విస్సన్నపేట, న్యూస్‌లైన్ : విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా ఎవరి విధులు వారు బాధ్యతగా నిర్వర్తించాలని నూజివీడు సబ్‌కలెక్టర్ చక్రధర్‌బాబు అధికారులకు సూచించారు. మండలంలోని నరసాపురం సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురైన తీరుపై గురువారం ఆయన విచారణ చేపట్టారు. మార్చి 29 వతేదీ నుంచి 2వ తేదీ వరకు జరిగిన సంఘటనలకు సంబంధించి ఆ సమయంలో విధుల్లో ఉన్న సిబ్బందిని ఆయన విచారించారు.
మీ పిల్లలైతే ఇలగే చూస్తారా అని సిబ్బందిని ప్రశ్నించారు. అనారోగ్యానికి గల కారణాలను వైద్యసిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని వంట గదిని, మరుగుదొడ్లను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాలికలు చదువు మానుకోవద్దని హితవు పలికారు. ఏమైనా సమస్యలుంటే తనకు ఫోన్‌ద్వారా సమాచారం అందించాలన్నారు. విద్యార్థులకు వడ్డించే ఆహారాన్ని పాఠశాలలో విధుల్లో ఉన్న సిబ్బంది ముందుగా తిన్న అనంతరమే వడ్డించాలని ఆదేశించారు.
కాగా పాఠశాలలో తమ పిల్లలు ఎదుర్కొం టున్న సమస్యల గురించి తల్లిదండ్రులు సబ్‌కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన ఇకపై అటువంటివి జరుగకుండా ఉండేందుకు ప్రతి నెలా క్రమంతప్పకుండా పేరేంట్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థుల అస్వస్థతకు సంబంధించి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జోనల్ అధికారి ఎం.పుల్లయ్య, తాహశీల్దార్ సాయిగోపాల్, వైద్యాధికారులు సీతారామ్, విజయలక్ష్మి పాల్గొన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం వద్దు
Published Fri, Apr 4 2014 2:59 AM | Last Updated on Fri, Nov 9 2018 4:44 PM
Advertisement
Advertisement