తెలంగాణ మనలేదు! | Sri Krishna Committee Secret Proposals on Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ మనలేదు!

Published Mon, Dec 2 2013 2:16 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

తెలంగాణ మనలేదు! - Sakshi

తెలంగాణ మనలేదు!

విఫల రాష్ట్రంగా మిగులుతుంది
 కేంద్రానికి శ్రీకృష్ణ కమిటీ రహస్య నోట్
 2010లోనే నివేదికతో పాటు విడిగా సమర్పణ
     హైదరాబాద్ రాజధానిగా ఇస్తే జరిగేదదేనని స్పష్టీకరణ
     నగరం కోసం ఉద్యమాలు ఖాయమని హెచ్చరిక
     హామీలు నెరవేరక ప్రజల్లో అసంతృప్తి ప్రబలుతుంది
     సీమాంధ్రులపై, వారి ఆస్తులపై దాడులు జరగవచ్చు
     ఆర్థిక కుంగుబాటుకు, సామాజిక అస్థిరతకు దారితీస్తుంది
     మావోయిజం, మత ఉద్రిక్తతలు తలెత్తుతాయి
     జిహాదీ తీవ్రవాదం, హిందూ అతివాదం రావచ్చు
     నోట్ వివరాలతో బిజినెస్ స్టాండర్డ్ కథనం
 
 ‘హైదరాబాద్ రాజధానిగా తెలంగాణను ఏర్పాటు చేస్తే ఒక రాష్ట్రంగా అది విజయవంతంగా మనుగడ సాగించలేదు’
 - రాష్ట్ర విభజనపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వ్యక్తం చేసిన రహస్య అభిప్రాయమిది.
 
 సాక్షి, హైదరాబాద్: ఆర్థిక ఇక్కట్లు, మావోయిజం పునరుత్థానం, మతపరమైన ఉద్రిక్తతలను అందుకు ప్రధాన కారణాలుగా కమిటీ పేర్కొంది. 2010లోనే కేంద్ర హోం శాఖకు సమర్పించిన రహస్య నోట్‌లో ఈ మేరకు పలు సంచలనాత్మక వ్యాఖ్యలు చేసింది! ‘‘హైదరాబాద్ రాజధానిగా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే అది తెలంగాణవాదుల భావోద్వేగాలను తృప్తి పరచవచ్చేమో. కానీ ఆర్థికంగా మాత్రం అది ఎలాంటి లబ్ధి చేకూర్చజాలదు. ఎందుకంటే హైదరాబాద్‌ను పూర్తిగా తెలంగాణకే పరిమితం చేస్తే దాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని, వాటికి నిరసనగా మరికొన్ని... ఇలా పలు కొత్త తరహా ఉద్యమాలు పుట్టుకొస్తాయి. అది హింసకు కూడా దారితీయవచ్చు. ఇదో విషవలయంలా సాగుతూనే ఉంటుంది. దాంతో నగర ఆర్థిక వ్యవస్థ, ఆదాయోత్పత్తి పూర్తిగా దెబ్బ తింటాయి.
 
 ఇది యువత, వృత్తి నిపుణులు, రైతుల్లో తీవ్ర నిరాశా నిస్పృహలకు దారి తీస్తుంది. హైదరాబాద్‌లో, తెలంగాణలో ఉండే సీమాంధ్రులు వాటికి బలి కావచ్చు. నిరాశకు లోనైన తెలంగాణవాసులు సీమాంధ్రులపై, వారి ఆస్తులపై ఉద్దేశపూర్వక దాడులకు కూడా దిగవచ్చు. ఇక ఉద్యమ కాలంలో తెలంగాణ అనుకూల పార్టీలు గుప్పించిన భారీ హామీలేవీ నెరవేరక దీర్ఘకాలంలో యువతతో పాటు పలు సామాజిక వర్గాల్లో తీవ్ర అసంతృప్తి రగుల్కొనవచ్చు. అసంతృప్తికి లోనైన యువత, నిరుపేద వర్గాలు మావోయిజం వైపు ఆకర్షితులై సాయుధ బాట పట్టవచ్చు. అంతేగాక హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని చాలా పట్టణాల్లో ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కాబట్టి హిందూ, ముస్లింల మధ్య మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తి చివరికి తెలంగాణలో హిందూ అతివాదం, జిహాదీ తీవ్రవాదం ప్రబలే ప్రమాదముంది. పైగా తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ఎస్సీ, బీసీ సామాజికవర్గాల వారి రాజకీయ ఆకాంక్షలు పెద్దగా నెరవేరక సామాజిక అస్థిరత కూడా తలెత్తవచ్చు. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినా, పై కారణాలన్నింటి నేపథ్యంలో అది అచిర కాలంలోనే ఒక విఫల రాష్ట్రంగా మిగిలిపోవచ్చు’’ అంటూ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టింది.
 
