కలెక్టర్లు, ఎస్పీలే నా బలం: సీఎం జగన్‌ | District Collectors And SPs Are My Strength Says CM YS Jagan | Sakshi
Sakshi News home page

అందరూ అద్భుతంగా పని చేశారు: సీఎం జగన్‌

Published Tue, May 19 2020 1:39 PM | Last Updated on Tue, May 19 2020 2:19 PM

District Collectors And SPs Are My Strength Says CM YS Jagan - Sakshi

సాక్షి, తాడేపల్లి : ‘‘ నేను ప్రతిసారీ చెప్తున్నాను నా బలం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలే. మీరంతా ఉత్తమ సామర్థ్యం ఉన్న వారిగా గుర్తించాం. పూర్తి నమ్మకం, విశ్వాసం మీపై పెట్టాను. అందుకే మీరే మా బలమని చెప్తున్నాను. కలెక్టర్లు, ఎస్పీలు బాగా పరిపాలన చేస్తే.. ప్రభుత్వం కూడా బాగా పరిపాలన చేసినట్టే’’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కరోనా వైరస్‌ నివారణలో అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు. క్షేత్ర స్థాయిలో గ్రామ వాలంటీర్, సచివాలయం, ఆశావర్కర్లు, ఏఎస్‌లు, డాక్టర్లు, కానిస్టేబుళ్లు, ఎస్సైలు, పారిశుద్ధ్య కార్మికులు అంతా అద్భుతంగా పని చేశారన్నారు. మంగళవారం స్పందన కార్యక్రమంలో భాగంగా ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ మనం ఇప్పుడు నాలుగో విడత లాక్‌డౌన్‌లోకి అడుగుపెట్టాం. ఇంతకుముందు మనం అనుసరించిన పద్దతి వేరు. నాలుగో విడత లాక్‌డౌన్లో అనుసరిస్తున్న పద్దతి వేరు. ఈ విడతలో మనం ఆర్థిక వ్యవస్థను తిరిగి ప్రారంభించాల్సి ఉంటుంది. కోవిడ్‌ –19 నివారణపై మన దృష్టి పోకుండానే, మరోవైపు ఆర్థిక వ్యవస్థను ప్రారంభించాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు. ( స్టీల్‌ప్లాంట్‌ స్థలాన్ని సిద్ధం చేయండి )


ఎకానమీ పూర్తిగా ఓపెన్‌ కావాలి
‘‘ ఎకానమీ పూర్తిగా ఓపెన్‌కావాలి. కలెక్టర్లు, ఎస్పీలు అందులో  భాగస్వామ్యం కావాలి. షాపింగ్‌ మాల్స్, సినిమా థియేటర్లు, మతపరమైన కార్యక్రమాలు, సదస్సులు ఇవి తప్ప మిగిలిన చోట అంతా కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకుని వాటిని ప్రారంభించాల్సి ఉంది. చిన్న చిన్న దుకాణాల దగ్గరినుంచి ప్రతీదీ ఓపెన్‌ చేయాలి.  రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా ప్రజా రవాణా ప్రారంభం అవుతుంది. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు, ప్రైవేటు వాహనాలు ప్రారంభం అవుతాయి. తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి. ఈ రెండూ తప్పనిసరిగా పాటిస్తూ.. అన్నీ ఓపెన్‌ కావాలి. మనం కోవిడ్‌–19తో కలిసి జీవించాల్సి ఉంటుంది. కోవిడ్‌ –19 సోకిన వారిని వివక్షతో చూడ్డం అన్నది సమాజం నుంచి తొలగించాలి. ప్రజల్లో భయాందోళనలను పూర్తిగా తొలగించాలి. కరోనా సోకిన వారిని వివక్షతతో చూడకూడదు. రాబోయే కాలంలో కోవిడ్‌ రానివారు ఎవ్వరూ ఉండరేమో?. అది వస్తుంది.. పోతుంది కూడా. కోవిడ్‌ పట్ల భయాన్ని తొలగించాలి. ఈ వైరస్‌ పట్ల ప్రజల్లో అవగాహన, చైతన్యాన్ని కలిగించాలి. ( మీ బిడ్డే ముఖ్యమంత్రి.. అన్యాయం జరగనివ్వను )


ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి
‘‘ ప్రజలు తమకు తాముగా ముందుకు వచ్చి కరోనా పరీక్షలు చేయించుకునేలా చూడాలి. వారు స్వచ్ఛందంగా తమ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పే పరిస్థితి రావాలి. దీన్ని మనం ప్రోత్సహించాలి. పరీక్షలకోసం ఎవర్ని సంప్రదించాలి? ఎక్కడకు వెళ్లాలి? ఎలా పరీక్షలు చేయించుకోవాలన్నది ఎడ్యుకేట్‌చేయాలి?. పరీక్షల సదుపాయాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. రాబోయే రోజుల్లో వైఎస్సార్‌ విలేజ్, వార్డు క్లినిక్స్‌ను తీసుకొస్తున్నాం. వీటి నిర్మాణం కలెక్టర్ల ప్రథమ పనిగా భావించాలి. అనుమానం ఉన్నవారు అక్కడకువెళ్లి పరీక్షలు చేయించుకుని మందులు తీసుకునే ప్రక్రియ చాలా సాఫీగా సాగిపోవాలి. ప్రజలకు అందుబాటులో టెస్టింగ్‌ సదుపాయాలను తీసుకు వెళ్లాలి.  ప్రజల్లో పూర్తిగా భయాందోళనలను తొలగించాలి. కంటైన్‌ మెంట్‌ క్లస్టర్ల పరిధిని తగ్గించుకుంటూ వెళ్లాలి. భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు ధరించేలా, చేతులు శుభ్రపరుచుకునేలా ప్రజల్లో పూర్తి అవగాహన, చైతన్యం కలిగించాలి’’ అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement