సాక్షి, ఢిల్లీ : మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను నివారించడానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన దిశ చట్టం అమల్లోకి రావాల్సిన అవసరం ఉందని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన జాతీయ మహిళ కమిషన్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిశ ఘటనలో తెలంగాణ పోలీసుల చర్యను అభినందించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మహిళల విషయంలో దేశంలో చట్టాలను కఠినంగా రూపొందించాలని కోరారు. రాజకీయ నేతలు, పార్టీల కోసం అర్ధరాత్రి కూడా తెరుచుకునే సుప్రీంకోర్టు తలుపులు, మహిళలపై జరిగిన దారుణాలపై ఎందుకు తెరుచుకోవడం లేదని అందరూ ప్రశ్నిస్తున్నారన్నారు.
దేశవ్యాప్తంగా హోం మంత్రులు, డీజీపీల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు మహిళల భద్రతపై ఎందుకు సమావేశాలు పెట్టరని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యాచారాలు, హత్యలపై దేశవ్యాప్తంగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏపీలోని ప్రతీ జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేందుకు అసెంబ్లీలో బిల్లు పెట్టిన విషయాన్ని సమావేశంలో ప్రస్తావించారు. మరోవైపు మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రస్తుతం ఉన్న చట్టాల అమలుపై జనవరిలో విజయవాడలో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ను, అన్ని రాష్ట్రాల మహిళా చైర్‌పర్సన్‌లను ఆహ్వానించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment