ఒక్క ప్రకటన.. ఒకే ఒక్క ప్రకటన.. రైతులను అయోమయానికి గురిచేస్తోంది. ఓ వైపు ఖరీప్ ముంచుకొస్తోంది. పెట్టుబడికి రుణాలు కావాలి. బ్యాంకర్లేమో పాత అప్పు చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామంటున్నారు. రుణమాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పారు. దీంతో రైతులు బకాయిలు చెల్లించలేదు. రైతులో, ప్రభుత్వమో ఎవరో ఒకరు పాతబకాయిలు చెల్లించేదాకా కొత్త రుణాలు ఇచ్చే ప్రసక్తే లేదని బ్యాంకర్లు తేల్చిచెబుతున్నారు. దీంతో చంద్రబాబు నోట ‘రుణమాఫీ’ ప్రకటన ఎప్పుడు వస్తుందా అని రైతులు ఎదురుచూస్తున్నారు.
సాక్షి, కడప: తాము అధికారంలోకి రాగానే రైతుల రుణాలను మాఫీ చేస్తామని ‘వస్తున్నా మీ కోసం’లో అనంతపురం జిల్లా గుత్తిలో పాదయాత్ర ముగింపు సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ హామీని పొందుపరిచారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈహామీతోనే తాము అధికారంలో కి వచ్చామని టీడీపీ కార్యకర్తలు, నాయకులు చర్చించుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీపైనే సర్వత్రా చర్చజరుగుతోంది. జూన్8న రాష్ట్రముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోయే చంద్రబాబునాయుడు ‘రుణమాఫీ’పై ప్రకటన చేస్తారా..లేదా.. అని రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు.
మొత్తం బకాయిలు 8187.62 కోట్లు:
జిల్లాలో వివిధ బ్యాంకుల ద్వారా రైతులు తీసుకున్న మొత్తం రుణాలు రూ. 8187.62కోట్లు. ఈ ఏడాది ఖరీఫ్, రబీలో రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు బుధవారం సమావేశం నిర్వహించారు.
3284.60కోట్ల రూపాయలు ఇచ్చేందుకు రుణప్రణాళిక విడుదల చేశారు. రైతులు ఎప్పుడు బ్యాంకులకు వచ్చినా రుణాలు ఇచ్చేందుకు సిద్ధమే అని బ్యాంకర్లు ప్రకటించారు. అయితే పాతబకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని లేదంటే కుదరదని తేల్చి చెప్పారు. జూన్ మొదలయితే ఖరీఫ్ సీజన్ మొదలైనట్లే! రైతులు పెట్టుబడి కోసం రుణాలు తెచ్చుకోవడం, వరి, వేరుశనగలాంటి విత్తనాలతో పాటు ఎరువుల కొనుగోలుపై దృష్టి సారిస్తారు. అయితే ఖరీఫ్ సీజన్ మొదలవుతున్నా రుణాల కోసం రైతులు బ్యాంకులకు వెళ్లలేకపోతున్నారు. రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబునాయుడు మాటఇచ్చారని, సీఎం అయిన వెంటనే రుణమాఫీపై ప్రకటన చేస్తారని ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా జూన్2న కేసీఆర్ ప్రమాణస్వీకారం చేస్తున్నారు. అదే రోజు తెలంగాణ రైతుల రుణమాఫీపై ఆయన ప్రకటన చేసే అవకాశం ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా జూన్ 8న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన కూడా అదే రోజు ప్రకటన చేస్తారని రైతులు ఆశపడుతున్నారు. ఎందుకంటే ఆయన ఆ రోజు ప్రకటన చేయకపోతే బ్యాంకర్లు రుణాలు ఇవ్వరు. ఖరీఫ్‌లో నాగలి ముందుకు సాగదు.
పుత్తా మాటేమిటో
చంద్రబాబునాయుడు రుణమాఫీ చేయకపోతే తన ఆస్తులు విక్రయించైనా రైతుల రుణాలు మాఫీ చేస్తానని టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి ప్రకటించారు. ఆ మేరకు కమలాపురంలోని వేలాది రైతులు ఆయనకు ఓట్లేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది, ఇప్పడు పుత్తా నరసింహారెడ్డి ఎలాంటి ప్రకటన చేస్తారో అని కమలాపురంతో పాటు జిల్లా రైతన్నలు చర్చించుకుంటున్నారు.
వైఎస్సార్ జిల్లాలో రైతు
రుణాల వివరాలు:
పాతబకాయిలతో కలిపి 2013-14 వరకూ రైతులకు సంబంధించిన మొత్తం రుణాలు జిల్లాలో రూ. 6063.19కోట్లు ఉన్నాయి. 6,38,421మంది రైతులు బకాయి ఉన్నారు.
రుణమాఫీ చేయాల్సిందే
నాకు లక్షరూపాయలదాకా బ్యాంకులో క్రాప్‌లోన్ బాకీ ఉంది. సీఎం అయితే రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సొంత ఆస్తులు అమ్మి బాకీలు చెల్లిస్తామని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. ఖరీఫ్ సీజన్ వస్తోంది. రుణమాఫీకి కట్టుబడి చంద్రబాబు నాయుడు రుణాలు మాఫీ చేయాలి. టీడీపీ నేతలు బాబుపై ఒత్తిడి తేవాలి.
- పాలంపల్లి విశ్వనాథరెడ్డి, నలిపిరెడ్డిపల్లి, వల్లూరు మండలం.
రుణమాఫీపై ఎదురు చూస్తున్నా
నాకు క్రాప్ లోన్ 60వేలుంది. గోల్డ్‌లోన్ 12లక్షలు ఉంది. చంద్రబాబు నాయుడు రుణమాఫీ ఎప్పుడు చేస్తారా అని ఎదురుచూస్తున్నా. మళ్లీ చేలో విత్తనం వేసేందుకు రుణాలు తెచ్చుకుందామని బ్యాంకుకు వెళితే బ్యాంకర్లు పాతబాకీ కట్టమంటున్నారు. చంద్రబాబు కడతాడు కదా.. అంటే తమకు బాకీ కట్టిన తర్వాత మీకు రుణాలు ఇస్తామని చెబుతున్నారు.
- మైలా రామకృష్ణయ్య, పొట్టిపాడు, రాజుపాళెం మండలం.
పాతబకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలు
జిల్లాలో పాతబకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తాం. లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రుణాలు ఇచ్చే ప్రసక్తే లేదు. రీ షెడ్యూల్ కూడా ఎలాంటి తావు లేదు. ప్రభుత్వమో, రైతులో ఎవరో ఒకరు డబ్బు చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తాం. లేదంటే ఇవ్వలేం. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులో కూడా డబ్బులు కావాలి కదా..
- లేవాకు రఘునాథరెడ్డి, లీడ్‌బ్యాంకు మేనేజర్.
మాఫీపైనే ఆశలు
Published Fri, May 30 2014 1:23 AM | Last Updated on Fri, Aug 10 2018 8:40 PM
Advertisement