సాక్షి, విజయవాడ: కృష్ణానదిలో బోటు ప్రమాదం ఘటన నేపథ్యంలో ఆ శాఖకు చెందిన ఏడుగురు సిబ్బందిని సస్పెండ్ చేయడంపై మిగిలిన వారు రగిలిపోతున్నారు. బోట్లకు అడ్డగోలుగా అనుమతులు రావడానికి కారణమైన మంత్రులు, వారి బంధువులు, వారికి సహకరించిన ఉన్నతాధికారులను వదిలేసి, కిందస్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఏకపక్ష విచారణ అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం పోరాటానికి సిద్ధమవుతున్నారు.
నిజం చెబితే సస్పెన్షన్ వేటే..!?
కృష్ణానదిలో తిరుగుతున్న బోట్లకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కు చెందిన ముఖ్య అధికారి ఒకరు అనుమతులు ఇచ్చారు. అయితే ఆయనే బోటు ప్రమాదంపై విచారణ చేసి ప్రాథమిక నివేదిక అందించారు. ఈ నివేదిక ఆధారంగానే పర్యాటక శాఖామంత్రి అఖిలప్రియ సస్పెండ్ చేశారు. ఆయన చేసిన విచారణపైనా సిబ్బంది తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందిని విచారించేటప్పుడు తమకు అనుకూలంగా సమాధానాలు రాబట్టుకునేందుకు ప్రయత్నించారని తెలిసింది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధుల ఒత్తిడితోనే అనుమతి లేని బోట్లు తిరిగాయంటూ చెప్పినట్లు సమాచారం. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులే బోట్లు ప్రారంభోత్సవం చేయడం, యూనియన్ నేతలు విచారణలో చెప్పినట్లు తెలిసింది. పర్యాటక సంస్థ జెట్టిలను ప్రైవేటు సంస్థలు ఆక్రమించుకున్నప్పుడు, నదిలో ప్రైవేటు సంస్థల పెత్తనం పెరిగినప్పుడు డివిజన్ స్థాయి అధికారులు ఉన్నతస్థాయి అధికారులు దృష్టికి తీసుకువెళ్లినప్పుడే వారు స్పందించి ఉంటే 22 మంది ప్రాణాలు పోయేవి కాదని కొంతమంది సిబ్బంది వివరించారని సమాచారం. ఉన్నత స్థాయి అధికారులు చేసిన పొరపాట్లు వల్లనే బోటు ప్రమాదం జరిగిందని చెప్పబోయిన కొంతమంది సిబ్బందిని సస్పెండ్ చేస్తామంటూ బెదిరించి నోర్లు మూయించారని తెలిసింది.
హైకోర్టుకు డీవీఎం గంగరాజు
మెడికల్ లీవులో ఉన్న డివిజనల్ మేనేజర్ గంగరాజును అధికారులు సస్పెండ్ చేశారు. ఈ అంశంపై ఆయన హైకోర్టుకు వెళ్తున్నట్లు తెలిసింది. తాను సెలవులో ఉన్నప్పుడు జరిగిన ఘటనకు తనను బాధ్యుడిని చేయడాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా ఆయన గతంలో ప్రైవేటు ఆపరేటర్లు అడ్డగోలుగా వ్యవహరిస్తుంటే అడ్డుకున్నారు. అప్పట్లో ఇది వివాదం కావడంతో ఉన్నతాధికారులు సూచన మేరకు కొద్ది రోజులు సెలవుపై వెళ్లారు. అప్పుడు ప్రైవేటు ఆపరేటర్లకు మద్దతుగా ఉన్న అధికారులు ఇప్పుడు గంగరాజును బాధ్యుణ్ణి చేస్తూ సస్పెండ్ చేయడంపై సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోటు డ్రైవర్ గేదెల శ్రీను, అసిస్టెంట్ మేనేజర్ కొల్లి శ్రీధర్‌కు ప్రైవేటు సంస్థల్లో వాటాలున్నాయని బదిలీ చేశారు. అప్పుడే ఉన్నతాధికారులు నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేసి ఉంటే ప్రమాదం జరిగేదికాదని అంటున్నారు.
ఉద్యోగానికి భద్రత ఏదీ?
పర్యాటక సంస్థలో 80శాతం మంది కాంట్రాక్టు, ఒప్పంద ఉద్యోగులే. ప్రస్తుతం జరిగిన సస్పెన్షన్లతో వీరిలో అభద్రతా భావం పెరిగిపోయింది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చేసిన తప్పులకు సంస్థలో పనిచేసిన కిందస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేశారని, భవిష్యత్తులో తమపై ఆ విధంగా చేయని తప్పులకు వేటు వేయరనే గ్యారంటీ ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో కృష్ణానదిపై ప్రైవేటు సంస్థలు ఆజమాయిషి పెరిగినప్పుడు ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. అప్పట్లో అభ్యంతరాలు చెప్పినవారే ఇప్పడు బలయ్యారని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment