పోస్టల్ శాఖకు బాధ్యతలు
ఇప్పటి వరకు అందని మార్గదర్శకాలు
ఈ నెల విడుదల కాని బడ్జెట్ లబ్ధిదారుల ఎదురు చూపు
కర్నూలు(అగ్రికల్చర్): పింఛన్ల పంపిణీలో గందరగోళం నెలకొంది. ఈ బాధ్యతల నుంచి యాక్సిస్ బ్యాంకు, ఫినో కంపెనీని ప్రభుత్వం తప్పించింది. పోస్టల్ ద్వారా పంపిణీ చేపడుతామని అధికారులు చెబుతున్నా.. అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. దీంతో ఈ నెలలో పింఛన్ల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో మొత్తంగా మూడు లక్షలకు పైగా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. నవంబర్ నెలలో పది రోజులు గడిచిపోయినా.. ఇందుకు సంబంధించిన బడ్జెట్ విడుదల కాలేదు. ఎప్పుడు విడుదల అవుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. పోస్టల్ ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలంటే అందరికీ సంబంధిత పోస్టాఫీసులో ఖాతాలు ఉండాలి. బయోమెట్రిక్ తీసుకోవాలి. పోస్టల్ ద్వారా పింఛన్ల పంపిణీకి ఎటువంటి మార్గదర్శకాలు రాలేదు. దీంతో నవంబరు నెలలో పంపిణీ సాధ్యమవుతుందా అనేది ప్రశ్నార్థకం అయింది. నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వే జరగలేదనే కారణంతో అక్టోబరు నెలలో ఒక్కరికి కూడా పింఛన్ పంపిణీ చేయలేదు. వీరికి నవంబరు నెలలో కూడా అందడం గగనమే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో పింఛన్ల పంపిణీ ప్రతినెలా 5వ తేదీలోపే జరిగేది.
వైఎస్ తర్వాత పంపిణీ గందరగోళంగా మారింది. ప్రస్తుత ప్రభుత్వం దీన్ని మరింత గందరగోళంగా మార్చింది. పింఛన్ల మొత్తాన్ని పెంచినా.. అడ్డుగోలుగా కోతలు పెడుతోంది. అర్హులైన వారిని జాబితా నుంచి తొలగిస్తున్నారు. సెప్టెంబరు నెలలో 3.25 లక్షల పింఛన్లు ఉండగా అక్టోబరు నెలలో వాటిని 2.20 లక్షలకు తగ్గించారు. వీటిలో 18 వేలకు పైగా కొత్త పింఛన్లు మంజూరు చేశారు. ఇందుకు సంబంధించి రూ.22.94 కోట్లు విడుదలవగా.. 1,74,661 పింఛన్లు మాత్రమే పంపిణీ చేశారు. దాదాపు 30 వేల పింఛన్లకు ఫోటోలు, వేలిముద్రలు మ్యాచ్ కాలేదని పింఛన్లు నిలిపివేశారు.
పింఛన్ల పంపిణీ ప్రశ్నార్థకం
Published Fri, Nov 14 2014 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM
Advertisement
Advertisement