సాక్షి, అమరావతి:వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన బిల్లుల చెల్లింపుల్లో వివక్ష చూపడం పట్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆర్థిక శాఖ అధికారులపై సీరియస్ అయ్యారు. బిల్లుల చెల్లింపుల్లో పక్షపాతంతో వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కేటాయింపులు లేని అంశాలకు బిల్లులు చెల్లిస్తూ కేటాయింపులున్న రంగాలకు నిలిపివేయడంపై ప్రశ్నించారు.
చివరి మూడు నెలలు ఇష్టారాజ్యం..
ఎన్నికలకు ముందు ప్రకటించిన ఓట్ల పథకాలు / కమీషన్లు వచ్చే మొబిలైజేషన్ అడ్వాన్స్‌లకు మాత్రమే ఆర్థిక శాఖ బిల్లులు చెల్లించడాన్ని ‘సాక్షి’ గతంలోనే వెలుగులోకి తేవడం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించిన విధంగా కాంట్రాక్టులు, రాజకీయ ప్రయోజనాలతో ముడిపడ్డ బిల్లులు మాత్రమే చెల్లిస్తూ మిగతావాటిని ఆర్థిక శాఖ నిలిపివేస్తోంది. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులతోపాటు సకాలంలో
బిల్లులు సమర్పించలేదంటూ రెగ్యులర్ ఉద్యోగుల వేతనాలను సైతం నిలుపుదల చేసింది. ఉద్యోగ సంఘాలు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వేతనాలు నిలిపివేయడంపై వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం సీఎస్ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్థిక ఏడాది ముగిసే చివరి మూడు నెలలు అంటే జనవరి నుంచి మార్చి వరకు ఇష్టానుసారంగా బిల్లుల చెల్లింపులు జరిగాయని, ప్రాధాన్య అంశాలను విస్మరించారని సీఎస్ తప్పుబట్టారు.
రాష్ట్రం వాటా విడుదల చేయకపోవడంతో భారీ నష్టం
ఉద్యోగులకు వేతనాలు చెల్లించకుండా ఇతర రంగాలకు నిధులు మళ్లించడంపై ఆర్థిక శాఖ అధికారులను సీఎస్ నిలదీశారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు విడుదలైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోవడంతో భారీగా నిధులు కోల్పోవాల్సి వచ్చిందని, ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారంటూ సీఎస్ ఆర్థిక శాఖ అధికారులను నిలదీశారు. తాత్కాలిక ప్రాతిపదికన బిల్లులు చెల్లించడంతోపాటు పక్షపాతంతో చెల్లింపులు జరపడంపై ఆర్థికశాఖను సీఎస్ వివరణ కోరారు. తప్పనిసరిగా చెల్లించాల్సిన బిల్లులను కూడా నిలుపుదల చేయడం అంటే పరిస్థితిని ఎంత దిగజార్చారో అర్థం అవుతోందా? అని సీఎస్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. రాజకీయాలతో సంబంధం లేకుండా నిబంధనల మేరకు ప్రాధాన్యత ప్రకారం బిల్లులు చెల్లించే ఆనవాయితీకి ఎందుకు తిలోదకాలు ఇవ్వాల్సి వచ్చిందని ఆర్థిక శాఖ అధికారులను సీఎస్ ప్రశ్నించారు.
ఉద్యోగుల వేతనాలకు ఎసరు
ఓట్ల పథకాలు, కమీషన్లు వచ్చే బిల్లులు చెల్లించడం కోసం వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వ్యక్తిగత ఖాతాల్లోని నిధులను రాష్ట్ర ప్రభుత్వం లాక్కుంది. ఫలితంగా రెండు నెలలుగా అందులో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఏప్రిల్‌లో ఇప్పటివరకు వివిధ రంగాలకు చెందిన బిల్లులు పాసైనప్పటికీ చెల్లింపులు జరగకుండా నిలిచిపోయినవి రూ.11,108.61 కోట్లు ఉన్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. ఇందులో వేతనాలతోపాటు కార్పొరేషన్లు, ఇతర ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించిన బిల్లులున్నాయి.
చెల్లింపుల్లో తేడాకు కారణాలేంటి?
బిల్లుల చెల్లింపులో వ్యత్యాసాలకు కారణాలను రికార్డు చేయాల్సిందిగా సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. చట్టబద్ధంగా చేయాల్సిన చెల్లింపులకు, జీఎస్‌టీ, ఆదాయపు పన్ను, జ్యుడీషియరీ డిపాజిట్, టీఆర్‌ఆర్–27, రుణాల రీ పేమెంట్స్, వడ్డీల రీ పేమెంట్స్, వేతనాలు, పెన్షన్లు, అంతర్ ప్రభుత్వం అండ్ ఏజీ పేమెంట్స్, సీపీఎస్, స్థానిక సంస్థల నిధులు, డైట్ చార్జీలు, రేషన్, మెడిసిన్, మెడికల్ చికిత్సల బిల్లులు, మంచినీరు, ఎన్నికలకు సంబంధించిన బిల్లులను ప్రాధాన్య క్రమంలో చెల్లించాలని సీఎస్ పేర్కొన్నారు. పనుల బిల్లులను క్షుణ్నంగా అధ్యయనం చేసిన తరువాతే విడుదల చేయాలని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బిల్లుల చెల్లింపుల జరిగితే వాటిని నమోదు చేయడంతో పాటు ఆడిట్ నిర్వహించాలని సూచించారు. తొలుత వేతనాలకు చెందిన బిల్లులన్నింటినీ చెల్లించాలని సీఎస్ ఆదేశించారు.
బిల్లుల చెల్లింపుల్లో ఏమిటీ వివక్ష?
Published Sat, Apr 20 2019 4:44 AM | Last Updated on Sat, Apr 20 2019 7:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment