ఎంపీ మిథున్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డిలపై ఆంక్షలు
నియోజకవర్గంలో పర్యటించడానికి వీల్లేదన్న పోలీసులు
పెద్దిరెడ్డి నివాసం గోడలు దూకి హడావుడి
వకుళమాత ఆలయానికి కూడా వెళ్లనివ్వని వైనం
ఇది కక్ష సాధింపు: ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, తిరుపతి టాస్క్‌ఫోర్స్: రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పుంగనూరు ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిని ఆ నియోజకవర్గంలో పర్యటించకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. శాంతి భద్రతల పేరుతో వారి పర్యటనలకు అడ్డు చెబుతున్నారు. కార్యకర్తల సమావేశంలో పాల్గొనడంతో పాటు కూటమి నేతల దాడుల్లో నష్టపోయిన వారిని పరామర్శించి, భరోసా కల్పించాలని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి నిర్ణయించారు.
ఆదివారం పార్లమెంట్ సమావేశాలు ఉండవు కాబట్టి ఢిల్లీ నుంచి తిరుపతి చేరుకున్నారు. ఇక్కడి నుంచి పుంగనూరుకు వెళ్లే సమయంలో పోలీసులు ఆదివారం ఆయన నివాసానికి చేరుకుని అక్కడికి వెళ్లడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. ఎంపీకి నోటీసులు ఇచ్చేందుకు గోడలు దూకి హడావుడి చేశారు. తిరుపతిలోని వకుళామాత ఆలయానికి కూడా వెళ్లడానికి వీలు లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.
పర్యటిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని సాకు చెప్పారు. అంతటితో ఆగని పోలీసులు.. ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని కలిసేందుకు వచ్చిన నియోజకవర్గ ప్రజలను సైతం లోనికి రానివ్వకుండా అడ్డుకున్నారు. వంద మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసి, పెద్దిరెడ్డి నివాసంలోకి ఎవరూ వెళ్లేందుకు లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజలను కలిసేందుకు కూడా ఒప్పుకోలేదు. ఇదే సమయంలో పుంగనూరు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పలువురు వైఎస్సార్‌సీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. తమ ఆదేశాలను పాటించకపోతే కేసులు పెడతామని బెదిరించారు.
నా నియోజకవర్గానికి నేను వెళ్లకూడదా?
ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి నేతలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, గతంలో ఎన్నడూ లేని సంస్కృతికి తెరలేపారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలోని తన నివాసంలో ఆదివారం ఉదయం ఆయన విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందన్నారు. నియోజకవర్గంలో ఎలక్ట్రికల్ బస్సు కంపెనీ రాకుండా, పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ఇన్ని గొడవల నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సుల ఫ్యాక్టరీ యాజమాన్యం సందిగ్ధంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పుంగనూరుకు ఏ పరిశ్రమలు రాకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తన నియోజక వర్గంలో పర్యటించకుండా, ప్రజల్ని కలవకుండా అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పేదల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జేసీబీలు తీసుకొచ్చి వైఎస్సార్‌సీపీ నాయకుల మామిడి తోటలు, ఆస్తులు, కుటుంబ సభ్యుల వాహనాలను ధ్వంసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలో పేదల ఆవులు కూడా ఎత్తుకెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎన్నికల సమయంలో రాజకీయంగా పోరాడితే అందరం స్వాగతిస్తాం. కానీ పేదల ఇళ్లపై దాడులు చేయడం దారుణం. మా వారిని పరామర్శించడానికి వెళుతుంటే పోలీసులు అడ్డుకోవడం ఏమిటి? నా నియోజకవర్గంలో నేను పర్యటించకూడదా? ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్తా. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. వైఎస్సార్‌సీపీకి 40 శాతం మంది ఓటేశారని, వారందరినీ రాష్ట్రం నుంచి తరిమేస్తారా?’ అని నిప్పులు చెరిగారు.
అరెస్టుకైనా, ప్రాణ త్యాగానికైనా సిద్ధం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటామని ఎంపీ మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ మారాలని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తాను బీజేపీలోకి వెళ్తున్నానని బుద్ధి లేని వారు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చల్లా బాబును అనేక సంవత్సరాల నుంచి చూస్తున్నప్పటికీ, ఇలాంటివి ఎప్పుడూ లేవని, బాబు ట్రాప్‌లో పడొద్దని హితవు పలికారు. గతంలో పోలీసులపై దాడి చేసిన చల్లా బాబు జైలుకు వెళ్లారన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల కోసం తాను అరెస్టుకైనా, ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మంత్రి పదవిని కాపాడుకోవడానికే రాంప్రసాద్ తమపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు.
పుంగనూరులో ఉద్రిక్తత
పుంగనూరు: ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీలు తమ సొంత నియోజకవర్గాలలో తిరగరాదని హెచ్చరికలు చేస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న ఘటనలు ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఆదివారం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి పుంగనూరులో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కూటమి నేతలు పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్‌లో ధర్నా చేపట్టి, నల్లజెండాలతో నిరసనకు దిగారు.
ఎమ్మెల్యే, ఎంపీలు రాకూడదంటూ దూషణల పర్వం కొనసాగించారు. సుమారు రెండు గంటల సేపు హైడ్రామా సాగింది. ఈ నెల15న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పుంగనూరు పర్యటన సమయంలో కూడా కూటమి నేతలు ఇలాగే అడ్డుకున్నారు. కూటమి నేతల తీరుతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు ఎంపీ మిథున్‌రెడ్డిని తిరుపతిలో హౌస్ అరెస్ట్ చేశామని తెలపడంతో కూటమి శ్రేణులు శాంతించారు.
Comments
Please login to add a commentAdd a comment