30 పడకలు.. ఒక్కరే వైద్యుడు | Doctors Shortage in Kanekallu Hospital Anantapur | Sakshi
Sakshi News home page

30 పడకలు.. ఒక్కరే వైద్యుడు

Published Tue, Jun 4 2019 11:43 AM | Last Updated on Tue, Jun 4 2019 11:43 AM

Doctors Shortage in Kanekallu Hospital Anantapur - Sakshi

సమస్యలకు నిలయంగా మారిన కణేకల్లు సామాజిక ఆరోగ్యకేంద్రం

ప్రచార ఆర్భాటానికి అలవాటు పడిన గత టీడీపీ సర్కార్‌...ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. నిరుపేదల జీవితాలతో చెలగాటమాడింది. రూ.కోట్లు ఖర్చు చేశామంటూ గొప్పలు చెప్పినా...నిరుపేదలకు కనీస వైద్య సదుపాయాలు కల్పించలేకపోయింది. కణేకల్లులోని ప్రభుత్వ ఆస్పత్రే ఇందుకు ఉదాహరణ. జిల్లా వైద్యాధికారి పరిధిలో ఉన్న ఈ ఆస్పత్రిని వైద్య విధానపరిషత్‌లో విలీనం చేస్తూ సామాజిక ఆరోగ్యకేంద్రంగా స్థాయి పెంచిన అప్పటి ప్రభుత్వం.... సౌకర్యాలను మాత్రం పెంచలేదు. సాధారణ ఆస్పత్రిలో ఉండాల్సిన సౌకర్యాలు సైతం సీహెచ్‌సీలో లేవు. దీంతో ఈప్రాంత నిరుపేదలంతా వైద్యం అందక అల్లాడిపోతున్నారు.– కణేకల్లు

కణేకల్లుకు చెందిన రేష్మాకు నెలలు నిండటంతో కాన్పు కోసం కుటుంబీకులు కణేకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆ సమయంలో డాక్టర్‌ సెలవులో ఉండటంతో స్టాఫ్‌ నర్స్‌లు బళ్లారి లేదా కళ్యాణదుర్గం వెళ్లమని సూచించారు. వెంటనే ఆమె భర్త కారును అద్దెకు మాట్లాడుకొని 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బళ్లారిలో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు ప్రసవం చేశారు. కణేకల్లు నుంచి బళ్లారికి వెళ్లేందుకు గంటన్నర సమయం... కారు వెతుక్కోవడానికి గంట సమయం పట్టింది. ఈ సమయంలో వారు పడిన వేదన మాటల్లో చెప్పలేనిది. ఇలాంటి సంఘటనలు కణేకల్లు ప్రాంతంలో నిత్యకృత్యం. పేరుకు 30 పడకల ఆస్పత్రి ఉన్నా...ఇక్కడ వైద్యులు ఉండరు. దాదాపు లక్ష మంది జనాభా కోసం కట్టించిన ఈ ఆస్పత్రిలో గైనిక్‌ వైద్యులూ అందుబాటులో లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కణేకల్లు ప్రభుత్వాస్పత్రి చూస్తే సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని తలపిస్తుంది. కానీ లోనికి తొంగిచూస్తే అన్నీ సమస్యలే కనిపిస్తాయి. ఈ ఆస్పత్రిలో కనీసం పీహెచ్‌సీ వైద్యసేవలు కూడా అందడం లేదు. వాస్తవానికి ఇక్కడ ఒక సివిల్‌ సర్జన్, ఒక డిప్యూటీ సివిల్‌ సర్జన్, ఐదు సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌లు...మొత్తం డాక్టర్లు ఏడుగురు ఉండాలి. ఇక్కడ మాత్రం ఒకే ఒక్క డాక్టర్‌ మాత్రమే సేవలందిస్తున్నారు. ఆయన కూడా ఈ నెల 30 ఉద్యోగ విరమణ చేయనున్నారు. రెండేళ్ల నుంచి ఇదే పరిస్థితి నెలకొన్నా... ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం కాంట్రాక్ట్‌ పద్ధతిపైనైనా వైద్యులను నియమించాలని కోరుతున్నారు. 

డాక్టర్‌ సెలవు పెడితే అంతే..
ప్రస్తుతం కణేకల్లు ఆస్పత్రిలో డిప్యూటీ సివిల్‌ సర్జన్‌గా డాక్టర్‌ నాగభూషణం మాత్రమే సేవలందిస్తున్నారు. గత నెలలో ఆయన ఆరోగ్యం బాగలేక మెడికల్‌లీవ్‌ పెడితే ఉన్నతాధికారులు చివాట్లు పెట్టి డ్యూటీకెళ్లమన్నారు. అత్యవసర సమయాల్లో తప్పనిసరిగా లీవ్‌ పెడితే... ఆ రోజుల్లో నర్సులే రోగులకు వైద్యసేవలందించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. 

మూలకుపడిన అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ యంత్రం
శిశువు ఆరోగ్య సమాచారం తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ ఉపయోగపడుతుంది. ప్రతి గర్భిణి కాన్పు అయ్యే వరకూ ఐదారు సార్లు తప్పని సరిగా స్కానింగ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. కణేకల్లు ప్రాంతంలో ఈ స్కానింగ్‌ యంత్రం ఎక్కడా లేదు. దీంతో గర్భిణులంతా బళ్లారి, అనంతపురం నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో స్కానింగ్‌ చేయిస్తే రూ.500 నుంచి రూ.600 వరకు ఫీజు తీసుకుంటారు. దీంతో ప్రభుత్వం రూ. లక్షలు ఖర్చు చేసి అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ యంత్రం కణేకల్లు ఆస్పత్రికి తీసుకువచ్చింది. కానీ ఆస్పత్రిలో రేడియాలజిస్ట్, గైనకాలజిస్టులు ఎవరూ లేకపోవడంతో అత్యంత ఖరీదైన ఈ యంత్రం మూలకుపడింది. 

మంత్రి హామీకే దిక్కులేదు
రూ.2.25 కోట్లతో నూతనంగా నిర్మించిన సీహెచ్‌సీ భవనాన్ని 2017 డిసెంబర్‌ 5న  అప్పటి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ప్రారంభించారు. ఆసుపత్రిలో డాక్టర్ల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని, రోగులకు మెరుగైన వైద్యసేవలందిస్తామని హామీచ్చారు. ఆ తర్వాత ఆయన ఆ మాటే మరచిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

29 గ్రామాలకు ఇదే దిక్కు
కణేకల్లు ప్రభుత్వాసుపత్రిలో 30 పడకలున్నాయి.  కణేకల్లు మండలంలోని 29 గ్రామాల ప్రజలతోపాటు బొమ్మనహళ్‌ మండలంలోని దర్గాహొన్నూరు, గోవిందవాడ, సింగేపల్లి, గోనేహళ్‌ తదితర గ్రామాల నిరుపేద ప్రజలు ఎన్నో ఆశలతో చికిత్స కోసం కణేకల్లు సీహెచ్‌సీ వస్తే నిరాశే మిగులుతోంది. పూర్తిస్థాయిలో డాక్టర్లు లేక పోవడంతో నిరుపేదలు వైద్యసేవలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement