అవాంఛనీయ ఘటనలు జరిగితే మళ్ళీ ఆంక్షలు విధిస్తాం
కౌంటింగ్ చాలా ప్రశాంతంగా ముగిసింది: కలెక్టర్ శ్రీకేశ్ బి. లత్కర్
పోలింగ్ రోజు నుంచి మొత్తం 1,330 మంది అరెస్ట్
సమస్యాత్మక గ్రామాల్లో పెట్రోలింగ్ కొనసాగుతుంది: ఎస్పీ మలికా గార్గ్
సాక్షి, నరసరావుపేట: ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో విధించిన 144 సెక్షన్ అమలు ముగిసిందని కలెక్టర్ శ్రీకేశ్ బి. లత్కర్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో ఎస్పీ మలికా గార్గ్, జేసీ శ్యాంప్రసాద్‌తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు జరిగిన ఘర్షణల నేపథ్యంలో జిల్లాలో 28 రోజులు 144 సెక్షన్ అమలు చేశామని, శాంతి భద్రతలు అదుపులోకి రావడంతో ఆ నిబంధన ఎత్తేశామని చెప్పారు.
ర్యాలీలు, సమావేశాలకు మాత్రం పోలీసుల అనుమతి తప్పనిసరి అని అన్నారు. కౌంటింగ్ తరువాత జిల్లాలో చిన్న చిన్న ఘటనలు జరుగుతున్నాయని, ఆ ప్రాంతాల్లో మాత్రం ఆంక్షలు అమలు చేస్తున్నామన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా మళ్లీ ఆంక్షలు విధిస్తామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ సమయంలో గొడవలతో జిల్లాకు మచ్చ పడినప్పటికి, కౌంటింగ్ ప్రశాంతంగా జరిగి జిల్లాకు తిరిగి మంచిపేరు వచ్చిందన్నారు.
రాష్ట్రంలో ప్రశాంతంగా కౌంటింగ్ ముగిసిన జిల్లాల్లో పల్నాడు ముందుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరిగేలా పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. పోలింగ్ ప్రక్రియలో 13,739 మంది సిబ్బంది, కౌంటింగ్‌లో 2,136 మంది పాల్గొన్నారన్నారు. ముఖ్యంగా జిల్లాలో 86.5 శాతం ఓటింగ్ నమోదు చేసిన ఓటర్లను ప్రత్యేకంగా అభినందించారు.
దాడులకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ మలికా గార్గ్
కౌంటింగ్ ముగిసిన తరువాత జిల్లాలో అక్కడక్కడా గొడవలు జరుగుతున్నాయని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా ఎస్పీ మలికా గార్గ్ హెచ్చరించారు. గత రెండు రోజుల్లో గొడవలకు దిగిన వారిపై 46 కేసులు నమోదు చేసి, 140 మందిని అరెస్ట్ చేశామన్నారు. ప్రభుత్వ భవానాలపై రంగులు, విగ్రహాలు నచ్చకపోతే స్థానిక సంస్థలలో తీర్మానాలు చేసి అధికారికంగా మార్చాలని, చట్టాలను చేతుల్లోకి తీసుకోరాదన్నారు.
సమస్యాత్మక గ్రామాలలో పోలీస్ పెట్రోలింగ్ కొనసాగుతుందని చెప్పారు. గ్రామాలలో శాంతి కమిటీలు ఏర్పాటు చేసి గొడవలు జరగకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పోలింగ్ సమయంలో జిల్లాలో 168 కేసులు నమోదు చేసి 1,338 మందిని అరెస్ట్ చేశామని, త్వరలో ఛార్జిïÙట్‌లు వేసి తప్పు చేసిన వారికి శిక్షలు పడేలా చూస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment