కర్నూలు విద్య : భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయ శిక్షణ ఇవ్వాల్సిన కాలేజి యాజమాన్యాలు శిక్షణ మరిచి భక్షణకు అలవాటు పడుతున్నారు. తక్కువ కాలంలో లక్షాధికారులు కావాలని డీఎడ్ కాలేజి యాజమాన్యాలు కాసులకు కక్కుర్తి పడి.. అక్రమ ఫీజులు వసూలు చేసి.. చివరికి ఫీజులు కట్టిన విద్యార్థులనే బలి పశువులను చేశారు.
ఇటీవల కాలంలో ఉపాధ్యాయ పోస్టులకు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో డిగ్రీ పట్టా పొందిన వారిలో అధిక శాతం మంది ఉపాధ్యాయ వృత్తికి ఆకర్షితులు అవుతున్నారు. దీంతో పాలకులు విలువలను విస్మరించి.. కమీషన్ల కోసం నిబంధనలను సైతం పక్కకు నెట్టి డీఎడ్ కాలేజిలకు అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ఆరేళ్ల క్రితం పదికి మించి డీఎడ్ కాలేజీలు లేవు.
ఆ తరువాత కోర్సుకు డిమాండ్ పెరిగింది. దీంతో అదనపు కాలేజీలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో 67 డీఎడ్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో చేరుతున్న వారిలో అధిక శాతం మంది కాలేజీలకు హాజరు కావడం లేదు. దీన్నో అవకాశంగా తీసుకున్న కాలేజీ యాజమాన్యాలు హాజరు మినహాయింపునకు 10 వేల నుంచి 20 వేల రూపాయలు, ప్రాక్టికల్స్‌కి హాజరు కాకున్నా.. పాస్ చేయించేందుకు 15 వేల రూపాయల ప్రకారం అదనంగా అక్రమ ఫీజులను వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది ఈ అక్రమాలకు ఎలాగైనా చెక్ పెట్టాలనే ఉద్దేశంతో డీఎడ్ సెకండియర్ విద్యార్థులకు హాజరైన ప్రాక్టికల్స్‌లో భాగంగా క్లాస్ చెబుతున్నప్పుడు ప్రతి అభ్యర్థి ఫొటో తీయాలనే నిబంధనను తీసుకువచ్చారు. ఈ నిబంధనను సైతం యాజమాన్యాలు పట్టించుకోలేదు. అదనపు ఫీజు చెల్లించిన వారు కొందరు సమాచారం తెలిసి హాజరయ్యారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో జరిగిన ప్రాక్టికల్స్‌లో సుమారు 163 మంది గైర్హాజరైనట్లు అధికారులు చెబుతున్నారు. వీరందరు కూడా డీఎస్సీకి అర్హత కోల్పోయారు. వీరితో పాటు డీఎడ్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన వారు మొదటి సంవత్సరం పరీక్షల్లో జిల్లాలో 268 మందికి పైగా ఫెయిల్ అయినట్లు తెలిసింది. వీరు కూడా డీఎస్సీకి దాదాపు దూరమయినట్లే.
అయితే వీరు ఈనెల 29వ తేదీ నుంచి జనవరి రెండో తేదీ వరకు జరిగే మొదటి సంవత్సర పరీక్షలు రాయాల్సి ఉంది. ఈ ఫలితాలు రావాలంటే కనీసం నెల రోజులు పడుతుంది. ఈ లోపు జనవరి 17 నాటికి డీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తు గడువు పూర్తవుతుంది. మొత్తంగా చూస్తే.. కాలేజీ యాజమాన్యాలు కాసులకు ఇస్తున్న ప్రాధాన్యత ఉపాధ్యాయ శిక్షణకు ఇవ్వడం లేదనే విషయం అర్థమవుతోంది. యాజమాన్యాలు చేస్తున్న తప్పులకు వేలాది రూపాయలు ఖర్చుపెట్టి టీచర్ ట్రైనింగ్ కోర్సు చేసి విద్యార్థులు డీఎస్సీకి అర్హత కోల్పోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా నిబంధనలను పాటించని కాలేజీలపై విద్యాశాఖ ఎలాంటి చర్యలు తీసుకోకుండానే ఇటీవల అఫ్లియేషన్ సర్టిఫికెట్ ఇవ్వడం గమనార్హం.
ఆశలు గల్లంతు!
Published Sat, Dec 13 2014 2:45 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM
Advertisement
Advertisement