sri krishna commitee
-
కేంద్రానికి శ్రీకృష్ణ కమిటీ రహస్య నోట్
-
తెలంగాణ మనలేదు!
విఫల రాష్ట్రంగా మిగులుతుంది కేంద్రానికి శ్రీకృష్ణ కమిటీ రహస్య నోట్ 2010లోనే నివేదికతో పాటు విడిగా సమర్పణ హైదరాబాద్ రాజధానిగా ఇస్తే జరిగేదదేనని స్పష్టీకరణ నగరం కోసం ఉద్యమాలు ఖాయమని హెచ్చరిక హామీలు నెరవేరక ప్రజల్లో అసంతృప్తి ప్రబలుతుంది సీమాంధ్రులపై, వారి ఆస్తులపై దాడులు జరగవచ్చు ఆర్థిక కుంగుబాటుకు, సామాజిక అస్థిరతకు దారితీస్తుంది మావోయిజం, మత ఉద్రిక్తతలు తలెత్తుతాయి జిహాదీ తీవ్రవాదం, హిందూ అతివాదం రావచ్చు నోట్ వివరాలతో బిజినెస్ స్టాండర్డ్ కథనం ‘హైదరాబాద్ రాజధానిగా తెలంగాణను ఏర్పాటు చేస్తే ఒక రాష్ట్రంగా అది విజయవంతంగా మనుగడ సాగించలేదు’ - రాష్ట్ర విభజనపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వ్యక్తం చేసిన రహస్య అభిప్రాయమిది. సాక్షి, హైదరాబాద్: ఆర్థిక ఇక్కట్లు, మావోయిజం పునరుత్థానం, మతపరమైన ఉద్రిక్తతలను అందుకు ప్రధాన కారణాలుగా కమిటీ పేర్కొంది. 2010లోనే కేంద్ర హోం శాఖకు సమర్పించిన రహస్య నోట్లో ఈ మేరకు పలు సంచలనాత్మక వ్యాఖ్యలు చేసింది! ‘‘హైదరాబాద్ రాజధానిగా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే అది తెలంగాణవాదుల భావోద్వేగాలను తృప్తి పరచవచ్చేమో. కానీ ఆర్థికంగా మాత్రం అది ఎలాంటి లబ్ధి చేకూర్చజాలదు. ఎందుకంటే హైదరాబాద్‌ను పూర్తిగా తెలంగాణకే పరిమితం చేస్తే దాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని, వాటికి నిరసనగా మరికొన్ని... ఇలా పలు కొత్త తరహా ఉద్యమాలు పుట్టుకొస్తాయి. అది హింసకు కూడా దారితీయవచ్చు. ఇదో విషవలయంలా సాగుతూనే ఉంటుంది. దాంతో నగర ఆర్థిక వ్యవస్థ, ఆదాయోత్పత్తి పూర్తిగా దెబ్బ తింటాయి. ఇది యువత, వృత్తి నిపుణులు, రైతుల్లో తీవ్ర నిరాశా నిస్పృహలకు దారి తీస్తుంది. హైదరాబాద్‌లో, తెలంగాణలో ఉండే సీమాంధ్రులు వాటికి బలి కావచ్చు. నిరాశకు లోనైన తెలంగాణవాసులు సీమాంధ్రులపై, వారి ఆస్తులపై ఉద్దేశపూర్వక దాడులకు కూడా దిగవచ్చు. ఇక ఉద్యమ కాలంలో తెలంగాణ అనుకూల పార్టీలు గుప్పించిన భారీ హామీలేవీ నెరవేరక దీర్ఘకాలంలో యువతతో పాటు పలు సామాజిక వర్గాల్లో తీవ్ర అసంతృప్తి రగుల్కొనవచ్చు. అసంతృప్తికి లోనైన యువత, నిరుపేద వర్గాలు మావోయిజం వైపు ఆకర్షితులై సాయుధ బాట పట్టవచ్చు. అంతేగాక హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని చాలా పట్టణాల్లో ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కాబట్టి హిందూ, ముస్లింల మధ్య మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తి చివరికి తెలంగాణలో హిందూ అతివాదం, జిహాదీ తీవ్రవాదం ప్రబలే ప్రమాదముంది. పైగా తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ఎస్సీ, బీసీ సామాజికవర్గాల వారి రాజకీయ ఆకాంక్షలు పెద్దగా నెరవేరక సామాజిక అస్థిరత కూడా తలెత్తవచ్చు. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినా, పై కారణాలన్నింటి నేపథ్యంలో అది అచిర కాలంలోనే ఒక విఫల రాష్ట్రంగా మిగిలిపోవచ్చు’’ అంటూ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టింది. తెలంగాణ ఏర్పాటు డిమాండ్ల నేపథ్యంలో కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీ ఆరు సిఫార్సులతో 2010 డిసెంబర్ 30న నివేదిక సమర్పించడం తెలిసిందే. పైన పేర్కొన్న అంశాలతో కూడిన తన అసలు అభిప్రాయాన్ని కూడా అదే సందర్భంగా విడిగా ఒక నోట్ రూపంలో కేంద్ర హోం శాఖకు కమిటీ అందజేసింది. ఈ విషయాన్ని బిజినెస్ స్టాండర్డ్ ఆంగ్ల దినపత్రిక తాజాగా బయటపెట్టింది. నోట్లోని ప్రధానాంశాలతో శనివారం ఓ కథనం ప్రచురించింది. నోట్ ప్రతిని తాము సంపాదించామని, దీనిపై జస్టిస్ శ్రీకృష్ణను సంప్రదించగా కేంద్ర హోం శాఖకు విడిగా నోట్ సమర్పించిన మాట నిజమేనని అంగీకరించారని కూడా పత్రిక తెలిపింది. అయితే దానిపై వివరాలు వెల్లడించేందుకు మాత్రం ఆయన ఇష్టపడలేదని వివరించింది. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలా, ఉమ్మడి రాజధానిగా ఎన్నేళ్లుంచాలి వంటి పలు అంశాలపై ఎటూ తేల్చుకోలేక విభజన విధివిధానాల ఖరారుకు ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ఇప్పటికే తలపట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధానికి సంబంధించి జీవోఎం తన నివేదికలో కేంద్రానికి చేయబోయే సిఫార్సుపై శ్రీకృష్ణ కమిటీ విడి నోట్ ప్రభావం చూపవచ్చంటున్నారు. రహస్య నోట్లో శ్రీకృష్ణ కమిటీ వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇవీ... మావోయిజం తిరిగి వేళ్లూనుతుంది మావోయిస్టు నేతల్లో అత్యధికులు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే. అయినా దేశంలోని మావోయిజం బాధిత రాష్ట్రాలన్నింట్లోనూ ఆంధ్రప్రదేశే ఆ సమస్యను విజయవంతంగా పరిష్కరించుకోగలిగింది. కొన్నేళ్ల క్రితమే రాష్ట్రంలో మావోయిస్టులు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయారు. ఇలాంటప్పుడు హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తలెత్తే పరిస్థితులను తమకు అనువుగా మలచుకుని వారు తిరిగి వేళ్లూనుకోవచ్చు. పైగా కొత్త రాష్ట్రం తొలుత మావోయిస్టుల విషయంలో మెతకగా వ్యవహరించే ఆస్కారముంది. వారి ప్రమాదాన్ని అది గుర్తించేలోపే సమస్య చేయి దాటిపోవచ్చు. పైగా విభజన అనంతరం తెలంగాణకు మిగిలే పోలీసు బలగాలు మావోయిస్టులను సమర్థంగా ఎదుర్కొనేందుకు చాలకపోవచ్చు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుంచి మావోయిస్టులు తమ కార్యకలాపాలను తెలంగాణలోకి విస్తరించవచ్చు. ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండలతో పాటు నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వారు పాగా వేసే ప్రమాదముంది. మత ఉద్రిక్తతలూ తప్పవు మావోయిజంతో పాటు మతపరమైన ఉద్రిక్తతలకు కూడా తెలంగాణ కేంద్రం కావచ్చు. గతంలో కూడా హైదరాబాద్ పలుమార్లు మత అల్లర్లను చవిచూసింది. పైగా వాటిలో చాలావరకు చిన్న చిన్న కారణాలతో పుట్టుకొచ్చినవే. తెలంగాణలో పలు ముస్లిం ప్రాబల్య ప్రాంతాలున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, భైంసా, నిజామాబాద్ జిల్లాలోని బోధన్, కామారడ్డి, కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, కరీంనగర్, మెదక్ జిల్లాలోని జహీరాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాలోని భువనగిరి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేట్, మహబూబ్‌నగర్, రంగారడిడ జిల్లాలోని తాండూరు, వికారాబాద్ వంటివి మతపరంగా చాలా సున్నితమైన ప్రాంతాలు. అక్కడ రెండు మతాల వారూ పరస్పర అనుమానాల మధ్యే జీవిస్తున్నారు. నిరుద్యోగం, సామాజిక అస్థిరతలకు ఈ మతపరమైన ఉద్రిక్తతలు కూడా తోడైతే చివరికి అది జిహాదీ తీవ్రవాద శక్తులు పెచ్చరిల్లేందుకు కారణమైనా ఆశ్చర్యం లేదు. ముస్లిం ప్రభావాన్ని ఎదుర్కొనే పేరుతో హిందువులను వారికి వ్యతిరేకంగా మార్చేందుకు హిందూ మతోన్మాద శక్తులు కూడా ప్రయత్నించవచ్చు రాజకీయంగానూ అస్థిరతే తెలంగాణ అనుకూల పార్టీలన్నీ ప్రజలకు భారీ హామీలిస్తున్నాయి. కానీ రాష్ట్రం ఏర్పాటయ్యాక అవి ఆచరణలో సాధ్యపడకపోవచ్చు. ఎందుకంటే వనరుల కోసం, నిపుణులైన పనివారి కోసం హైదరాబాద్ చాలావరకు సీమాంధ్రపైనే ఆధారపడుతుంది. రాష్ట్ర పరిశ్రమల్లో చాలావరకు హైదరాబాద్, దాని పరిసరాల్లోనే ఉన్నాయి. దాంతో ధర్నాలు, ఆందోళనలు, హింసాకాండతో పాటు ఆర్థిక వృద్ధి పూర్తిగా దెబ్బ తినడం వంటివాటి వల్ల నిరాశా నిస్పృహలను హైదరాబాద్ చవిచూడవచ్చు. తెలంగాణ ఉద్యమకారుల్లో చాలామంది ఎస్సీ, బీసీ సామాజికవర్గాల వారే. వారంతా కొత్త రాష్ట్రంలో తమకు రాజకీయ అవకాశాలు, నాయకత్వ పాత్ర లభించాలని కోరుకుంటున్నారు. అవి నెరవేరని పక్షంలో సామాజిక అస్థిరతకు ఇది కూడా ప్రధాన కారణంగా మారవచ్చు. -
నాలుగేళ్లుగా నట్టేట
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఎవరి నోట విన్నా ఒకే మాట.. ఎవరిని కదిపినా ఒకటే అభిప్రాయం.. ఎవరిని ప్రశ్నించినా ఒకటే సమాధానం.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు ఉత్పన్నమయ్యేవి కావని! రాష్ట్ర విభజన ప్రకటన వెలువడేది కాదని!! వేర్పాటువాదం భూస్థాపితమయ్యేదని! దేశంలో అత్యంత ప్రజాకర్షక సీఎం అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించడం వల్లే ఇప్పుడీ దుస్థితి దాపురించిందని పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు సైతం అంగీకరిస్తున్నారు. 2004కు ముందు వరుస ఓటములతో జీవశ్చవంలా మారిన కాంగ్రెస్ పార్టీకి అప్పటి ప్రతిపక్ష నేత అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా పోరాటాలు, పాదయాత్ర ద్వారా ప్రాణవాయువు అందించారు. మాట తప్పని.. మడమ తిప్పని యోధుడిగా పేరొంది.. 2004 ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తేవడంలో కీలక భూమిక పోషించారు. 2004 మే 14న తొలిసారిగా సీఎం బాధ్యతలు స్వీకరించి.. ప్రజాభ్యుదయమే లక్ష్యంగా పనిచేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే పరమావధిగా ఐదేళ్లపాటూ సుపరిపాలన అందించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను రెండు కళ్లుగా భావించి అమలు చేశారు. అందుకే 2004 -2009 మధ్య వైఎస్ పాలన సువర్ణయుగమని రాష్ట్ర ప్రజానీకం అభివర్ణిస్తోంది. ఐదేళ్ల వైఎస్ పాలనకు మెచ్చిన రాష్ట్ర ప్రజానీకం రాష్ట్ర, కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీకి రెండో సారి అధికారాన్ని కట్టబెట్టారు. 2009 మే 20న రెండో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ ప్రజారంజక పాలనను అందించే దిశగా సాగారు. ఆ క్రమంలోనే ప్రజల కష్టాలు తెలుసుకొనేందుకు రచ్చబండ నిర్వహించేందుకు వెళ్తూ 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన మరణం తర్వాత రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన విస్తరిగా మార్చింది. రాజకీయ లబ్ధి పొందేందుకు వేర్పాటువాదాన్ని రాజేసింది. ఆ క్రమంలోనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ దీక్ష చేశారు. ఆ దీక్షకు తలొగ్గి 2009 డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేశారు. ఇది సీమాంధ్రను అగ్నిగుండంగా మార్చింది. సీమాంధ్రలో సమైక్యఉద్యమానికి ‘అనంత’ చుక్కానిలా నిలిచింది. సమైక్యాంధ్ర ఉద్యమం దెబ్బకు అదిరిన కేంద్రం డిసెం బర్ 24న ప్రత్యేక తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకుంది. ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు, రాష్ట్ర ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన శ్రీకృష్ణ కమిటీ ఆరు ప్రతిపాదనలతో కూడిన నివేదికను 2010 డిసెంబర్లో కేంద్రానికి అందించింది. ఆ నివేదికపై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా మూడేళ్ల పాటు నాన్చిన కాంగ్రెస్ అధిష్టానం.. టీడీపీతో కుమ్మక్కై ఓట్లు, సీట్లే లక్ష్యంగా ఈ ఏడాది జూలై 30న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన చేసింది. ఇది మళ్లీ సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని రాజేసింది. వేర్పాటువాదం, సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల నాలుగేళ్లుగా రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. పాలన కుంటుపడింది. ఇది సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వైఎస్ హయాంలో జిల్లాలోని హిందూపురం పరిసర ప్రాంతాల్లో రూ.15 వేల కోట్ల వ్యయంతో బీడీఎల్(భారత్ డైనమిక్స్ లిమిటెడ్), బీఈఎల్(భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్), ఈసీఐఎల్(ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్), హెచ్ఏఎల్(హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్), హైటెక్ ఎలక్ట్రానిక్ సిటీ వంటి పరిశ్రమలను ఏర్పాటుచేయడానికి ముందుకొచ్చారు. అవి ఏర్పాటై ఉంటే.. ప్రత్యక్షంగా లక్ష మందికి ఉపాధి దొరికేది. కానీ.. రాజకీయ అనిశ్చితి వల్ల ఆ పరిశ్రమల పనులు ప్రారంభం కాలేదు. అలాగే హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకానికి మిగులు జలాల స్థానంలో నికర జలాలను ఇప్పటికీ కేటాయించలేదు. బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు ఆధారంగా ఆ ప్రాజెక్టుకు నికర జలాలు కేటాయించి ఉంటే.. హంద్రీ-నీవాకు ఏఐబీపీ(సత్వర సాగునీటి కల్పన పథకం) ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసే అవకాశం ఉండేది. అప్పుడు హంద్రీ-నీవా పథకాన్ని త్వరితగతిన పూర్తిచేసే వెసులుబాటు దొరికేది. సంక్షేమ పథకాలదీ ఇదే తీరు. ప్రభుత్వం నాలుగేళ్లుగా తమను నట్టేట ముంచుతోందని ‘అనంత’ ప్రజానీకం వాపోతోంది. -
విభజన జరిగితే ఎడారే
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమకు చుక్క తాగు, సాగునీరు అందక ఈ ప్రాంతం శాశ్వత కరువు బారిన పడుతుందని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఛైర్మన్, జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శనివారం కడప ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన గర్జన కార్యక్రమానికి హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి ఏజేసీ ప్రసంగించారు. రాయలసీమ సాగునీటి అవసరాలను తీర్చడంలో శ్రీశైలం ప్రాజెక్టు ఆయువుపట్టు లాంటిదన్నారు. విభజన జరిగితే కృష్ణా నదిలోని మిగులు జలాలపై ఆధారపడి నిర్మిస్తున్న తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులకు నికర జలాలు లభించక సీమ ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమే వెనుకబడి ఉందన్న శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీసుకోవడం తగదన్నారు. పొట్టిశ్రీరాములు 58 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణార్పణ గావించడంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి 1953లో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటుచేసిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడంతో కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేశారని తెలిపారు. అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న తెలుగు వారు కూడా ఆంధ్ర రాష్ట్రంలో కలిసిపోయేందుకు వీలుగా అక్కడి శాసనసభలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించడంతో 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జరిగిందని పేర్కొన్నారు. దేశంలోనే మొదటి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలో ఆ తర్వాత కొన్ని ప్రాంతీయ ఉద్యమాలు వచ్చినప్పటికీ రాష్ట్రం సమైక్యంగానే ఉంటూ వచ్చిందన్నారు. తెలంగాణా వెనుకబడి ఉందని, తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే వాదన ఆ ప్రాంతంలో ముందుకు వచ్చిందన్నారు. తెలంగాణా మిగతా ప్రాంతాల కంటే అభివృద్ధిలో ముందంజలో ఉందంటూ శ్రీకృష్ణ కమిటీ స్పష్టం చేయడంతో తెలంగాణావాదులు మాట మార్చి తమది సెంటిమెంట్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమ అభ్యర్థులను పోటీలో నిలపలేని తెలంగాణావాదులు నేడు హైదరాబాద్ తమదేననడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల సమష్ఠి శ్రమ, పెట్టుబడులతో హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచే సగం వస్తోందన్నారు. దేశంలో ఎన్నో కొత్త రాష్ట్రాలు ఆవిర్భవించాయని, విడిపోయేవారే కొత్త రాజధానులను ఏర్పాటు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. హైదరాబాద్ తెలంగాణాకు వెళ్లిపోతే ఆదాయం వారికి, అప్పులు మనకు మిగులుతాయని తెలిపారు. రాష్ట్ర విభజన అంశంపై కేంద్రాన్ని నిలదీయడంలో పార్లమెంటు సభ్యులు పూర్తిగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. తెలంగాణా వాసి అయిన పీవీ నరసింహారావును నంద్యాల నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆదరించిన చరిత్ర రాయలసీమ వాసులదేనని చెప్పారు. తెలుగుప్రజల ఐక్యత కోసం ఎన్నో త్యాగాలు చేసిన చరిత్ర రాయలసీమ వాసులకు ఉందన్నారు. ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేవీ శివారెడ్డి, ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.రవికుమార్, జాక్టో అధ్యక్షులు జివి నారాయణరెడ్డి మాట్లాడుతూ జీతాల కోసం కాకుండా జీవితాల కోసం ఉద్యమిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రం దిగివచ్చి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు అవిశ్రాంత పోరాటం నిర్వహిస్తామని స్పష్టంచేశారు. డీఆర్ఓ ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఎన్.రామ్మూర్తినాయుడు, ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ లీలావతి, జిల్లా పంచాయతీ అధికారి అపూర్వ సుందరి, ఆర్అండ్బీ డీఈ మాధవి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వేదనాయకం, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, డాక్టర్ల జేఏసీ నాయకుడు వారణాసి ప్రతాప్‌రెడ్డి, కె.శ్రీనివాసరాజు, పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి, పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ స్టాఫ్ నాయకులు నాగిరెడ్డి, స్పోర్ట్స్ స్కూల్ స్పెషల్ ఆఫీసర్ రామచంద్రారెడ్డి, రాజీవ్ విద్యామిషన్ పీఓ సూర్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ మొగిలిచెండు సురేష్, కడప బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేష్‌కుమార్‌రెడ్డి, ఏపీఎంఐ పీడీ శ్రీనివాసులు, ఆర్అండ్బీ ఎస్ఈ మనోహర్‌రెడ్డి, పలువురు జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అమరులకు నివాళులు : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం నెల రోజుల నుంచి సాగుతున్న ఉద్యమంలో అసువులు బాసిన అమరులకు గర్జనలో ఘనంగా నివాళులు అర్పించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వందేమాతరం గీతాన్ని ఆలపించారు. అదనపు జేసీ సుదర్శన్‌రెడ్డి అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. జై సమైక్యాంధ్ర, జై జై సమైక్యాంధ్ర, జై తెలుగు తల్లి, జైజై తెలుగు తల్లి అనే నినాదాలు గర్జనలో మారుమోగాయి. రామాపురం గురుకుల పాఠశాల విద్యార్థులు జాతీయ నాయకుల చిత్రాలతో ప్రదర్శించిన పతాకం ఆకట్టుకుంది. మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు, తెలుగు తల్లి వేషధారణలు ఆకట్టుకున్నాయి. -
సమైక్య సెగ కేంద్రానికి తాకాలి
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : కేంద్ర ప్రభుత్వానికి సమైక్యాంధ్ర సెగ తాకే విధంగా చేస్తే తప్ప దిగి రాదని దూదేకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అక్బర్‌బాషా, జిల్లా అధ్యక్షుడు పీరయ్య అన్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోరుతూ ఆ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ఉన్న దీక్షా శిబిరాలను సందర్శించి దీక్షాపరులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి అత్యధికంగా 33 ఎంపీ స్థానాలను ఇచ్చిన రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలని సీడబ్ల్యుసీ నిర్ణయించడం శోచనీయమన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ఈ నిర్ణయాన్ని తీసుకుందని విమర్శించారు. శ్రీకృష్ణ కమిటీ సిఫారసులను తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు తమ పదవులను కాపాడుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారే తప్ప రాష్ట్ర విభజనను చిత్తశుద్ధితో అడ్డుకోవడం లేదని ఆరోపించారు. విభజన వల్ల ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం సాగునీటి విషయంలో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వివరించారు. విద్య, ఉద్యోగ రంగాల్లో సైతం అవకాశాలు కోల్పోవాల్సి ఉంటుందన్నారు. ఈ అంశాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా తన కుమారుడిని ప్రధానమంత్రిని చేయాలన్న ఏకైక లక్ష్యంతో రాష్ట్ర విభజనకు పాల్పడటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి బాదుల్లా, ఉపాధ్యక్షుడు ఓబులేసు, నాయకులు రాజా, బాలు, నజీర్, కుళాయప్ప, మహబూబ్‌బాషా, గిరి తదితరులు పాల్గొన్నారు.