రైతు, డ్వాక్రా రుణ మాఫీలను పక్కనపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం వికలాంగుల పింఛన్లపై కన్నేశారు. పింఛను మొత్తాన్ని పెంచేందుకు కూడా ప్రత్యేక నిబంధనలు విధించారు. దీంతో అర్హులైన వికలాంగులు సైతం నష్టపోతున్నారు. జిల్లాలో వృద్ధులు, వితంతువులు, చేనేతతో పాటు వికలాంగుల పింఛన్లు కలిపి 3,18,175 మంది లబ్ధిదారులున్నారు.
వీరికి ప్రతి నెలా రూ.9,14,15 వేల పంపిణీ చేస్తున్నారు. వీరిలో వితంతువులు, వృద్ధులకు ఇంతవరకు నెలకు రూ.200, వికలాంగులకు రూ.500 చొప్పున పంపిణీ చేసేవారు. ఎన్నికల ముందు వీటిని రూ.1,000, రూ.1,500 పెంచుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక పింఛన్ల పెంపును వీలైనంతవరకు తగ్గించేందుకు ఎక్కడా లేని నిబంధనలను విధించారు.
జాబితాకు రూపకల్పన
జిల్లాలో పింఛన్లు తీసుకుంటున్న వికలాంగులు 38,690 మంది. వీరిలో 40 నుంచి 79 శాతం వైకల్యం ఉన్నవారు 6,306 మంది మాత్రమే. ఎన్నికల ముందు వికలాంగులందరికీ పింఛన్లు పెంచుతామంటూ ప్రకటించిన చంద్రబాబు వీటి అమలుకు ప్రత్యేక నిబంధనలు విధించారు. 40 నుంచి 79 శాతం వైకల్యం ఉన్న వారిని రూ.వెయ్యికే పరిమితం చేయగా, 80 శాతానికి మించిన వారికి రూ.1,500 పెంచుతున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నిబంధనల వల్ల జిల్లాలో 32,384 మంది వికలాంగులు నష్టపోతారు. దీనిపై ప్రభుత్వం నుంచి జిల్లా కార్యాలయాలకు ఉత్తర్వులు రావడంతో జాబితా తయారీలో నిమగ్నమయ్యారు. వీటిని గాంధీజయంతి సందర్భంగా అక్టోబరు 2 నుంచి పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై వికలాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాకచంద్రబాబు నిజస్వరూపం బయట పడిందన్నారు.