జటిలంగా ‘శ్మశాన వివాదం’
∙పుష్కరఘాట్‌పై గుడిసెలు వేసేందుకు సిద్ధమైన గ్రామస్తులు
∙సానుకూలంగా పరిష్కరించుకోవాలంటూ అధికారుల బుజ్జగింపులు
∙అధికారులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం
రేపల్లె: పెనుమూడిలో శ్మశాన వాటిక సమస్య జఠిలంగా మారింది. కృష్ణా పుష్కరాలకు ముందు వరకు పుష్కరఘాట్ వద్ద దహన కార్యక్రమాలు నిర్వహించవద్దని వ్యతిరేకించిన వర్గం ఘాట్‌పైనే మృతదేహాలను దహనం చేసేందుకు సిద్ధమైంది. స్థానికుల కథనం ప్రకారం పుష్కరాల సమయంలో శ్మశనా వాటికను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. పుష్కరాల అనంతరం ఓ వర్గానికి చెందిన వ్యక్తి మృతి చెంది మృతదేహాన్ని ఖననం చేసేందుకు ఇక్కడికి తీసుకువస్తే వేరే వర్గం ప్రజలు, అధికారులు ఇక్కడ దహనం చేసేందుకు వీలులేదంటూ వేరే ప్రాంతంలో దహనం చేసుకోవాలంటూ ఆదేశించారన్నారు. ఈ ప్రాంతం సమీపంలో ప్రజలు నివస్తున్నారన్న ఉద్దేశంతో మృతదేహాలు వేరే ప్రాంతంలో దహనం చేయడం జరిగుతోందని వివరించారు.
నాడు వద్దు అన్నవారు..
నాడు దహన కార్యక్రమాలు చేయరాదం టూ వివాదం చేసిన వారే ఇక్కడ దహన సంస్కారాలకు పాల్పడటం శోచనీయమన్నారు. ఈ ప్రాంతంలో మృతదేహాలను దహనం చేయడానికి వీలేదంటూ, దహనం చేస్తే శిక్షార్హులంటూ తహసీల్దార్ నోటీసు బోర్డు ఏర్పాటు చేశారు. దీనిని దిక్కరిస్తు మృతదేహం దహన ప్రక్రియలు నిర్వహించడంతో ఇబ్బందికర వాతా వరణం నెలకొల్పుతుందన్నారు. మృతదేహం దహనం చేస్తుంటే వాసన రావటంతో పాటు చితి నుంచి బూడిద గాలికి నివాసాల వైపు వస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అనుమతి ఇచ్చారని, గ్రామ కార్యదర్శి శ్రీనివాసరావు సహాయంతో దహన సంస్కారాలకు పాల్పడటం దారుణమన్నారు.
టెంట్‌లు వేసి ఆందోళనకు దిగిన మహిళలు..
సమీపంలో ప్రజలు నివసిస్తూంటే ఇక్కడ దహన ప్రక్రియలు ఏ విధంగా నిర్వహిస్తారంటూ సమీపంలో నివసిస్తున్న ప్రజలు చిన్నపాటి గుడిసెలు వేసి నిరసన తెలిపారు. ఇక్కడ మేమంతా నివాసం ఉంటే మృతదేహాలను ఏవిధంగా దహ నం చేస్తారో చూస్తామని హెచ్చరించారు. దీంతో అధికారులకు, గ్రామస్తులకు వాగ్వాదం తలెత్తగా తహసీల్దార్ ఎస్‌వీ రమణకుమారి, సీఐ పెంచలరెడ్డి గ్రామస్తులను బుజ్జగించినప్పటికి ఫలితం లేకపోయింది. తహసీల్దార్, సీఐలు మాట్లాడుతూ సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు రానున్నారని అప్పటి వరకు గ్రామస్తులు శాంతియుతంగా ఉండాలని కోరారు.