డ్వాక్రాకు షాక్ | dock loan Waived Shock in Kakinada | Sakshi
Sakshi News home page

డ్వాక్రాకు షాక్

Published Wed, Jun 25 2014 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 9:20 AM

డ్వాక్రాకు షాక్

డ్వాక్రాకు షాక్

 సాక్షి, కాకినాడ :పగ్గాలు చేపట్టి నెలరోజులైనా డ్వాక్రా రుణాల మాఫీపై నాన్చివేత ధోరణి అవలంబిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం తాము అధికారంలో రావడానికి కారకులైన మహిళలకు గట్టి షాక్ ఇచ్చింది. కుటుంబ అవసరాల నిమిత్తం స్త్రీ నిధి బ్యాంకు నుంచి తీసుకునే రుణాలపై వడ్డీ వసూలు చేయాలని రాష్ర్ట ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం డ్వాక్రా సంఘాలను ఆందోళనకు గురిచేస్తోంది. నిన్నటి వరకు ఈ రుణాలపై వడ్డీని నేరుగా ప్రభుత్వమే సంబంధిత బ్యాంకులకు చెల్లిం చేది. జూలై-1 నుంచి అసలుతో పాటు వడ్డీ వసూలు చేయాలని హుకుం జారీచేసింది. బ్యాంక్ లింకేజ్ ఇచ్చినప్పుడు వడ్డీ మొత్తం సంబంధిత సంఘాల అకౌంట్ లో జమవుతుందని చెబుతున్న ప్రభుత్వం ఎప్పటిలోగా వడ్డీని తిరిగి చెల్లస్తామన్నది మాత్రం చెప్పకపోవడం చూస్తుంటే ఈ పథకం అమలు బాధ్యత నుంచి  పూర్తిగా తప్పుకునే ఎత్తుగడగా కనిపిస్తోందని ప్రభుత్వ తీరుపై మహిళా సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి.
 
 నీరుగారనున్న పథకం
 ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, మైక్రోఫైనాన్స్ సంస్థల ఉచ్చులో పడకుండా ఉండేందుకు ఉద్దేశించిన స్త్రీనిధి పథకం నేడు నీరుగారే పరిస్థితులు ఏర్పడ్డాయి. చిన్న చిన్న కుటుంబ అవసరాల కోసం మైక్రో ఫైనాన్స్ సంస్థల నుంచి ఐదు రూపాయలు..  పదిరూపాయల వడ్డీకి రుణాలు తీసుకొని డ్వాక్రా మహిళలు అప్పుల ఊబిలో కూరుకుపోయేవారు. ఈ ఉచ్చు నుంచి వారిని బయటపడేయడంతో పాటు కుటుంబ అవసరాల నిమిత్తం అవసరమైన చిన్న చిన్న మొత్తాలను వడ్డీ లేకుండా అందించే లక్ష్యం తో 2011 నవంబర్‌లో స్త్రీనిధి బ్యాంకును  ఏర్పాటు చేశారు. ఇందుకోసం మండల సమాఖ్యల నుంచి రూ.100 కోట్లు సమీకరించగా, మరో రూ.120 కోట్లు ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్‌గా సమకూర్చింది. గత మూడేళ్లలో ఈ బ్యాంకు ద్వారా ఉమ్మడి రాష్ర్టంలో రూ.1800 కోట్ల రుణాలు మంజూరు చేశారు. ఒక్క మన జిల్లాలోనే రూ.50 కోట్ల వరకు రుణాలందజేశారు. రుణం కావాల్సిన డ్వాక్రా సభ్యురాలు తమ గ్రామైక్య సంఘం ద్వారా మొబైల్ రిక్వెస్ట్ పంపితే 48 గంటల్లో ఒక్కొక్క సభ్యురాలికి రూ.10వేల నుంచి రూ.25వేల వరకు రుణాలు సంబంధిత సంఘ అకౌంట్‌లో జమ అయ్యేవి. ఇలా ఒక్కొక్క సంఘం నుంచి ఆరుగురుకు తక్కువ కాకుండా రుణసదుపాయం పొందే అవకాశం కల్పించారు. 
 
 ఈ విధంగా జిల్లాలో ఇప్పటి వరకు ఆరువేల సంఘాల పరిధిలోని 30వేల మంది డ్వాక్రా మహిళలు రూ.10వేల నుంచి రూ.25వేల వరకు స్త్రీ నిధి బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నారు. గత మూడేళ్లలో రూ.50కోట్ల రుణాలు మంజూరు చేస్తే ఇంకా రూ.30 కోట్ల వరకు రికవరీ కావాల్సి ఉంది. ప్రతినెలా ఈ విధంగా చిన్న చిన్న అవసరాల నిమిత్తం డ్వాక్రా మహిళలు రూ.2కోట్ల వరకు రుణాలు తీసుకుంటారు. ఇన్నాళ్లూ మంజూరు చేసిన ఈ రుణాలకుసంబంధించి అసలు మాత్రమే మహిళల నుంచి వసూలు చేసేవారు. వడ్డీని మాత్రం ప్రభుత్వమే నేరుగా సంబంధిత బ్యాంకులకు జమచేసేది. ఇప్పుడు బ్యాంకులకు ఈ వడ్డీ చెల్లించే బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. 
 
 14 శాతం వడ్డీ
 సాధారణంగా ఏైదైనా అవసరార్థం తీసుకునే రుణంపై బ్యాంకులు వసూలు చేసే 14 శాతం వడ్డీని ఇక నుంచి స్త్రీ నిధి రుణాలపై కూడా వసూలు చేయాలని నిర్ణయించింది. బోర్డు నిర్ణయం మేరకే వడ్డీ వసూలు చేయాలని నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వాదేశాల మేరకే బోర్డులో తీర్మానం చేశారని అంటున్నారు. ప్రభుత్వ ప్రమేయం లేకుండా స్త్రీనిధి బ్యాంకు డెరైక్టర్లు సమావేశంలో ఎలాంటి తీర్మానాలు చేయరని విశ్లేషకులంటున్నారు. వడ్డీ లే ని రుణపథకం నుంచి తప్పించుకునేందుకే తొలి ప్రయత్నంగా స్త్రీ నిధి రుణాలపై ప్రభుత్వం వడ్డీ వసూలు చేయాలని నిర్ణయించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర్ణయంపై మహిళా సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. గతంలో మాదిరిగానే వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలని డ్వాక్రా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జనం అవసరాలను ఆసరాగా చేసుకొని మైక్రోఫైనాన్స్ సంస్థలు, ప్రైవేటు వడ్డీ వ్యాపారులు మళ్లీ విజృంభించే అవకాశాలున్నాయని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 బోర్డు నిర్ణయం మేరకే వసూలు
 గత నెలలో జరిగిన స్త్రీనిధి బ్యాంకు బోర్డు మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయం మేరకే వడ్డీ వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారని జిల్లా స్త్రీనిధి బ్యాంకు ఏజీఎం హేమంత్ తెలిపారు. స్త్రీ నిధి రుణాలు కూడా వడ్డీ లేని రుణంగానే మంజూరవుతాయని, అయితే వడ్డీకి సంబంధించిన బ్యాంకు లింకేజ్ మొత్తం ప్రభుత్వం మంజూరు చేయగానే, సక్రమంగా చెల్లించిన మహిళల అకౌంట్లలో ఆ మొత్తం తిరిగి జమవుతుందని చెప్పారు.
 
 వడ్డీ వేయడం దారుణం
 మహిళల ఆర్థిక స్వావలంబన కోసం స్త్రీ నిధి పథకం ద్వారా తీసుకునే రుణాలకు వడ్డీ వసూలు చేయడం దారుణం. ఈ మేరకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎప్పటి మాదిరిగానే వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వాలి.
 - గొలుసు వెంకట రమణ, విజయలక్ష్మి డ్వాక్రా సంఘం సభ్యురాలు, జార్జిపేట, తాళ్లరేవు మండలం.
 
 గతంలో మాదిరిగానే రుణాలు ఇవ్వాలి
 స్త్రీనిధి పథకం ద్వారా మహిళలకు గతంలో మాదిరిగానే రుణాలు ఇవ్వాలి. ఈ పథకానికి సంబంధించి వడ్డీ వసూలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం వల్ల మహిళలు ఆర్థికంగా నష్టపోతారు. గత ప్రభుత్వం అమలు చేసిన విధంగానే ఈ పథకాన్ని అమలు చేయాలి.
 - డి. వెంకటలక్ష్మి, డ్వాక్రా సంఘం సభ్యురాలు,
 తూర్పుపేట, తాళ్లరేవు మండలం.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement