ఎమ్మెల్యే చెన్నమనేనికి సుప్రీంలో ఊరట
న్యూఢిల్లీ : కరీంనగర్ జిల్లా వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయస్థానం సోమవారం స్టే విధించింది. 2009 సాధారణ ఎన్నికల్లో చెన్నమనేని రమేష్ వేములవాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఆయన అంతకుముందే జర్మనీలో స్థిరపడి, అక్కడి పౌరసత్వం పొందారు. అక్కడి నుంచి స్వదేశానికి వచ్చిన కొద్ది రోజులకే ఇక్కడి పౌరసత్వ ధ్రువీకరణ పొందారు.
అనంతరం వేములవాడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో రమేష్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలైన అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ రమేష్ పౌరసత్వంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. హోంశాఖ విచారణ నివేదిక ఆధారంగా ఎమ్మెల్యేగా చెన్నమనేని రమేష్ ఎన్నికను రద్దు చేయాలంటూ ఆది శ్రీనివాస్ 2010 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన హైకోర్టు చెన్నమనేని రమేష్ ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.