 తెలంగాణ ఏర్పాటు డిమాండ్ల నేపథ్యంలో కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీ ఆరు సిఫార్సులతో 2010 డిసెంబర్ 30న నివేదిక సమర్పించడం తెలిసిందే. పైన పేర్కొన్న అంశాలతో కూడిన తన అసలు అభిప్రాయాన్ని కూడా అదే సందర్భంగా విడిగా ఒక నోట్ రూపంలో కేంద్ర హోం శాఖకు కమిటీ అందజేసింది. ఈ విషయాన్ని బిజినెస్ స్టాండర్డ్ ఆంగ్ల దినపత్రిక తాజాగా బయటపెట్టింది. నోట్‌లోని ప్రధానాంశాలతో శనివారం ఓ కథనం ప్రచురించింది. నోట్ ప్రతిని తాము సంపాదించామని, దీనిపై జస్టిస్ శ్రీకృష్ణను సంప్రదించగా కేంద్ర హోం శాఖకు విడిగా నోట్ సమర్పించిన మాట నిజమేనని అంగీకరించారని కూడా పత్రిక తెలిపింది. అయితే దానిపై వివరాలు వెల్లడించేందుకు మాత్రం ఆయన ఇష్టపడలేదని వివరించింది. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలా, ఉమ్మడి రాజధానిగా ఎన్నేళ్లుంచాలి వంటి పలు అంశాలపై ఎటూ తేల్చుకోలేక విభజన విధివిధానాల ఖరారుకు ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ఇప్పటికే తలపట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధానికి సంబంధించి జీవోఎం తన నివేదికలో కేంద్రానికి చేయబోయే సిఫార్సుపై శ్రీకృష్ణ కమిటీ విడి నోట్ ప్రభావం చూపవచ్చంటున్నారు.
 
 రహస్య నోట్‌లో శ్రీకృష్ణ కమిటీ వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇవీ...
 మావోయిజం తిరిగి వేళ్లూనుతుంది
మావోయిస్టు నేతల్లో అత్యధికులు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే. అయినా దేశంలోని మావోయిజం బాధిత రాష్ట్రాలన్నింట్లోనూ ఆంధ్రప్రదేశే ఆ సమస్యను విజయవంతంగా పరిష్కరించుకోగలిగింది. కొన్నేళ్ల క్రితమే రాష్ట్రంలో మావోయిస్టులు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయారు. ఇలాంటప్పుడు హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తలెత్తే పరిస్థితులను తమకు అనువుగా మలచుకుని వారు తిరిగి వేళ్లూనుకోవచ్చు. పైగా కొత్త రాష్ట్రం తొలుత మావోయిస్టుల విషయంలో మెతకగా వ్యవహరించే ఆస్కారముంది. వారి ప్రమాదాన్ని అది గుర్తించేలోపే సమస్య చేయి దాటిపోవచ్చు. పైగా విభజన అనంతరం తెలంగాణకు మిగిలే పోలీసు బలగాలు మావోయిస్టులను సమర్థంగా ఎదుర్కొనేందుకు చాలకపోవచ్చు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుంచి మావోయిస్టులు తమ కార్యకలాపాలను తెలంగాణలోకి విస్తరించవచ్చు. ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండలతో పాటు నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వారు పాగా వేసే ప్రమాదముంది.
 
 మత ఉద్రిక్తతలూ తప్పవు
 మావోయిజంతో పాటు మతపరమైన ఉద్రిక్తతలకు కూడా తెలంగాణ కేంద్రం కావచ్చు. గతంలో కూడా హైదరాబాద్ పలుమార్లు మత అల్లర్లను చవిచూసింది. పైగా వాటిలో చాలావరకు చిన్న చిన్న కారణాలతో పుట్టుకొచ్చినవే. తెలంగాణలో పలు ముస్లిం ప్రాబల్య ప్రాంతాలున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, భైంసా, నిజామాబాద్ జిల్లాలోని బోధన్, కామారడ్డి, కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, కరీంనగర్, మెదక్ జిల్లాలోని జహీరాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాలోని భువనగిరి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేట్, మహబూబ్‌నగర్, రంగారడిడ జిల్లాలోని తాండూరు, వికారాబాద్ వంటివి మతపరంగా చాలా సున్నితమైన ప్రాంతాలు. అక్కడ రెండు మతాల వారూ పరస్పర అనుమానాల మధ్యే జీవిస్తున్నారు. నిరుద్యోగం, సామాజిక అస్థిరతలకు ఈ మతపరమైన ఉద్రిక్తతలు కూడా తోడైతే చివరికి అది జిహాదీ తీవ్రవాద శక్తులు పెచ్చరిల్లేందుకు కారణమైనా ఆశ్చర్యం లేదు. ముస్లిం ప్రభావాన్ని ఎదుర్కొనే పేరుతో హిందువులను వారికి వ్యతిరేకంగా మార్చేందుకు హిందూ మతోన్మాద శక్తులు కూడా ప్రయత్నించవచ్చు
 
 రాజకీయంగానూ అస్థిరతే
 తెలంగాణ అనుకూల పార్టీలన్నీ ప్రజలకు భారీ హామీలిస్తున్నాయి. కానీ రాష్ట్రం ఏర్పాటయ్యాక అవి ఆచరణలో సాధ్యపడకపోవచ్చు. ఎందుకంటే వనరుల కోసం, నిపుణులైన పనివారి కోసం హైదరాబాద్ చాలావరకు సీమాంధ్రపైనే ఆధారపడుతుంది. రాష్ట్ర పరిశ్రమల్లో చాలావరకు హైదరాబాద్, దాని పరిసరాల్లోనే ఉన్నాయి. దాంతో ధర్నాలు, ఆందోళనలు, హింసాకాండతో పాటు ఆర్థిక వృద్ధి పూర్తిగా దెబ్బ తినడం వంటివాటి వల్ల నిరాశా నిస్పృహలను హైదరాబాద్ చవిచూడవచ్చు. తెలంగాణ ఉద్యమకారుల్లో చాలామంది ఎస్సీ, బీసీ సామాజికవర్గాల వారే. వారంతా కొత్త రాష్ట్రంలో తమకు రాజకీయ అవకాశాలు, నాయకత్వ పాత్ర లభించాలని కోరుకుంటున్నారు. అవి నెరవేరని పక్షంలో సామాజిక అస్థిరతకు ఇది కూడా ప్రధాన కారణంగా మారవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement