కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : కేంద్ర ప్రభుత్వానికి సమైక్యాంధ్ర సెగ తాకే విధంగా చేస్తే తప్ప దిగి రాదని దూదేకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అక్బర్‌బాషా, జిల్లా అధ్యక్షుడు పీరయ్య అన్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోరుతూ ఆ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ఉన్న దీక్షా శిబిరాలను సందర్శించి దీక్షాపరులకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి అత్యధికంగా 33 ఎంపీ స్థానాలను ఇచ్చిన రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలని సీడబ్ల్యుసీ నిర్ణయించడం శోచనీయమన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ఈ నిర్ణయాన్ని తీసుకుందని విమర్శించారు. శ్రీకృష్ణ కమిటీ సిఫారసులను తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు తమ పదవులను కాపాడుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారే తప్ప రాష్ట్ర విభజనను చిత్తశుద్ధితో అడ్డుకోవడం లేదని ఆరోపించారు. విభజన వల్ల ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం సాగునీటి విషయంలో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వివరించారు.
విద్య, ఉద్యోగ రంగాల్లో సైతం అవకాశాలు కోల్పోవాల్సి ఉంటుందన్నారు. ఈ అంశాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా తన కుమారుడిని ప్రధానమంత్రిని చేయాలన్న ఏకైక లక్ష్యంతో రాష్ట్ర విభజనకు పాల్పడటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి బాదుల్లా, ఉపాధ్యక్షుడు ఓబులేసు, నాయకులు రాజా, బాలు, నజీర్, కుళాయప్ప, మహబూబ్‌బాషా, గిరి తదితరులు పాల్గొన్నారు.