
జైరాం రమేష్
ఢిల్లీ: రాష్ట్ర విభజనకు ఏర్పాటు చేసిన 21 కమిటీల నివేదికలను మే 8న వెబ్సైట్లో ఉంచుతున్నట్లు కేంద్ర మంత్రి జైరాం రమేష్ చెప్పారు. అఖిల భారత సర్వీసు అధికారుల విభజనపై ఏర్పాటుచేసిన ప్రత్యూష్ సిన్హా కమిటీ ఈ రోజు కేంద్ర హోంశాఖ కార్యాలయంలో సమావేశమైంది. సమావేశం ముగిసిన అనంతరం జైరాం రమేష్ మాట్లాడుతూ మే 9న మరోసారి సమావేశమై విభజన ప్రక్రియను సమీక్షిస్తామని చెప్పారు. హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో విభజన అంశాల అమలుకు మరో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.
రాష్ట్ర విభజన ప్రక్రియ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 30 నాటికి అన్ని విభాగాల్లో విభజన ప్రక్రియను పూర్తి చేయాలన్న కేంద్రం ఆదేశాల మేరకు అధికారులు వేగంగా పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే విభజనకు సంబంధించిన కీలక సమావేశాలు ఢిల్లీలో జరుగుతున్నాయి.