బిల్లుకు లాకప్! | Lock the bill! | Sakshi
Sakshi News home page

బిల్లుకు లాకప్!

Published Sat, Mar 21 2015 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 11:09 PM

Lock the bill!

సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న ప్రస్తుత తరుణంలో బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఆంక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వం ట్రెజరీలో ఆంక్షలు ఎత్తివేసినట్టుగా చెబుతున్నప్పటికీ బిల్లుల మంజూరు విషయంలో ట్రెజరీలకు ఆర్థికశాఖ మౌఖికపరమైన ఆదేశాలు జారీచేసింది. మొత్తం బిల్లులో 20 శాతం మేరకు పెండింగ్‌లోనే ఉంచాలని మౌఖిక ఆదేశాల్లో స్పష్టం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా రాష్ట్ర చరత్రలోనే మొదటిసారిగా పోలీసుశాఖకు కూడా ట్రెజరీ ఆంక్షల వలయం చుట్టుకుంది.

ఇతర అన్ని ప్రభుత్వశాఖల తరహాలోనే పోలీసుశాఖకు సంబంధించిన బిల్లులను కూడా పూర్తిస్థాయిలో మంజూరు చేయవద్దని ట్రెజరీలకు జారీచేసిన ఆదేశాల్లో ఆర్థికశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుత ఆంక్షల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా సుమారు రూ. 10 కోట్లకుపైగా నిధులు మంజూరు కాకుండా ట్రెజరీ ఆంక్షలతో మగ్గనున్నట్టు సమాచారం. రాష్ర్ట ఖజానాలో నిధులు నిండుకున్న నేపథ్యంలో ఏకంగా పోలీసుశాఖ బిల్లులపై కూడా కొర్రీలు వేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.    
 
మగ్గనున్న రూ. 10 కోట్ల బిల్లులు..!
వాస్తవానికి రాష్ట్ర ఖజానాలో సరిపడినన్నీ నిధులు లేవనే సాకుతో గత నెలలో ట్రెజరీపై ఆంక్షలను ప్రభుత్వం విధించింది. దీంతో అన్ని రకాల బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. కేవలం ఉద్యోగుల జీతభత్యాలు, ఉద్యోగుల పెన్షన్ చెల్లింపులతో పాటు ప్రతీ నెలా ఇవ్వాల్సిన సామాజిక పింఛన్ల మంజూరు మాత్రమే కొనసాగాయి. అయితే, కొద్దిరోజుల క్రితం ట్రెజరీ ఆంక్షలు సడలిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అన్నిరకాల బిల్లుల చెల్లింపులు చేస్తామని స్పష్టం చేసింది. అయితే, వాస్తవంగా ట్రెజరీ ఆంక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

అటు ఉద్యోగుల జీతభత్యాలు, ఉద్యోగుల పెన్షన్ చెల్లింపులు, సామాజిక పింఛన్ల మంజూరుతో పాటు అద్దె వాహనాలు, విద్యుత్ బిల్లులు, టెలిఫోన్ బిల్లులు, నీటి చార్జీలు, బాడుగలు మొదలైన బిల్లులను 100 శాతం మంజూరు చేయాలని మాత్రమే ట్రెజరీలకు ఆర్థికశాఖ స్పష్టం చేసింది. మిగిలిన అన్ని రకాల చెల్లింపులను 80 శాతానికే పరిమితం చేయాలని పేర్కొంది. ఇందులో రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా పోలీసుశాఖకు సంబంధించిన బిల్లుల్లో కూడా 20 శాతం మేరకు కోత వేయాలని ట్రెజరీలకు తెలిపిన మౌఖిక ఆదేశాల్లో ఆర్థికశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
 
మొదటిసారిగా..!
ప్రజల రక్షణ కోసం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పనిచేసే పోలీసుశాఖ (హోం శాఖ)కు కూడా ట్రెజరీ తిప్పలు తప్పటం లేదు. పోలీసుశాఖ బిల్లులను కూడా 20 శాతం మేరకు పెండింగ్‌లో పెట్టాలని ట్రెజరీ శాఖకు ఆర్థికశాఖ నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. రాష్ట్ర చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసుశాఖకు నిధుల మంజూరులో ఆంక్షలు విధించడం మొదటిసారి అని ట్రెజరీశాఖ అధికారులే వాపోతున్నారు. మరోవైపు తమకు ఇచ్చే నిధుల విడుదలలో కూడా ఆంక్షలు విధించడం పట్ల పోలీసుశాఖ విస్తుపోతోంది.

ఇది తమ మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రమాదమూ ఉందని పోలీసుశాఖ సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పోలీసు స్టేషన్లల్లో కేసుల నమోదు కోసం పేపర్లు లేని పరిస్థితి ఉందని... పేపర్ల బిల్లులను కేసు నమోదు చేసే వారి నుంచే వసూలు చేస్తున్న దుస్థితి ఉందనేది వీరి భావన. ఈ నేపథ్యంలో ఖర్చు చేసిన నిధుల్లో  20 శాతం కోత విధిస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని వీరు వాపోతున్నారు.
 
నిలిచిపోతున్న బిల్లులు...!
ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులను ఈ నెల 12వ తేదీ నాటికే సమర్పించేందుకు ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా వచ్చిన బిల్లుల మేరకు 80 శాతం నిధులను సుమారు రూ. 30 కోట్ల మేర బిల్లులను మంజూరు చేసినట్టు ట్రెజరీ అధికారులు పేర్కొంటున్నారు. మరో 20 శాతం పెండింగ్‌లో ఉన్నాయని అంటున్నారు.

ఈ మొత్తం సుమారు రూ. 10 కోట్లకుపైగా ఉంటుందనేది వీరి ప్రాథమిక అంచనా. మరోవైపు బిల్లుల సమర్పణకు గడువును 25వతేదీ వరకూ పొడిగించిన నేపథ్యంలో ఈ పెండింగ్ బిల్లుల మొత్తం రూ. 20 కోట్లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సమాచారం. మొత్తం మీద ఆర్థిక ఆంక్షలు లేవంటూనే మౌఖికపరమైన ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు నిలిచిపోనుండటం పట్ల పనులు చేసిన సంస్థలు, కాంట్రాక్టర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement