bills payments
-
బిట్ కాయిన్లతో, మెక్ డొనాల్డ్స్ కీలక నిర్ణయం
ప్రముఖ దిగ్గజ ఫాస్ట్ ఫుడ్ సంస్థ మెక్ డొనాల్డ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లు బిట్ కాయిన్లతో బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చని తెలిపింది. స్విట్జర్లాండ్ దేశం లుగానో నగరంలో బిట్‌కాయిన్, అసెట్ బ్యాక్డ్ స్టేబుల్ కాయిన్ టెథర్ చెల్లింపులకు మెక్ డొనాల్డ్స్ అంగీకరించింది. ఈ ఏడాది మార్చి నెలలో లుగానో అధికారులు టెథర్ ఆపరేషన్స్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. తద్వారా డిజిటల్ కరెన్సీలను ఉపయోగించి ట్యాక్స్ చెల్లింపులు పన్నులు, వస్తువుల కొనుగోలు చేసేలా లుగానో నివాసితులకు అనుమతించింది. 🇨🇭 Paying at McDonald's with #Bitcoin in Lugano, Switzerland. pic.twitter.com/8IdcupEEKQ — Bitcoin Magazine (@BitcoinMagazine) October 3, 2022 బిట్ కాయిన్ చెల్లింపుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో ప్రకారం..మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లో ఫుడ్ లవర్స్ డిజిటల్ కియోస్క్‌లో ఫుడ్ ఆర్డర్ చేసి, ఆపై మొబైల్ యాప్ సహాయంతో బిల్ పే చేస్తున్న దృశ్యాల్ని మనం గమనించవచ్చు. -
బిల్లుల చెల్లింపుల్లో ఏమిటీ వివక్ష?
సాక్షి, అమరావతి:వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన బిల్లుల చెల్లింపుల్లో వివక్ష చూపడం పట్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆర్థిక శాఖ అధికారులపై సీరియస్ అయ్యారు. బిల్లుల చెల్లింపుల్లో పక్షపాతంతో వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కేటాయింపులు లేని అంశాలకు బిల్లులు చెల్లిస్తూ కేటాయింపులున్న రంగాలకు నిలిపివేయడంపై ప్రశ్నించారు. చివరి మూడు నెలలు ఇష్టారాజ్యం.. ఎన్నికలకు ముందు ప్రకటించిన ఓట్ల పథకాలు / కమీషన్లు వచ్చే మొబిలైజేషన్ అడ్వాన్స్‌లకు మాత్రమే ఆర్థిక శాఖ బిల్లులు చెల్లించడాన్ని ‘సాక్షి’ గతంలోనే వెలుగులోకి తేవడం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించిన విధంగా కాంట్రాక్టులు, రాజకీయ ప్రయోజనాలతో ముడిపడ్డ బిల్లులు మాత్రమే చెల్లిస్తూ మిగతావాటిని ఆర్థిక శాఖ నిలిపివేస్తోంది. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులతోపాటు సకాలంలో బిల్లులు సమర్పించలేదంటూ రెగ్యులర్ ఉద్యోగుల వేతనాలను సైతం నిలుపుదల చేసింది. ఉద్యోగ సంఘాలు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వేతనాలు నిలిపివేయడంపై వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం సీఎస్ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్థిక ఏడాది ముగిసే చివరి మూడు నెలలు అంటే జనవరి నుంచి మార్చి వరకు ఇష్టానుసారంగా బిల్లుల చెల్లింపులు జరిగాయని, ప్రాధాన్య అంశాలను విస్మరించారని సీఎస్ తప్పుబట్టారు. రాష్ట్రం వాటా విడుదల చేయకపోవడంతో భారీ నష్టం ఉద్యోగులకు వేతనాలు చెల్లించకుండా ఇతర రంగాలకు నిధులు మళ్లించడంపై ఆర్థిక శాఖ అధికారులను సీఎస్ నిలదీశారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు విడుదలైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోవడంతో భారీగా నిధులు కోల్పోవాల్సి వచ్చిందని, ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారంటూ సీఎస్ ఆర్థిక శాఖ అధికారులను నిలదీశారు. తాత్కాలిక ప్రాతిపదికన బిల్లులు చెల్లించడంతోపాటు పక్షపాతంతో చెల్లింపులు జరపడంపై ఆర్థికశాఖను సీఎస్ వివరణ కోరారు. తప్పనిసరిగా చెల్లించాల్సిన బిల్లులను కూడా నిలుపుదల చేయడం అంటే పరిస్థితిని ఎంత దిగజార్చారో అర్థం అవుతోందా? అని సీఎస్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. రాజకీయాలతో సంబంధం లేకుండా నిబంధనల మేరకు ప్రాధాన్యత ప్రకారం బిల్లులు చెల్లించే ఆనవాయితీకి ఎందుకు తిలోదకాలు ఇవ్వాల్సి వచ్చిందని ఆర్థిక శాఖ అధికారులను సీఎస్ ప్రశ్నించారు. ఉద్యోగుల వేతనాలకు ఎసరు ఓట్ల పథకాలు, కమీషన్లు వచ్చే బిల్లులు చెల్లించడం కోసం వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వ్యక్తిగత ఖాతాల్లోని నిధులను రాష్ట్ర ప్రభుత్వం లాక్కుంది. ఫలితంగా రెండు నెలలుగా అందులో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఏప్రిల్‌లో ఇప్పటివరకు వివిధ రంగాలకు చెందిన బిల్లులు పాసైనప్పటికీ చెల్లింపులు జరగకుండా నిలిచిపోయినవి రూ.11,108.61 కోట్లు ఉన్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. ఇందులో వేతనాలతోపాటు కార్పొరేషన్లు, ఇతర ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించిన బిల్లులున్నాయి. చెల్లింపుల్లో తేడాకు కారణాలేంటి? బిల్లుల చెల్లింపులో వ్యత్యాసాలకు కారణాలను రికార్డు చేయాల్సిందిగా సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. చట్టబద్ధంగా చేయాల్సిన చెల్లింపులకు, జీఎస్టీ, ఆదాయపు పన్ను, జ్యుడీషియరీ డిపాజిట్, టీఆర్ఆర్–27, రుణాల రీ పేమెంట్స్, వడ్డీల రీ పేమెంట్స్, వేతనాలు, పెన్షన్లు, అంతర్ ప్రభుత్వం అండ్ ఏజీ పేమెంట్స్, సీపీఎస్, స్థానిక సంస్థల నిధులు, డైట్ చార్జీలు, రేషన్, మెడిసిన్, మెడికల్ చికిత్సల బిల్లులు, మంచినీరు, ఎన్నికలకు సంబంధించిన బిల్లులను ప్రాధాన్య క్రమంలో చెల్లించాలని సీఎస్ పేర్కొన్నారు. పనుల బిల్లులను క్షుణ్నంగా అధ్యయనం చేసిన తరువాతే విడుదల చేయాలని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బిల్లుల చెల్లింపుల జరిగితే వాటిని నమోదు చేయడంతో పాటు ఆడిట్ నిర్వహించాలని సూచించారు. తొలుత వేతనాలకు చెందిన బిల్లులన్నింటినీ చెల్లించాలని సీఎస్ ఆదేశించారు. -
నిధుల ఫ్రీజింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఖజానాపై ఆంక్షలు విధించింది. 2018–19 బడ్జెట్ సమీపిస్తుండటంతో బిల్లుల చెల్లింపులపై అనధికారిక ఫ్రీజింగ్‌ను అమల్లోకి తెచ్చింది. వేతన బిల్లులు మినహా మిగిలినవాటికి అనుమతి తీసుకోవాలని అన్ని జిల్లాల ట్రెజరీలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. గ్రీన్‌చానల్ ద్వారా బిల్లులు చెల్లిస్తున్న సాగునీటి ప్రాజెక్టులు, గురుకులాలు, హాస్టళ్ల బిల్లుల చెల్లింపుపైనా ఆంక్షలు పెట్టింది. మార్చి 12న 2018–19 బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్ తయారీ కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో నీటిపారుదల శాఖ ప్రాజెక్టులకు తమ అనుమతి లేకుండా ఆఖరి విడత బిల్లులు చెల్లించొద్దని ఆర్థిక శాఖ కట్టడి చేసింది. గత నెలలో ఆసరా పెన్షన్ల పంపిణీ రాష్ట్రమంతటా ఆలస్యమైంది. ఆర్థిక శాఖ సకాలంలో డబ్బులు విడుదల చేయకపోవటంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఒకటో తేదీన చెల్లించే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సైతం ఈ నెలలో 2 రోజులు ఆలస్యమయ్యాయి. 2 నెలలుగా వివిధ శాఖల్లో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు బిల్లుల్లేక అవస్థలు పడుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ బిల్లుల మంజూరుకు ఇబ్బంది పడుతున్నారు. సాగునీటి విభాగంలోనే రూ.6 వేల కోట్లకుపైగా పెండింగ్ బిల్లులున్నాయి. ఫిబ్రవరి 1న చెల్లించాల్సిన జీతాలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహి ళల పింఛన్లకు ఇబ్బంది రాకుండా జాగ్రత్త వహిస్తోంది. ఫిబ్రవరి, మార్చిల్లో అత్యవసర బిల్లులు, జీతాలు తప్ప ఇతర వాటిని నిలిపేసేలా అప్రమత్తం చేసింది. మే లోనే రైతులకు సాగు పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు రూ.5 వేల కోట్లకు పైగా ఒకే నెలలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకానికి భారీ మొత్తంలో నిధులు అవసరం కావటంతో ఆర్థిక శాఖ ఇప్పట్నుంచే ముందు జాగ్రత్త పడుతోంది. ఈ నేపథ్యంలోనే నిధుల సర్దుబాటుకు అత్యంత ప్రాధాన్యమిస్తూ అనధికార ఫ్రీజింగ్ అమలు చేస్తోంది. -
టాయ్‘లేట్’
మహబూబ్‌నగర్ న్యూటౌన్: స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యసాధనలో నిధుల కొరత వెంటాడుతోంది. లక్ష్యాన్ని చేరుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్న అధికారులను నిధుల విడుదలలో జాప్యం వెనక్ కలాగుతోంది. అధికారుల ప్రోత్సాహం, కళాజాతాల ద్వారా అవగాహన ఇతరత్రా కార్యక్రమాలతో ప్రజలు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ముందుకొస్తుండగా.. నెల రోజులుగా నిధులు నిలిచిపోవడం వారిలో నిరుత్సాహాన్ని నింపింది. తద్వారా లక్ష్యాన్ని చేరుకుంటామా, లేదా అని అధికారుల్లో ఆవేదన నెలకొంది. అక్టోబర్ 2 నాటికి ఓడీఎఫ్ జిల్లా జిల్లాలో ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నాటికి వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసి ఓడీఎఫ్ జిల్లాగా ప్రకటించాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో భాగంగా హన్వాడ మండలంలోని సల్లోనిపల్లి గ్రామాన్ని మాడల్‌గా ఎంపిక చేసి 24 గంటల్లో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేసి రాష్ట్రంలోనే చరి త్ర సృష్టించారు. అనంతరం మొదటి విడతగా 84 గ్రామాలను ఎంపిక చేయగా, గత ఏడాది అక్టోబర్‌లో 48 గ్రామాలను ఓడీఎఫ్‌గా ప్రకటించారు. ఇలా ప్రారంభమైన మరుగుదొడ్ల నిర్మాణ ఉద్యమం జిల్లాలో ఉధృతమైంది. ఈ మేరకు రెండో విడతలో జిల్లాలోని అన్ని గ్రామాలను ఓడీఎఫ్ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సంకల్పించి అధికారులు ముందుకు సాగారు. మొదటి విడతలో పూర్తయిన మరుగుదొడ్ల నిర్మాణాలు పోను ఇంకా జిల్లాలో అవసరమైన 1,67,033 మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. వీటి నిర్మాణానికి సిద్ధం కాగా.. ప్రభుత్వం నుండి నిధులు విడుదల కాకపోవడం అధికారులు, లబ్ధిదారుల్లో నిరుత్సాన్ని నింపుతోంది రెండు విడతలుగా నిధుల విడుదల... కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ భారత్ మిషన్‌లో నిర్మించే మరుగుదొడ్లకు రూ.12వేల చొప్పున చెల్లిస్తారు. ప్రభుత్వం అనుమతించిన మరుగుదొడ్డి నిర్మాణానికి మార్కింగ్, జియో ట్యాగింగ్, అప్లోడ్ పూర్తయ్యాక రూ.6వేల మొదటి విడతగా వస్తాయి. నిర్మాణం పూర్తయ్యాక రెండో ఫొటో అప్లోడ్ చేయగానే మిగతా రూ.6వేలు అం దాలి. కానీ అలా జరగకపోవడంతో లక్ష్యాన్ని చేరతామా, లేదా అనే మీమాంసలో అధికారులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇక బయట అప్పు లు ఎలా తీర్చాలా అని అధికారులు ఆందోళన చెందుతున్నారు. రెండో విడత నిధులు వస్తాయి కదా అనే ధీమాతో వారు బయట రింగ్‌లు, తలుపులు, సిమెంట్ తెప్పించారు. కానీ నిధులు రాకపోవడంతో పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఇది పక్కన పెడితే బిల్లులు రావడం తెలి యడంతో కొత్త నిర్మాణాలపై లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. నిధుల విడుదలలో జాప్యం నిజమే... స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా నిర్మిస్తున్న మరుగుదొడ్లకు బిల్లుల విడుదలలో కాస్త జాప్యం జరుగుతున్న మాట వాస్తమే. వారం క్రితం రూ.1.20కోట్లు విడుదలయ్యాయి. ఇంకా రూ.70 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉంది. ఆలస్యమైనా నిధులు విడుదలవుతాయనే నమ్మకం ఉంది. ఈ విషయమై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ పనులు నిలిపివేయకుండా చూస్తున్నాం. ఏది ఏమైనా నిర్దేశిత గడువులోగా లక్ష్యాన్ని చేరుకుంటామనే నమ్మకం ఉంది. – ఉదిత్, జిల్లా మేనేజర్, స్వచ్ఛ భారత్ మిషన్ -
బిల్లుకు లాకప్!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న ప్రస్తుత తరుణంలో బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఆంక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వం ట్రెజరీలో ఆంక్షలు ఎత్తివేసినట్టుగా చెబుతున్నప్పటికీ బిల్లుల మంజూరు విషయంలో ట్రెజరీలకు ఆర్థికశాఖ మౌఖికపరమైన ఆదేశాలు జారీచేసింది. మొత్తం బిల్లులో 20 శాతం మేరకు పెండింగ్‌లోనే ఉంచాలని మౌఖిక ఆదేశాల్లో స్పష్టం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా రాష్ట్ర చరత్రలోనే మొదటిసారిగా పోలీసుశాఖకు కూడా ట్రెజరీ ఆంక్షల వలయం చుట్టుకుంది. ఇతర అన్ని ప్రభుత్వశాఖల తరహాలోనే పోలీసుశాఖకు సంబంధించిన బిల్లులను కూడా పూర్తిస్థాయిలో మంజూరు చేయవద్దని ట్రెజరీలకు జారీచేసిన ఆదేశాల్లో ఆర్థికశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుత ఆంక్షల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా సుమారు రూ. 10 కోట్లకుపైగా నిధులు మంజూరు కాకుండా ట్రెజరీ ఆంక్షలతో మగ్గనున్నట్టు సమాచారం. రాష్ర్ట ఖజానాలో నిధులు నిండుకున్న నేపథ్యంలో ఏకంగా పోలీసుశాఖ బిల్లులపై కూడా కొర్రీలు వేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మగ్గనున్న రూ. 10 కోట్ల బిల్లులు..! వాస్తవానికి రాష్ట్ర ఖజానాలో సరిపడినన్నీ నిధులు లేవనే సాకుతో గత నెలలో ట్రెజరీపై ఆంక్షలను ప్రభుత్వం విధించింది. దీంతో అన్ని రకాల బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. కేవలం ఉద్యోగుల జీతభత్యాలు, ఉద్యోగుల పెన్షన్ చెల్లింపులతో పాటు ప్రతీ నెలా ఇవ్వాల్సిన సామాజిక పింఛన్ల మంజూరు మాత్రమే కొనసాగాయి. అయితే, కొద్దిరోజుల క్రితం ట్రెజరీ ఆంక్షలు సడలిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అన్నిరకాల బిల్లుల చెల్లింపులు చేస్తామని స్పష్టం చేసింది. అయితే, వాస్తవంగా ట్రెజరీ ఆంక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అటు ఉద్యోగుల జీతభత్యాలు, ఉద్యోగుల పెన్షన్ చెల్లింపులు, సామాజిక పింఛన్ల మంజూరుతో పాటు అద్దె వాహనాలు, విద్యుత్ బిల్లులు, టెలిఫోన్ బిల్లులు, నీటి చార్జీలు, బాడుగలు మొదలైన బిల్లులను 100 శాతం మంజూరు చేయాలని మాత్రమే ట్రెజరీలకు ఆర్థికశాఖ స్పష్టం చేసింది. మిగిలిన అన్ని రకాల చెల్లింపులను 80 శాతానికే పరిమితం చేయాలని పేర్కొంది. ఇందులో రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా పోలీసుశాఖకు సంబంధించిన బిల్లుల్లో కూడా 20 శాతం మేరకు కోత వేయాలని ట్రెజరీలకు తెలిపిన మౌఖిక ఆదేశాల్లో ఆర్థికశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మొదటిసారిగా..! ప్రజల రక్షణ కోసం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పనిచేసే పోలీసుశాఖ (హోం శాఖ)కు కూడా ట్రెజరీ తిప్పలు తప్పటం లేదు. పోలీసుశాఖ బిల్లులను కూడా 20 శాతం మేరకు పెండింగ్‌లో పెట్టాలని ట్రెజరీ శాఖకు ఆర్థికశాఖ నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. రాష్ట్ర చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసుశాఖకు నిధుల మంజూరులో ఆంక్షలు విధించడం మొదటిసారి అని ట్రెజరీశాఖ అధికారులే వాపోతున్నారు. మరోవైపు తమకు ఇచ్చే నిధుల విడుదలలో కూడా ఆంక్షలు విధించడం పట్ల పోలీసుశాఖ విస్తుపోతోంది. ఇది తమ మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రమాదమూ ఉందని పోలీసుశాఖ సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పోలీసు స్టేషన్లల్లో కేసుల నమోదు కోసం పేపర్లు లేని పరిస్థితి ఉందని... పేపర్ల బిల్లులను కేసు నమోదు చేసే వారి నుంచే వసూలు చేస్తున్న దుస్థితి ఉందనేది వీరి భావన. ఈ నేపథ్యంలో ఖర్చు చేసిన నిధుల్లో 20 శాతం కోత విధిస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని వీరు వాపోతున్నారు. నిలిచిపోతున్న బిల్లులు...! ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులను ఈ నెల 12వ తేదీ నాటికే సమర్పించేందుకు ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా వచ్చిన బిల్లుల మేరకు 80 శాతం నిధులను సుమారు రూ. 30 కోట్ల మేర బిల్లులను మంజూరు చేసినట్టు ట్రెజరీ అధికారులు పేర్కొంటున్నారు. మరో 20 శాతం పెండింగ్‌లో ఉన్నాయని అంటున్నారు. ఈ మొత్తం సుమారు రూ. 10 కోట్లకుపైగా ఉంటుందనేది వీరి ప్రాథమిక అంచనా. మరోవైపు బిల్లుల సమర్పణకు గడువును 25వతేదీ వరకూ పొడిగించిన నేపథ్యంలో ఈ పెండింగ్ బిల్లుల మొత్తం రూ. 20 కోట్లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సమాచారం. మొత్తం మీద ఆర్థిక ఆంక్షలు లేవంటూనే మౌఖికపరమైన ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు నిలిచిపోనుండటం పట్ల పనులు చేసిన సంస్థలు, కాంట్రాక్టర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.