
శ్రీకాకుళం జిల్లా టీడీపీలో ముసలం
శ్రీకాకుళం జిల్లా టీడీపీలో ముసలం పుట్టింది. జిల్లా అధ్యక్షుడి ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు చౌదరి బాజ్జి, ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ రెండు వర్గాలుగా చిలీపోయారు.
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న గౌతు శ్యాం సుందర్ శివాజీ, చౌదరి బాజ్జీ రెండు వర్గాలుగా చీలిపోయారు. వీరిద్దరు జిల్లా అధ్యక్షులుగా నేనంటే నేను అని పోటీ పడుతున్నారు. జిల్లా అధ్యక్ష పదవి తనకే కట్టబెట్టాలని ఇద్దరు నాయకులు బల ప్రదర్శనకు దిగుతున్నారు. ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని గౌతు శ్యాంసుందర్ శివాజీ అంటుంటే... ఐవిఆర్ఎస్ విధానం ద్వారా అభిప్రాయ సేకరణలో కార్యకర్తల మద్దతు తనకే ఉందని చౌదరి బాజ్జీ చెపుతున్నారు.
దీంతో ఐవీఆర్ఎస్ సిస్టమ్పై తెలుగు తమ్ముళ్లుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమకు కావాలసినవారిని జిల్లా అధ్యక్షులుగా ఎంపిక చేసేందుకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ విధానాన్ని తెరపైకి తీసుకువచ్చారని తెలుగు తమ్ముళ్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. ఈ ఎన్నికలు శనివారం ప్రారంభమై సోమవారంతో ముగియనున్నాయి. నేడు పశ్చిమగోదావరి జిల్లా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల టీడీపీ అధ్యక్షుల ఎన్నికలు జరగనున్నాయి.