సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఖజానాపై ఆంక్షలు విధించింది. 2018–19 బడ్జెట్ సమీపిస్తుండటంతో బిల్లుల చెల్లింపులపై అనధికారిక ఫ్రీజింగ్‌ను అమల్లోకి తెచ్చింది. వేతన బిల్లులు మినహా మిగిలినవాటికి అనుమతి తీసుకోవాలని అన్ని జిల్లాల ట్రెజరీలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. గ్రీన్‌చానల్ ద్వారా బిల్లులు చెల్లిస్తున్న సాగునీటి ప్రాజెక్టులు, గురుకులాలు, హాస్టళ్ల బిల్లుల చెల్లింపుపైనా ఆంక్షలు పెట్టింది. మార్చి 12న 2018–19 బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్ తయారీ కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో నీటిపారుదల శాఖ ప్రాజెక్టులకు తమ అనుమతి లేకుండా ఆఖరి విడత బిల్లులు చెల్లించొద్దని ఆర్థిక శాఖ కట్టడి చేసింది. గత నెలలో ఆసరా పెన్షన్ల పంపిణీ రాష్ట్రమంతటా ఆలస్యమైంది. ఆర్థిక శాఖ సకాలంలో డబ్బులు విడుదల చేయకపోవటంతో ఈ పరిస్థితి తలెత్తింది.
ఒకటో తేదీన చెల్లించే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సైతం ఈ నెలలో 2 రోజులు ఆలస్యమయ్యాయి. 2 నెలలుగా వివిధ శాఖల్లో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు బిల్లుల్లేక అవస్థలు పడుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ బిల్లుల మంజూరుకు ఇబ్బంది పడుతున్నారు. సాగునీటి విభాగంలోనే రూ.6 వేల కోట్లకుపైగా పెండింగ్ బిల్లులున్నాయి. ఫిబ్రవరి 1న చెల్లించాల్సిన జీతాలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహి ళల పింఛన్లకు ఇబ్బంది రాకుండా జాగ్రత్త వహిస్తోంది. ఫిబ్రవరి, మార్చిల్లో అత్యవసర బిల్లులు, జీతాలు తప్ప ఇతర వాటిని నిలిపేసేలా అప్రమత్తం చేసింది. మే లోనే రైతులకు సాగు పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు రూ.5 వేల కోట్లకు పైగా ఒకే నెలలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకానికి భారీ మొత్తంలో నిధులు అవసరం కావటంతో ఆర్థిక శాఖ ఇప్పట్నుంచే ముందు జాగ్రత్త పడుతోంది. ఈ నేపథ్యంలోనే నిధుల సర్దుబాటుకు అత్యంత ప్రాధాన్యమిస్తూ అనధికార ఫ్రీజింగ్ అమలు చేస్తోంది.
నిధుల ఫ్రీజింగ్
Published Mon, Jan 29 2018 2:23 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment