ఉల్లి.. తల్లివంటిదని అంటారు. ఓ కవి ‘ఉల్లుండవలయు లేదా తల్లుండవలయు భోజనోత్సవ వేళన్!’ అన్నాడు. ఎవరెలా అన్నా ప్రతి రోజూ వంటకాల్లో ఉల్లిపాయకు ఎంతో ప్రాధాన్యం ఉంది. తగ్గిన దిగుబడితో ప్రస్తుతం మార్కెట్లో దాని ధర రెక్కలు కట్టుకు విహరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాయితీపై ఉల్లిపాయలు సరఫరా చేయాలని నిర్ణయించింది. దీనిని కూడా కొంతమంది అక్రమార్కులు అవకాశంగా పయోగించుకుంటున్నారు. రాయితీపై వస్తున్న సరుకును అధిక ధరకు నల్లబజారుకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
తుని : దిగుబడి తగ్గిపోవడంతో ఉల్లి ధరలకు రెక్కలు వచ్చాయి. బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.35 నుంచి రూ.45 వరకూ ఉంది. దాదాపు ప్రతి కుటుంబంలోనూ ఉల్లి వినియోగం రోజువారీ అధికంగానే ఉంటుంది. ధర పెరగడంతో నెలవారీ బడ్జెట్‌లో దీనికే రూ.500 వరకూ వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాయితీపై ఉల్లిపాయలు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బహిరంగ మార్కెట్‌కంటే తక్కువ ధరకు ఉల్లిపాయలు సరఫరా చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం తూతూమంత్రంగానే దీనిని విక్రయిస్తున్నారు. రాయితీపై విక్రయించేందుకు పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రతి నియోజకవర్గానికి 10 టన్నుల చొప్పున ఉల్లిపాయలు సరఫరా చేశారు.
వీటి అమ్మకం బాధ్యతను రేషన్ డీలర్లకు అప్పగించారు. తెల్లకార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కిలో రూ.20 చొప్పున 2 కిలోలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల ఒకటిన అట్టహాసంగా మార్కెట్ యార్డుల్లో, రైతుబజార్లలో వీటి అమ్మకాలు ప్రారంభించారు. దీంతో ఉల్లికోసం జనం బారులు తీరడం మొదలుపెట్టారు. అసలు కథ ఇక్కడే మొదలైంది. కొన్నిచోట్ల పంపిణీ సక్రమంగానే జరుగుతున్నా.. కొంతమంది ప్రభుత్వం సరఫరా చేసిన ఉల్లిపాయలను గుట్టు చప్పుడు కాకుండా నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. క్వింటాల్ ఉల్లిని రూ.2600కు అమ్ముకుంటున్నారు. బయట మార్కెట్లో క్వింటాల్ ధర రూ.3వేలు పైగానే ఉంది. మొత్తంగా జిల్లాలో సుమారు 250 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను రాయితీపై అందించాల్సి ఉండగా, ఈ సరుకును నల్లబజారుకు తరలించి, టన్నుకు రూ.6 వేల చొప్పున అడ్డదారిలో సంపాదిస్తున్నారు.
ఒక్క తుని నియోజకవర్గంలోనే ఒక టన్ను ఉల్లిపాయలను రాయితీపై కౌంటర్ల ద్వారా విక్రయించారు. మిగిలిన తొమ్మిది టన్నులను బయటి వ్యాపారులకు ఎక్కువ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఇలా ఒక్క తునిలోనే రూ.50 వేలు అడ్డదారిన సంపాదించారు. ఇతర నియోజవకర్గాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్టు సమాచారం. అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించినందువల్లనే రాయితీ ఉల్లి నల్లబజారుకు తరలిపోయిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం ఫలితంగా తమకు ఉల్లి ధరల ఘాటు తప్పడంలేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
నల్లబజారుకు.. రాయితీ ఉల్లి
Published Wed, Aug 5 2015 2:36 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM
Advertisement
Advertisement