రాష్ట్రాన్ని దారుణంగా విభజించారు
సాక్షి, అనంతపురం : ‘రాష్ట్రాన్ని దారుణంగా విభజించారు. ఈ పాపం ఊరకే పోదు. విభజించిన కాంగ్రెస్‌ను, అందుకు సహకరించిన టీడీపీని భూస్థాపితం చేస్తాం.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీల నేతలకు డిపాజిట్లు కూడా దక్కవు’ అంటూ సమైక్యవాదులు నిప్పులు చెరిగారు.
రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లుకి లోక్‌సభ ఆమోదం తెలుపడాన్ని నిరసిస్తూ జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం వైఎస్సార్‌సీపీ శ్రేణులు, సమైక్యవాదులు చేపట్టిన జిల్లా బంద్ విజయవంతమైంది. బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలికారు. ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు, బ్యాంకులు, పెట్రోల్ బంకులు, పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
జన సందడితో కళకళలాడే నగరం, పట్టణాలు వెలవెలబోయాయి. హైదరాబాద్-బెంగళూరు, అనంతపురం-చెన్నై జాతీయ రహదారుల్లో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రాష్ట్ర విభజన జరగడం వల్ల సీమాంధ్ర ప్రాంతానికి తీరని నష్టం వాటిల్లింద ని, అందుకు కారణమైన కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, స్పీకర్ మీరా కుమార్, బీజేపీ జాతీయ నాయకురాలు సుస్మాస్వరాజ్ దిష్టి బొమ్మలను ఆందోళనకారులు దహనం చేశారు. అనంతపురం నగరంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు బి.ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం ఏడు గంటలకే పార్టీ నాయకులు, కార్యకర్తలు బంద్‌ను పర్యవేక్షించారు.