
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో హత్యాయత్నం జరిగిన తీరుపై పలువురు వైద్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కత్తి వేటు భుజానికి తగిలినందున క్షేమంగా బయటపడ్డారని, అదే మెడ వద్ద గాయమైతే చాలా క్లిష్టంగా ఉండేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనిషి మెడ వద్ద ఉండే రక్తనాళాలు అత్యంత కీలకమైనవని, సున్నితమైనవని.. ఇవి ఏమాత్రం కట్ అయినా అన్ని ప్రధాన అవయవాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని వివరిస్తున్నారు. ఆయువు పట్లు అంటూ మనం చెప్పుకునే చోట చిన్నపాటి గాయమైనా అది ప్రాణాంతకం అయ్యేందుకు అవకాశం ఉందని, ప్రతిపక్షనేత జగన్‌పై ఇలాంటి ఆయువుపట్టే లక్ష్యంగా హత్యాయత్నం జరిగినట్టు స్పష్టమవుతోందంటున్నారు.
- గొంతుభాగంలో కొన్ని ప్రధానమైన కీలక ఆయువు పట్లు ఉంటాయి. అందులో ముఖ్యమైన రక్తనాళాలు కెరొటిడ్ ఆర్టరీస్, వర్టిబ్రల్ ఆర్టరీస్, జుగులార్ వీన్స్. ఇవిగాక వెన్నుపూస, రికరెంట్ లారింజియల్ నరం, ఫ్రెనిక్ నరం, బ్రేకియల్ ప్లెక్సర్స్ (వెన్నుపూస నుంచి వచ్చే నరాల సముదాయం) ఉంటాయి. ఇవిగాక ట్రాకియా (గాలి పంపే గొట్టం), ఈసోఫేగస్ (ఆహారనాళం), థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్రంథులు ఉంటాయి. ఇవన్నీ రెండు నుంచి మూడు సెంటీమీటర్ల లోతులోపే ఉంటాయి.
- వైఎస్ జగన్ విషయమే తీసుకుంటే నిందితుడు మొదట టార్గెట్ చేసిన చోటు మెడ భాగంలోని కెరొటిడ్ ఆర్టరీ. ఇది గుండె నుంచి మంచి రక్తాన్ని తీసుకొని మెదడుకు సరఫరా చేస్తుంది. ఆ ఆర్టరీ మెడ ఎడమభాగంలో ఒకటి, కుడి భాగంలో ఒకటి ఉంటుంది. మెడలో రెండుగా విడిపోయి ఒకటి మెదడుకు... మరొకటి ముఖంలోని భాగాలకు రక్తాన్ని అందిస్తాయి. ఏ కారణం చేతనైనా మెదడుకు కొన్ని సెకండ్ల పాటు రక్తసరఫరా ఆగినా వెంటనే ఆ వ్యక్తి కోమాలోకి వెళ్తాడు. రెండు నిమిషాలలోపు రక్తసరఫరా పునరుద్ధరించలేకపోతే ప్రాణాపాయం తప్పదు. నిందితుడు ఈ భాగాన్నే తన లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.
- సాధారణ పరిస్థితుల్లో రక్తనాళాల్లో ఏదైనా కొవ్వు పదార్థాలు అడ్డుపడి మెదడుకు అందే రక్తం తగ్గితేనే వెంటనే పక్షవాతం వచ్చేస్తుంది. అలాంటిది రక్తనాళం తెగిపోతే ఆ నష్టం ఇక మళ్లీ పూడ్చగలిగేది కాదన్నది వైద్యవర్గాలు చెబుతున్న మాట. అలాగే కొన్ని సందర్భాల్లో చూపు కోల్పోవడం, స్పర్శ కోల్పోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి తీవ్ర ప్రమాదం నుంచి మరణం సంభవించడం వరకు జరిగే ఆస్కారం ఉంది.
- కత్తిదెబ్బ తగిలేందుకు అవకాశం ఉన్న మరో భాగం వేగస్ నర్వ్. మన దేహంలో తల నుంచి వచ్చే కీలక నరాలను క్రేనియల్ నరŠవ్స్ అంటారు. ఇందులో వేగస్ నర్వ్ తల నుంచి మెడ మీదుగా కడుపులోకి వెళ్తుంది. వేగస్ నర్వ్ అనేది మిగతా శరీరాన్ని ముఖ్యంగా గొంతులో మింగడానికి ఉపయోగించే కండరాలు, మాట్లాడటానికి ఉపయోగపడే వోకల్ కార్డ్స్, గుండె, ఊపిరితిత్తులు, జీర్ణకోశ వ్యవస్థలకు సంకేతాలను అందజేసే నరం. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఈ నరానికి గాయమైతే వెంటనే మాట పడిపోతుంది. ఎలాంటి ద్రవాలు మింగడం సాధ్యం కాదు. లయబద్ధమైన గుండె స్పందనల్లో మార్యులు వచ్చి, అది స్పందించే తీరు.. లయ తప్పుతుంది. బ్లడ్‌ప్రెషర్‌లో మార్పులు వస్తాయి. కడుపులో స్రవించాల్సిన యాసిడ్, స్రావాలు.. సక్రమంగా స్రవించవు.
- గొంతు వెనక భాగంలో గాయమైతే కాళ్లు, చేతులు చచ్చుబడిపోవడం, మల మూత్ర విసర్జన మీద నియంత్రణ కోల్పోవడం జరగవచ్చు. వేగస్ నర్వ్ తర్వాత మెడ భాగంలో ఉండే కీలకమైన నరం ‘ప్రెనిక్ నర్వ్ ’. ఇవి మెడ భాగంలో 3, 4, 5 సర్వికల్ నరాలుగా బయటకు వచ్చి మన కడుపులో స్పందిస్తూ ఉండే డయాఫ్రమ్‌కు అనుసంధానమై ఉంటుంది. దీనికి గాయమైతే ఊపిరి తీసుకునే ప్రక్రియకు అంతరాయం ఏర్పడి, వెంటిలేటర్ సహాయం కోసం వెళ్లాల్సి రావచ్చు. వెంటనే ఊపిరి అందకపోతే ప్రాణాపాయం సంభవించే ఆస్కారం ఉంది.
- గొంతులోని బ్రేకియల్ ప్లెక్సస్‌కు గాయమైతే.. చెయ్యి చచ్చుబడిపోయే ఆస్కారం ఉంటుంది.
- ట్రాకియాకు గాయమైతే అందులోని గాలి గొంతు, ఛాతీ భాగాలలో లీక్ అయ్యి ఊపిరి తీసుకోవడం కష్టం కావడం మొదలుకొని ప్రాణాపాయం సంభవించే ఆస్కారం ఉంది.
- ఈ నరాలతో పాటు బ్రాకియోసెఫాలిక్ ట్రంక్, రైట్ అండ్ లెఫ్ట్ సబ్‌క్లేవియన్ ఆర్టరీస్, పోస్టీరియర్ ఆరిక్యులార్ వీన్, వర్టెబ్రల్ వీన్, ఇంటర్నల్ జగ్లర్ వీన్, యాంటీరియర్ జగ్లర్ వీన్, ఈసోఫేగస్, థైరాయిడ్, పారాథైరాయిడ్.. లాంటి ఎన్నో కీలకమైనవి మెడ భాగంలో ఉంటాయి. లోతుగాయం తగిలి ఏ రక్తనాళం తెగినా అది చాలా ప్రమాదకరమైన అత్యవసర స్థితికి దారి తీస్తుంది.
గాయం తగిలినప్పుడు తెలియకపోయినా, సుదీర్ఘకాలంలో ఎదురయ్యే ప్రమాదాల్లో ముఖ్యమైనవి
ఇన్ఫెక్షన్స్, చీముగడ్డలు ఏర్పడటం, సూడో అన్యురిజమ్ (రక్తనాళాల గోడలు ఉబ్బడం), ఆర్టీరియల్ డైసెక్షన్ (రక్తనాళపు గోడలు కట్ అయి అక్కడి రక్తం గడ్డ కట్టడం), ఫిస్టులా (ఒక రక్తనాళానికీ, మరో రక్తనాళానికీ కనెక్షన్ ఏర్పడటం), కొన్నిసార్లు అదేపనిగా రక్తస్రావం అవుతుండటం, రక్తనాళం సన్నబడటం.. తద్వారా రక్తపు గడ్డలు తయారు కావడం వంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు.
- సాధారణంగా ఇన్ని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున మెడ భాగంలో అయిన గాయాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇలాంటి గాయాలు చాలా అరుదుగా జరుగుతాయి. అందువల్ల ఇలాంటి గాయాలకు చికిత్స చేసే అవకాశం, తర్ఫీదు, నైపుణ్యం చాలా మంది డాక్టర్లకు అంతగా ఉండే అవకాశం ఉండదు. పైగా ఆ స్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన పరికరాలు, పరిసరాలు, న్యూరో సర్జన్, జనరల్ సర్జన్, ఈఎన్‌టీ సర్జన్, కార్డియో థొరాసిక్ సర్జన్, ప్లాస్టిక్ సర్జన్ వంటి నిపుణుల అందుబాటు కూడా చాలా అవసరం. ఇది కూడా మరో ప్రమాదమైన పరిస్థితి.
Comments
Please login to add a commentAdd a comment