కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: జూన్ మాసం వచ్చిందంటే తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. ఈ ఒక్క నెలలోనే విద్యా వ్యాపారం ‘కట్ట’లు తెంచుకుంటుంది. ఫీజులు.. పుస్తకాలు.. యూనిఫాంల పేరిట కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతుండటం గమనార్హం. పిల్లల భవిష్యత్ దృష్ట్యా తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ చదివించేందుకు సిద్ధమవుతుండటం సర్వసాధారణం. ఇదే అదనుగా పలు పాఠశాలలు, కార్పొరేట్ సంస్థలు భారీగా ఫీజులు దండుకుంటున్నాయి.
ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు పిల్లలుంటే మాత్రం రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు పాఠశాల విద్యకే వెచ్చించాల్సి వస్తోంది. ఒకప్పుడు ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగులు, వ్యాపారుల పిల్లలు మాత్రమే అభ్యసించేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు అదే స్థాయిలో విద్యను అందించేందుకు ముందుకొస్తున్నారు. తల్లిదండ్రుల ఆశయాన్ని ఆసరాగా చేసుకుని పలు విద్యా సంస్థలు దోపిడీకి తెరతీస్తున్నాయి. ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తుండటంతో నిరుపేద, మధ్య తరగతి తల్లిదండ్రుల జేబు గుల్లవుతోంది. ఇదంతా కళ్లెదుటే సాగుతున్నా విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంటోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తాగునీరు, మరుగుదొడ్లు, బెంచీలు లేక విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం. ఇవేవీ పట్టించుకోకుండా భవనాలు, అదనపు తరగతి గదుల కోసమే నిధులు ఖర్చు చేస్తున్నారు. దీనికి తోడు ప్రాథమిక పాఠశాలల స్థాయిలో ఉపాధ్యాయుల పనితీరు సరిగ్గా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ఆ పాఠశాలలు మొక్కుబడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూలీ పనిచేసుకునే వారు సైతం తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించేందుకే మొగ్గు చూపుతున్నారు. వీరి ఆదాయంలో 25 శాతం పిల్లల చదువుకే వెచ్చించాల్సి వస్తోంది.
చిట్టీలు ఎత్తి ఫీజులు కట్టాల్సిందే...
పిల్లల చదువు కోసమే తల్లిదండ్రులు చిట్టీలు వేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. జూన్ నెలలో కేవలం పాఠశాల చదువు కోసం తల్లిదండ్రులు చిట్టీలు ఎత్తి, వచ్చిన సొమ్ముతో ఫీజులు చెల్లిస్తున్నారు. మరికొందరు ఇంట్లోని బంగారు నగలు తాకట్టు పెడుతున్నారు. జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా.. కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో ఇప్పటికే సందడి మొదలైంది. కర్నూలు నగరంలోని కొన్ని పేరెన్నికగన్న పాఠశాలల్లో ఇప్పటికే అడ్మిషన్లు లేవని బోర్డులు పెట్టేయడం గమనార్హం. కార్పొరేట్, ప్రముఖ పాఠశాలల్లో పిల్లలు, వారి తల్లిదండ్రులతో కిటకిటలాడుతున్నాయి.
పాఠశాలలు ఏర్పాటు చేసుకున్న పేరెంట్స్ కమిటీలు ఆమోదించిన ఫీజు వివరాలతో కొన్ని పాఠశాలలు బోర్డులు పెట్టేశాయి. పాఠశాలపై ఉన్న నమ్మకంతో తప్పనిసరై ఫీజులు చెల్లిస్తూ పిల్లలను చేర్పిస్తున్నారు. రెసిడెన్సియల్ పాఠశాలల్లో తరగతిని బట్టి ఫీజుకు అదనంగా రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేస్తున్నారు. దీనికి తోడు పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాం ఖర్చులు అదనం కావడంతో తల్లిదండ్రులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
చదువుకొనాల్సిందే
Published Tue, Jun 3 2014 12:51 AM | Last Updated on Mon, Oct 1 2018 5:41 PM
Advertisement