విభజన జరిగితే ఎడారే | Division happens in the desert | Sakshi
Sakshi News home page

విభజన జరిగితే ఎడారే

Published Sun, Sep 1 2013 4:05 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

Division happens in the desert

కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమకు చుక్క తాగు, సాగునీరు అందక ఈ ప్రాంతం శాశ్వత కరువు బారిన పడుతుందని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఛైర్మన్, జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శనివారం కడప ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన గర్జన కార్యక్రమానికి హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి ఏజేసీ ప్రసంగించారు. రాయలసీమ సాగునీటి అవసరాలను  తీర్చడంలో శ్రీశైలం ప్రాజెక్టు ఆయువుపట్టు లాంటిదన్నారు. విభజన జరిగితే కృష్ణా నదిలోని మిగులు జలాలపై ఆధారపడి నిర్మిస్తున్న తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులకు నికర జలాలు లభించక సీమ ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమే వెనుకబడి ఉందన్న శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీసుకోవడం తగదన్నారు.
 
 పొట్టిశ్రీరాములు 58 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణార్పణ గావించడంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి 1953లో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటుచేసిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడంతో కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేశారని తెలిపారు. అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న తెలుగు వారు కూడా ఆంధ్ర రాష్ట్రంలో కలిసిపోయేందుకు వీలుగా అక్కడి శాసనసభలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించడంతో 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జరిగిందని పేర్కొన్నారు.
 
 దేశంలోనే మొదటి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రంలో ఆ తర్వాత కొన్ని ప్రాంతీయ ఉద్యమాలు వచ్చినప్పటికీ రాష్ట్రం సమైక్యంగానే ఉంటూ వచ్చిందన్నారు.  తెలంగాణా వెనుకబడి ఉందని, తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే వాదన ఆ ప్రాంతంలో ముందుకు వచ్చిందన్నారు. తెలంగాణా మిగతా ప్రాంతాల కంటే అభివృద్ధిలో ముందంజలో ఉందంటూ శ్రీకృష్ణ కమిటీ స్పష్టం చేయడంతో తెలంగాణావాదులు మాట మార్చి తమది సెంటిమెంట్ అనడం విడ్డూరంగా ఉందన్నారు.  గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమ అభ్యర్థులను పోటీలో నిలపలేని తెలంగాణావాదులు నేడు  హైదరాబాద్ తమదేననడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల సమష్ఠి శ్రమ, పెట్టుబడులతో హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్న విషయాన్ని గుర్తించాలన్నారు.  రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచే సగం వస్తోందన్నారు.  దేశంలో ఎన్నో కొత్త రాష్ట్రాలు ఆవిర్భవించాయని, విడిపోయేవారే కొత్త రాజధానులను ఏర్పాటు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.  ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు.   హైదరాబాద్ తెలంగాణాకు వెళ్లిపోతే ఆదాయం వారికి, అప్పులు మనకు మిగులుతాయని తెలిపారు. రాష్ట్ర విభజన అంశంపై కేంద్రాన్ని నిలదీయడంలో పార్లమెంటు సభ్యులు పూర్తిగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు.
 
 తెలంగాణా వాసి అయిన పీవీ  నరసింహారావును నంద్యాల నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆదరించిన చరిత్ర రాయలసీమ వాసులదేనని చెప్పారు.  తెలుగుప్రజల ఐక్యత కోసం ఎన్నో త్యాగాలు చేసిన చరిత్ర రాయలసీమ వాసులకు ఉందన్నారు. ఎన్‌జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేవీ  శివారెడ్డి, ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.రవికుమార్, జాక్టో అధ్యక్షులు జివి నారాయణరెడ్డి  మాట్లాడుతూ జీతాల కోసం కాకుండా జీవితాల కోసం ఉద్యమిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రం దిగివచ్చి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు అవిశ్రాంత పోరాటం నిర్వహిస్తామని స్పష్టంచేశారు.
 
 డీఆర్‌ఓ ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఎన్.రామ్మూర్తినాయుడు, ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ లీలావతి, జిల్లా పంచాయతీ అధికారి అపూర్వ సుందరి, ఆర్‌అండ్‌బీ డీఈ మాధవి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వేదనాయకం, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, డాక్టర్ల జేఏసీ నాయకుడు వారణాసి ప్రతాప్‌రెడ్డి, కె.శ్రీనివాసరాజు, పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి, పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ స్టాఫ్ నాయకులు నాగిరెడ్డి, స్పోర్ట్స్ స్కూల్ స్పెషల్ ఆఫీసర్ రామచంద్రారెడ్డి, రాజీవ్ విద్యామిషన్ పీఓ సూర్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ మొగిలిచెండు సురేష్, కడప బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేష్‌కుమార్‌రెడ్డి, ఏపీఎంఐ పీడీ శ్రీనివాసులు,  ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మనోహర్‌రెడ్డి, పలువురు జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
 
 అమరులకు నివాళులు :
 సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం  నెల రోజుల నుంచి సాగుతున్న ఉద్యమంలో అసువులు బాసిన అమరులకు గర్జనలో ఘనంగా నివాళులు అర్పించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వందేమాతరం గీతాన్ని ఆలపించారు. అదనపు జేసీ సుదర్శన్‌రెడ్డి అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. జై సమైక్యాంధ్ర, జై జై సమైక్యాంధ్ర, జై తెలుగు తల్లి, జైజై తెలుగు తల్లి అనే నినాదాలు గర్జనలో మారుమోగాయి. రామాపురం గురుకుల పాఠశాల విద్యార్థులు జాతీయ నాయకుల చిత్రాలతో ప్రదర్శించిన పతాకం ఆకట్టుకుంది. మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు, తెలుగు తల్లి వేషధారణలు ఆకట్టుకున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement