గుంటూరు జీజీహెచ్, ఇన్‌సెట్లో డాక్టర్ ఎస్.బాబులాల్
సాక్షి, గుంటూరు : గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా ఎవరు వస్తారనేదానిపై రెండు నెలలుగా వైద్యుల్లో, సిబ్బందిలో నెలకొన్న ఉత్కంఠకు గురువారం తెరపడింది. అనంతపురం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ టీబీ, ఛాతి వ్యాధుల వైద్య విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఎస్.బాబులాల్‌కు అడిషనల్ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి గురువారం జీవో విడుదల చేశారు.
గత ప్రభుత్వం తొక్కిపెట్టిన పదోన్నతులు...
సీనియార్టీ ప్రాతిపదికన వైద్యులకు పదోన్నతులు ఇవ్వకుండా టీడీపీ ప్రభుత్వం తొక్కిపెట్టింది. టీడీపీ ప్రభుత్వంలో అడ్డదారిలో జూనియర్ వైద్యులను టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లుగా నియమించారు. దాంతోపాటు ప్రభుత్వ వైద్య కళాశాలలకు సైతం జూనియర్‌లనే నియమించారు. ఉన్నతమైన పదవులకు సీనియార్టీకి ప్రాధాన్యం ఇవ్వకుండా నిబంధనలను తుంగలో తొక్కిన టీడీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ కొందరు సీనియర్ వైద్యులు కోర్టుకు సైతం వెళ్లారు. దీంతో గత ఏడాది మే నెలలో సీనియార్టీ ప్రాతిపదికన సూపరింటెండెంట్ పోస్టులు భర్తీ చేస్తామని గత ప్రభుత్వం జీవో ఇచ్చింది.
కానీ ఏడాదిపాటు టీడీపీ ప్రభుత్వం తాము ఇచ్చిన జీవో అమలు చేయలేదు. ఈ విషయంపై పలువురు వైద్యులు ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకుని సీనియార్టీ ప్రాతిపదికన పదోన్నతులు ఇవ్వాలంటూ మొరపెట్టుకున్నారు. దీంతో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సీనియార్టీకి ప్రాధాన్యం ఇస్తూ డీపీసీ (డిపార్ట్‌మెంటల్ ప్రమోషనల్ కమిటీ) ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో డీఎంఈ, అడిషనల్ డీఎంఈ కేడర్లను భర్తీ చేసేందుకు నూతన ప్రభుత్వం జూలై 1న జీవో విడుదల చేసింది. జీవో ప్రకారం గురువారం వైద్యులకు పదోన్నతులు కల్పించారు.
అడ్డదారిలో అందలం...
గత ప్రభుత్వంలో అడ్డదారిలో అందలమెక్కిన సూపరింటెండెంట్‌లు రోజూ రెండు నెలలుగా కార్యాలయ ఉద్యోగుల వద్ద ఇదే తమ చివరి సంతకం అంటూ ఫైళ్లపై సంతకాలు పెడుతున్నారు. పలువురు వైద్యులు, వైద్య సిబ్బందితో సమీక్షలు నిర్వహించే సమయంలో సైతం ఇదే తమ చివరి సమావేశమని నూతన సూపరింటెండెంట్‌లు వస్తున్నారంటూ చెబుతున్నారంటూ చెప్పుకొచ్చారు. రెండు నెలలుగా కొత్త సూపరింటెండెంట్‌లు ఎప్పుడు వస్తారంటూ ఎదురు చూపులు చూసిన వైద్యులు, వైద్య సిబ్బందికి ఉత్కంఠతకు గురువారం తెరపడింది. ప్రస్తుతం సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ రాజునాయుడు నాలుగేళ్ళపాటు సూపరింటెండెంట్ పదవిలో కొనసాగి రికార్డు సృష్టించారు. సీనియార్టీ జాబితాలో చిట్టచివరి స్థానంలో ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో ఉన్న పెద్దల పలుకుబడితో, బడావ్యాపార వేత్త సహకారంతో పదవీ విరమణ పెంపు జీవోను తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు విమర్శలను సైతం ఎదుర్కొన్నారు. జీజీహెచ్ రేడియోథెరఫీ విభాగాధిపతిగా డాక్టర్ రాజునాయుడు 2020 మే వరకు కొనసాగనున్నారు.
రేపు విధుల్లో చేరనున్న బాబులాల్
గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఎస్. బాబులాల్ శనివారం విధుల్లో చేరనున్నారు. ప్రస్తుతం అనంతపురం గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిగా ఆయన జూన్ నుంచి పనిచేస్తున్నారు. విజయవాడకు చెందిన డాక్టర్ బాబులాల్ కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్‌లో 1977లో ఎంబీబీఎస్, విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కాలేజ్‌లో 1983లో ఎండి పల్మనాలజీ మెడిసిన్ చదివారు. గుంటూరు జిల్లా వినుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 1987లో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా విధుల్లో చేరి ప్రభుత్వ సర్వీస్‌లోకి ప్రవేశించారు. తదుపరి 1988 జనవరి 1న మంగళగిరిలోని డాక్టర్ ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు.
అసోసియేట్ ప్రొఫెసర్‌గా 2000లో, ప్రొఫెసర్‌గా 2001 మే9న పదోన్నతి పొంది విశాఖపట్నం కింగ్‌జార్జి ఆస్పత్రికి బదిలీ అయ్యారు. గుంటూరు రూరల్ మండలం గోరంట్ల ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రిలో 2002లో పనిచేసి 2004 ఫిబ్రవరిలో విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్‌కు బదిలీ అయ్యారు. డెప్యూటీ సూపరింటెండెంట్‌గా 2006లో, సూపరింటెండెంట్‌గా 2007లో, 2010లో , సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్‌గా 2012లో పనిచేశారు. డాక్టర్ ఎన్‌టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్‌గా 2013 నుంచి 2015 వరకు పనిచేసి తిరిగి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి బదిలీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment