కొరిటెపాడు(గుంటూరు),న్యూస్‌లైన్
తెలుగు తమ్ముళ్లు అసంతృప్తితో రగులుతున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ కేటాయింపులో పార్టీని నమ్ముకున్న వారిని కాదనడంపై మండిపడుతున్నారు. కొత్తగా పార్టీలో చేరే వ్యాపారవేత్తకు టికెట్ కేటాయించాలనుకుంటున్న అధినేత వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక రానున్నరెండు రోజుల్లో సమావేశమై రాజకీయంగా ఓ నిర్ణయం తీసుకోనున్నుట్టు సమాచారం.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో పోగు పడిన అంతర్గత కలహాలు కొద్ది రోజులుగా బయటపడుతున్నాయి. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ లేకపోవడంతో ఆ పార్టీ నాయకులు సైకిల్ ఎక్కుతున్నారు. ఇదే టీడీపీ కొంప ముంచుతోంది. కొత్త వారిని చూసుకుని పార్టీని నమ్ముకుని పని చేస్తున్నవారిని పక్కన పెట్టడంతో వారిలో అసంతృప్తికి కారణమైంది.దీంతో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు రెండు, మూడురోజుల్లో సమావేశమై పార్టీకి, పదవులకు రాజీనామాలు చేయనున్నట్లు సమాచారం.
పశ్చిమ నియోజకవర్గంపై కొరవడిన స్పష్టత
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. టికెట్ ఆశిస్తూ వచ్చిన వారికి చుక్కలు కనపడుతున్నాయి.
తొలి నుంచి మాజీ కార్పొరేటర్లు యాగంటి దుర్గారావు, మద్దిరాల మ్యానీలతో పాటు వ్యాపారవేత్త కోవెలముడి రవీంద్ర, సీనియర్ నాయకులు మన్నవ సుబ్బారావు, దాసరి రాజా మాస్టారు, పాటిబండ్ల విజయ్‌లు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇదిలావుంటే, గత ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త తులసి రామచంద్రప్రభు సోమవారం చంద్రబాబును కలవడం, టికెట్ ఆయనకే ఇస్తున్నారన్న ప్రచారం జరగడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
కష్టకాలంలో పార్టీకి కాపుకాసిన తమను కాదని తులసికి టికెట్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. పార్టీలో మైనార్టీలకు, క్రిస్టియన్లకు న్యాయం జరగడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీలుగా ఉన్న తమకు బీసీ కోటాలో కానీ ఎస్సీ కోటాలో కాని టికెట్ కేటాయించడం లేదని మ్యానీ ఆరోపిస్తుండగా పశ్చిమ నియోజకవర్గం ఇన్‌చార్జిగా పార్టీ జెండాను మోసిన తనకు టికెట్ కేటాయించకపోవడం ఏంటని యాగంటి ప్రశ్నిస్తున్నారు.
దీనిపై రెండు, మూడు రోజు ల్లో తన అనుచరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో టీడీపీకి రాజీనామా చేయాలంటూ యాగంటి దుర్గారావు, మద్దిరాల మ్యానీలపై ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. అలాగే కోవెలమూడి రవీంద్ర ఇప్పటి వరకు పార్టీ కోసం ఎంతో డబ్బు ఖర్చు చేశారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
పార్టీ అభివృద్ధికి కృషి చేసినా తమను పరిగణలోకి తీసుకోకపోవడంపై మండి పడుతున్నారు. పార్టీలో ఎంతో కాలంగా పనిచేస్తున్న మన్నవ సుబ్బారావు సైతం అసహనంగా ఉన్నారు. ఆయన స్వయంగా చంద్రబాబును కలిసి టికెట్ కోరినా ఎలాంటి హామీ రాక పోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు.
మరోవైపు పార్టీలో తొలి నుంచి పనిచేసిన కాపులకు అన్యాయం జరుగుతుందని ఆ వర్గం నాయకులు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ టికెట్ విషయంలో అన్యాయం జరిగిందని, ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ సైతం కేటాయించకపోవడంతో పార్టీకి రాజీనామా చేయాలని కార్యకర్తలు దాసరి రాజా మాస్టారుపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. రెండురోజుల్లో వీరంతా సమావేశమై ఓ నిర్ణయానికి రానున్నట్టు సమాచారం.
అసంతృప్తిలో తెలుగు తమ్ముళ్లు
Published Thu, Mar 20 2014 1:41 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement