doctors shortage
-
‘ఏ’ అంటే ఆదివాసీలు
అహ్మదాబాద్: ‘‘నాకు ‘ఏ’ అంటే ఆదివాసీలు. వారి ఆశీస్సులతో గుజరాత్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించడం అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నా. ఆదివాసీలు నివసించే ప్రాంతాల్లో గతంలో డాక్టర్ల కోసం వెతుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆసుపత్రులు, వైద్య కళాశాలలు ఏర్పాటవుతున్నాయి’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సొంత రాష్ట్రం గుజరాత్‌లోని వల్సాద్ జిల్లా కప్రాడా తాలూకా నానా పోంధా గ్రామంలో ఆదివారం ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాష్ట్రంలో ఆయన ప్రచారంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఆ గుజరాత్, మై బనావ్యూ చే(ఈ గుజరాత్‌ను నేను తయారు చేశా) అనే కొత్త నినాదానికి మోదీ శ్రీకారం చుట్టారు. ప్రసంగం మధ్యలో ప్రజలతో పలుమార్లు ఈ నినాదాన్ని పలికించారు. రెక్కల కష్టంతో గుజరాత్‌ను తాము తయారు చేశామని ప్రజలంతా భావిస్తున్నారని వెల్లడించారు. ప్రతి ఒక్కరి హృదయం నుంచి వస్తున్న ప్రతి శబ్దం ‘ఆ గుజరాత్, మై బనావ్యూ చే’ అని చెబుతోందన్నారు. రాష్ట్రంలో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు మెజార్టీతో నెగ్గబోతున్నట్లు తనకు సమాచారం అందిందని, పాత రికార్డులను బద్దలు కొట్టడానికే తాను ఇక్కడికి వచ్చానని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ సాధించిన రికార్డుల కంటే భూపేంద్ర పటేల్(గుజరాత్ సీఎం) రికార్డులు బలంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని వివరించారు. రాష్ట్ర ప్రజల కోసం చాలినంత సమయం కేటాయిస్తానన్నారు. రాష్ట్ర ప్రగతి స్ఫూర్తిదాయకం ప్రజాసేవ అనేది గుజరాత్ సంప్రదాయం, సంస్కృతిలో ఒక భాగమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆదివాసీలు, ఇతర వర్గాలు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. గుజరాత్ ప్రగతిని స్ఫూర్తిగా తీసుకొని దేశ ప్రగతి కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. తాను ఢిల్లీలో ఉన్నప్పటికీ గుజరాత్ నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటానని తెలిపారు. తన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రులు పనిచేసిన వారంతా అభివృద్ధి కోసం శ్రమించారని ప్రశంసించారు. దుష్టశక్తులకు పరాజయమే సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేవారికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని మోదీ అన్నారు. గుజరాత్‌ను అప్రతిష్టపాలు చేస్తున్న దుష్టశక్తులకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తప్పదని చెప్పారు. అలాంటి శక్తులు రాష్ట్రం నుంచి తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని స్పష్టం చేశారు. -
Dr. నర్స్.. నర్సులే దిక్కాయె
ఇది చర్లపల్లిలోని బస్తీ దవాఖానా. ఇక్కడ రోజుకు వందమందికి పైగా రోగులు వస్తుంటారు. ఈ ఆస్పత్రిలో రెండు నెలలుగా డాక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో ఇక్కడి స్టాఫ్నర్సేఇన్నిరోజులుగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఇది ఒక్క చర్లపల్లిలోనే కాదు.. నగరంలోని దాదాపు అన్ని బస్తీ దవాఖానాల్లోనూ ఇదే పరిస్థితి. బస్తీల్లో ఏర్పాటు చేసిన దవాఖానాల్లో పూర్తిస్థాయి వైద్యులను నియమించకపోవడం వల్ల ఇలాంటి దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. ఉన్న ఒక్క వైద్యుడు సెలవు పెట్టినా.. అత్యవసర పరిస్థితిలో విధులకు రాలేకపోయినా, పోస్టులు ఖాళీ అయినా... ఆస్పత్రికి వచ్చిన రోగులకు నర్సులే వైద్యులుగా సేవలందించే పరిస్థితి గ్రేటర్లో నెలకొంది. అత్యంత జాగ్రత్తతో చేయాల్సిన వైద్యం గాలికి వదిలేసినట్టవుతోంది. నగరంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలపై ‘సాక్షి’ ఫోకస్.. సాక్షి నెట్వర్క్: ప్రజలకు ప్రభుత్వం అందించే సేవల్లో అత్యంత ప్రధానమైంది వైద్యం. గ్రేటర్‌లోని బోధనాస్పత్రుల్లో నిత్యం వేలాది మంది రోగులు వస్తుంటారు. చిన్నచిన్న రోగాలకు పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ఉండనే ఉన్నాయి. అయితే ఈ ఆస్పత్రుల్లో రోగుల తాకిడికి పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ తరహాలో హైదరాబాద్ నగరంలోనూ బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తద్వారా ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిలోఫర్ వంటి టీచింగ్ ఆస్పత్రులపై భారం తగ్గించవచ్చని భావించింది. ఈ మేరకు ప్రతి పదివేల మందికి ఒకటి చొప్పున ఇప్పటి దాకా 96 బస్తీల్లో దవాఖానాలను ఏర్పాటు చేశారు. మందులు, మౌలిక వసతులను సమకూర్చారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఒక డ్యూటీ డాక్టర్‌తో పాటు ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక అటెండర్‌ను నియమించారు. ఇంటికి సమీపంలోనే ఆస్పత్రి ఉండడం, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య సేవలు అందిస్తుండడంతో స్థానిక ప్రజలు వీటికి క్యూ కడుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పోలిస్తే వీటిలో అందిస్తున్న సేవలు బాగుండడంతో మంచి ఆదరణ లభిస్తోంది. అవసరమైన రోగులకు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులతో టెలిమెడిసిన్ సేవలు అందిస్తుండటంతో రోగులు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా ఫీవర్ ఆస్పత్రిపై జ్వర పీడితుల భారం ఇటీవల భారీగా తగ్గింది. ఒకప్పుడు రోజువారీ సగటు ఓపీ 900 నుంచి 1200 ఉండగా, ప్రస్తుతం 400 నుంచి 600 మించడం లేదంటే బస్తీ దవాఖానాలు రోగులపై ఎంతటి ప్రభావం చూపాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆయా దవాఖానాల్లో ఉన్న ఒక్క వైద్యుడు/వైద్యురాలు సెలవు పెడితే మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. డాక్టర్ లేకుంటే నర్సులే దిక్కు ఒక్కో బస్తీ దవాఖానాకు రోజుకు సగటున 30–60 మంది వరకు రోగులు వస్తున్నారు. జ్వర పీడితులతో పాటు హైపర్ టెన్షన్, మధుమేహ బాధితులు ఎక్కువగా సేవలు పొందుతున్నారు. ఒక్కో ఆస్పత్రికి ఒకే వైద్యుడిని నియమించడంతో అత్యవసర పరిస్థితుల్లో వారు సెలవులో పెడితే ప్రత్యామ్నాయంగా మరో డాక్టర్‌ను అందుబాటులో ఉంచాలి. కానీ బస్తీ దవాఖానాల్లో ఆ పరిస్థితి లేకపోవడంతో ప్రాధమిక వైద్య సేవలను నర్సులే అందించే పరిస్థితి తలెత్తింది. హస్తినాపురం డివిజన్ పరిధిలోని నందనవనంలోని బస్తీ దవాఖానా డ్యూటీ డాక్టర్ గురువారం సెలవులో వెళ్లారు. ప్రత్యామ్నాయం లేకపోవడంతో వచ్చిన రోగులకు నర్సులే వైద్యసేవలు అందించారు. ఇదిలా ఉంటే ఆయా కేంద్రాల్లో వైద్య పరీక్షలకు సంబంధించిన లేబొరేటరీ లేకపోవడం, రోగుల నుంచి నమూనాలు సేకరించి ఐపీఎంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్‌కు పంపాల్సి వస్తుండటం, రిపోర్టుల జారీలో జాప్యం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారు. బస్తీ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందాలంటే ఒక్కో దవాఖానాలో కనీసం ఇద్దరు వైద్యులను నియమించాల్సి ఉంది. ల్యాబ్ సౌకర్యాలు కల్పించాలి శంకర్‌నగర్‌లో బస్తీ దవాఖానాకు విశేష స్పందన లభిస్తోంది. రోజుకు 100–110 మంది రోగులు వస్తున్నారు. మరిన్ని సౌకర్యాలు కల్పించటం ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించగలం. ముఖ్యంగా ల్యాబొరేటరీ అవసరముంది.– డాక్టర్ సైదా, బస్తీ దవాఖానా వైద్యులు మచ్చుకు కొన్ని సమస్యలు.. ♦ కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్ల పరిధిలో దేవేందర్‌నగర్, అయోధ్యనగర్, శివాలయనగర్, ఓల్డ్ జీడిమెట్లలో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారు. ఇవి ఉన్నట్లు స్థానికులకే తెలియని పరిస్థితి. కేవలం ఆయా దవాఖానాల చుట్టూ ఉన్న వారికి మాత్రం తప్ప మిగిలిన వారికి తెలియని పరిస్థితి. శివాలయనగర్‌లో పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలతో బస్తీ దవాఖానాను ఏర్పాటు చేసినా దాని గురించి తెలియక స్థానికులు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడం లేదు. ♦ ఓల్డ్ జీడిమెట్లలో బస్తీ దవాఖానా ఏర్పాటు చేసినా అక్కడ వైద్యులు లేరు. గత రెండు, మూడు నెలల కాలంలో ఇద్దరు వైద్యులు మానేశారు. ఇక్కడ కేవలం సపోర్టింగ్ సిబ్బంది ఒకరు, ఒక స్టాఫ్‌నర్సు మాత్రమే ఉన్నారు. అయితే, ఆ స్టాఫ్‌నర్సు కూడా రెండు రోజులుగా సెలవులో ఉన్నారు. ♦ ఫతేనగర్ డివిజన్లోని ఇందిరాగాంధీపురంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానా ఉదయం 9.30 గంటలైనా తెరుచుకోదు. ఇక్కడ వైద్యుడితో పాటు ముగ్గురు సిబ్బంది పనిచేస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేయాల్సి ఉండగా సిబ్బంది కూడా ఎవరూ అందుబాటులో లేకపోవటంతో వైద్యం కోసం వచ్చిన రోగులు నిరాశతో వెనుతిరగాల్సిన పరిస్థితి. ♦ నాచారం ఎర్రకుంటలో ఏప్రిల్ 14, 2018లో నగర మేయర్ బొంతు రామ్మోహన్ బస్తీ దవాఖానాను ప్రారంభించారు. ఇందులో తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఇబ్బందిగా మారింది. ఇది కాలనీలకు దూరంగా ఉండడంతో ప్రజలు రావడంలేదు. ♦ ఏఎస్‌రావునగర్ డివిజన్ పరిధిలోని సౌత్ కమలానగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానా ప్రారంభోత్సవానికే నోచుకోలేదు. గతంలో ఇక్కడ కమలానగర్ ఆరోగ్య ఉపకేంద్రం ఉండేది. దీనికి మరమ్మతులు చేసి బస్తీ దవాఖానా అని పేరు పెట్టి చేతులు దులుపుకున్నారు. ♦ చర్లపల్లిలోని బస్తీ దవాఖానాలో రెండు నెలలుగా డాక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో ఇన్నిరోజులుగా ఇక్కడి స్టాఫ్‌నర్సే వైద్య సేవలు అందిస్తోంది. ♦ ఉప్పల్ సర్కిల్ చిలుకానగర్ డివిజన్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలోని డాక్టర్ సెలవుల్లో ఉండడంతో స్టాఫ్‌నర్సే ఇక్కడ అన్నితానై చూసుకుంటోంది. ప్రతిరోజు 40 నుంచి 50 మంది రోగులు ఇక్కడకు వస్తుంటారు. త్వరలో టెలి మెడిసిన్ బాగ్ లింగంపల్లి ఈడబ్ల్యూఎస్ క్వార్టర్స్‌లోని కమ్యూనిటీ హాల్లో త్వరలో టెలి మెడిసిన్ విధానం అందుబాటులోకి వస్తుంది. పెద్ద రోగాలకు ప్రత్యేక వైద్యులతో వీడియో కాల్స్ ద్వారా చికిత్స అందిస్తాం. ఏమైనా సర్జరీలు అవసరమైతే అలాంటి వారిని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు పంపిస్తున్నాం. – డాక్టర్ దివాకర్ -
30 పడకలు.. ఒక్కరే వైద్యుడు
ప్రచార ఆర్భాటానికి అలవాటు పడిన గత టీడీపీ సర్కార్...ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. నిరుపేదల జీవితాలతో చెలగాటమాడింది. రూ.కోట్లు ఖర్చు చేశామంటూ గొప్పలు చెప్పినా...నిరుపేదలకు కనీస వైద్య సదుపాయాలు కల్పించలేకపోయింది. కణేకల్లులోని ప్రభుత్వ ఆస్పత్రే ఇందుకు ఉదాహరణ. జిల్లా వైద్యాధికారి పరిధిలో ఉన్న ఈ ఆస్పత్రిని వైద్య విధానపరిషత్‌లో విలీనం చేస్తూ సామాజిక ఆరోగ్యకేంద్రంగా స్థాయి పెంచిన అప్పటి ప్రభుత్వం.... సౌకర్యాలను మాత్రం పెంచలేదు. సాధారణ ఆస్పత్రిలో ఉండాల్సిన సౌకర్యాలు సైతం సీహెచ్‌సీలో లేవు. దీంతో ఈప్రాంత నిరుపేదలంతా వైద్యం అందక అల్లాడిపోతున్నారు.– కణేకల్లు కణేకల్లుకు చెందిన రేష్మాకు నెలలు నిండటంతో కాన్పు కోసం కుటుంబీకులు కణేకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆ సమయంలో డాక్టర్ సెలవులో ఉండటంతో స్టాఫ్ నర్స్‌లు బళ్లారి లేదా కళ్యాణదుర్గం వెళ్లమని సూచించారు. వెంటనే ఆమె భర్త కారును అద్దెకు మాట్లాడుకొని 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బళ్లారిలో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు ప్రసవం చేశారు. కణేకల్లు నుంచి బళ్లారికి వెళ్లేందుకు గంటన్నర సమయం... కారు వెతుక్కోవడానికి గంట సమయం పట్టింది. ఈ సమయంలో వారు పడిన వేదన మాటల్లో చెప్పలేనిది. ఇలాంటి సంఘటనలు కణేకల్లు ప్రాంతంలో నిత్యకృత్యం. పేరుకు 30 పడకల ఆస్పత్రి ఉన్నా...ఇక్కడ వైద్యులు ఉండరు. దాదాపు లక్ష మంది జనాభా కోసం కట్టించిన ఈ ఆస్పత్రిలో గైనిక్ వైద్యులూ అందుబాటులో లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కణేకల్లు ప్రభుత్వాస్పత్రి చూస్తే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని తలపిస్తుంది. కానీ లోనికి తొంగిచూస్తే అన్నీ సమస్యలే కనిపిస్తాయి. ఈ ఆస్పత్రిలో కనీసం పీహెచ్సీ వైద్యసేవలు కూడా అందడం లేదు. వాస్తవానికి ఇక్కడ ఒక సివిల్ సర్జన్, ఒక డిప్యూటీ సివిల్ సర్జన్, ఐదు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు...మొత్తం డాక్టర్లు ఏడుగురు ఉండాలి. ఇక్కడ మాత్రం ఒకే ఒక్క డాక్టర్ మాత్రమే సేవలందిస్తున్నారు. ఆయన కూడా ఈ నెల 30 ఉద్యోగ విరమణ చేయనున్నారు. రెండేళ్ల నుంచి ఇదే పరిస్థితి నెలకొన్నా... ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం కాంట్రాక్ట్ పద్ధతిపైనైనా వైద్యులను నియమించాలని కోరుతున్నారు. డాక్టర్ సెలవు పెడితే అంతే.. ప్రస్తుతం కణేకల్లు ఆస్పత్రిలో డిప్యూటీ సివిల్ సర్జన్‌గా డాక్టర్ నాగభూషణం మాత్రమే సేవలందిస్తున్నారు. గత నెలలో ఆయన ఆరోగ్యం బాగలేక మెడికల్‌లీవ్ పెడితే ఉన్నతాధికారులు చివాట్లు పెట్టి డ్యూటీకెళ్లమన్నారు. అత్యవసర సమయాల్లో తప్పనిసరిగా లీవ్ పెడితే... ఆ రోజుల్లో నర్సులే రోగులకు వైద్యసేవలందించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. మూలకుపడిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రం శిశువు ఆరోగ్య సమాచారం తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉపయోగపడుతుంది. ప్రతి గర్భిణి కాన్పు అయ్యే వరకూ ఐదారు సార్లు తప్పని సరిగా స్కానింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. కణేకల్లు ప్రాంతంలో ఈ స్కానింగ్ యంత్రం ఎక్కడా లేదు. దీంతో గర్భిణులంతా బళ్లారి, అనంతపురం నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో స్కానింగ్ చేయిస్తే రూ.500 నుంచి రూ.600 వరకు ఫీజు తీసుకుంటారు. దీంతో ప్రభుత్వం రూ. లక్షలు ఖర్చు చేసి అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రం కణేకల్లు ఆస్పత్రికి తీసుకువచ్చింది. కానీ ఆస్పత్రిలో రేడియాలజిస్ట్, గైనకాలజిస్టులు ఎవరూ లేకపోవడంతో అత్యంత ఖరీదైన ఈ యంత్రం మూలకుపడింది. మంత్రి హామీకే దిక్కులేదు రూ.2.25 కోట్లతో నూతనంగా నిర్మించిన సీహెచ్‌సీ భవనాన్ని 2017 డిసెంబర్ 5న అప్పటి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ప్రారంభించారు. ఆసుపత్రిలో డాక్టర్ల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని, రోగులకు మెరుగైన వైద్యసేవలందిస్తామని హామీచ్చారు. ఆ తర్వాత ఆయన ఆ మాటే మరచిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 29 గ్రామాలకు ఇదే దిక్కు కణేకల్లు ప్రభుత్వాసుపత్రిలో 30 పడకలున్నాయి. కణేకల్లు మండలంలోని 29 గ్రామాల ప్రజలతోపాటు బొమ్మనహళ్ మండలంలోని దర్గాహొన్నూరు, గోవిందవాడ, సింగేపల్లి, గోనేహళ్ తదితర గ్రామాల నిరుపేద ప్రజలు ఎన్నో ఆశలతో చికిత్స కోసం కణేకల్లు సీహెచ్‌సీ వస్తే నిరాశే మిగులుతోంది. పూర్తిస్థాయిలో డాక్టర్లు లేక పోవడంతో నిరుపేదలు వైద్యసేవలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
గుర్తింపులేని సేవ..!
వారు మెరుగైన వైద్యసేవలందిస్తారు..రోగులు, వారి కుటుంబ సభ్యులమెప్పు పొందుతారు.. మంచివైద్యులుగా గుర్తింపుపొందుతారు..అయితే, ప్రభుత్వం దృష్టిలో వారిసేవకు గుర్తింపు ఉండదు.. వారిసర్వీసు పరిగణలోకి రాదు.. పీజీఅర్హత పరీక్షలో వెయిటేజీ ఉండదు..ఏళ్ల తరబడి పనిచేస్తున్నా సర్వీసుక్రమబద్ధీకరించరు. పీహెచ్‌సీలోకిందిస్థాయి రెగ్యులర్ సిబ్బందినీనియంత్రించలేని దయనీయపరిస్థితి.. పీహెచ్‌సీల్లో పనిచేసేకాంట్రాక్టు వైద్యులది. సర్వీసునుక్రమబద్ధీకరించాలంటూ సమ్మెబాటపట్టారు. అత్యవసర వైద్యసేవలకేపరిమితమవుతున్నారు. మొన్నటివరకు ఏ చిన్న అనారోగ్యం చేసినాఅందుబాటులో ఉండే వైద్యులు ఇప్పుడు ఆస్పత్రిలో కనిపించకపోయేసరికి రోగులు, గర్భిణులుతల్లడిల్లుతున్నారు. ఆందోళనచెందుతున్నారు. విజయనగరం, బలిజిపేట: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేసే వైద్యులది పేరుగొప్ప ఊరుదిబ్బ అనే చందంగా మారింది. చెప్పుకునేందుకు వారు పీహెచ్‌సీకి మెడికల్ ఆఫీసర్లు. అంతర్గతంగా చూస్తే వారికి ఎటువంటి అధికా రాలు లేవు. డ్రాయింగ్ పవర్స్ లేవు. íపీహెచ్‌సీలను నియంత్రించలేరు. ఆస్పత్రిలో రెగ్యులర్ పోస్టులలో ఉండి విధులు నిర్వహించే వారికి పని చెప్పలేరు. వారు ఏం చేస్తే దానికే సై అనాల్సిన పరిస్థితి. మండల స్థాయిలో వీరిని పట్టించుకునే అధికారులూ ఉండరు. పీహెచ్‌సీకి హాజరై సీట్లో కూర్చుని వారి నిర్ధిష్ట సమయంలో ఓపీ చూసుకుని వెళ్లిపోవడం, వైద్యశాఖ పరంగా ఉండే ఇతరత్రా కార్యక్రమాలనునిర్వహించడం మినహా మరే ప్రాధాన్యం లేదు. ఎంతకాలం పనిచేసినా గొర్రెతోక బెత్తెడు అనే చందంగా ఉండడంతో విసిగెత్తిన వీరు గళమెత్తారు. ఆరేళ్లు, ఆ పైబడి పనిచేస్తున్న కాంట్రాక్టు వైద్యాధికారులను క్రమబద్ధీకరించాలంటూ సమ్మెకొనసాగిస్తున్నారు. సేవలకు గుర్తింపు లేదు... రెగ్యులర్ వైద్యులు పీజీ చేయడానికి సర్వీసును వెయిటేజీ ఇచ్చే ప్రభుత్వం... కాంట్రాక్టు వైద్యులు పీజీ చేసేందుకు రాసే పరీక్షలో సర్వీసుకు వెయిటేజీ ఇవ్వడం లేదు. దీంతో వారు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ప్రాధాన్యంలేని ప్రాక్టీసు ఎందుకనేది వారి ప్రశ్న. సమ్మె నిర్వహిస్తున్నారిలా.. ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు విధులు బహిష్కరణ. 10 నుంచి 13వ తేదీ వరకు అత్యవసర సేవలకు మాత్రమే హాజరై మిగిలిన వాటికి గైర్హాజరుకావడం, 14వ తేదీ నుంచి కాంట్రాక్టు వైద్యులందరు సామూహిక సెలవులు పెట్టాలని నిర్ణయించారు. కాంట్రాక్టు వైద్యులు ఇంతవరకు అందించే సేవలు... పీహెచ్సీలో కాంట్రాక్టు వైద్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు సేవలందించాలి. మిగిలిన సమయంలో అత్యవసర సేవలకు పేషెంట్స్ వస్తే సిబ్బంది ఫోన్‌కాల్ చేస్తే సేవలందించాలి. 24 గంటలూ పీహెచ్సీలలో ఇద్దరు వైద్యులుంటే ఒకరు ఓపీ చేసుకుంటే మరొకరు ఫీల్డ్ డ్యూటీ చేయాల్సి ఉంటుంది. పీహెచ్సీలో ఓపీ, ఏంటినేటల్స్ చెకప్‌లు, ప్రత్యేక మెడికల్ క్యాంపులు, ప్రధానమంత్రి మాతృ వందన యోజనాపథకం, ప్రతీ మంగళవారం హైరిస్క్ గర్భిణులకు పరీక్షలు, డీ–వార్మింగ్ డే, నేషనల్ లెప్రసీ రేడికేషన్ ప్రొగ్రాం, పల్స్‌పోలియో, పాఠశాలల పర్యవేక్షణ, వసతిగృహాల పర్యవేక్షణ, మిషన్ ఇంద్రధనుష్, జ్వరాలు ఎక్కువుగా ఉండేచోట ప్రత్యేక వైద్యశిబిరాల నిర్వహణ, వీటితో పాటు ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ల వీడియో, టెలీకాన్ఫెరెన్స్‌లలో పాల్గొనడం తదితర విధులు నిర్వర్తించాలి. ఇబ్బందులు పడుతున్న రోగులు కాంట్రాక్టు వైద్యులు సమ్మె కొనసాగిస్తుండడంతో పీహెచ్సీలో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైరల్ జ్వరాలు తీవ్రంగా ఉండడంతో వచ్చిన రోగులకు సాదాసీదాగా సేవలు అందుతున్నాయి. గర్భిణులకు నెలవారీ వైద్యపరీక్షలకు అంతరాయం కలుగుతోంది. పీహెచ్‌సీల్లో వైద్యులు లేకపోవడంతో రోగులు తప్పనిసరి పరిస్థితిలో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. వైద్యాధికారిణి లేక... నా పేరు మౌనిక. నాది చిలకలపల్లి గ్రామం. నేను గర్భిణిని. ప్రస్తుతం నాకు 9వ నెల. ప్రతీ నెల బలిజిపేట పీహెచ్‌సీకి వచ్చి క్రమం తప్పకుండా చెకప్‌లు చేయించుకుంటున్నాను. అదే కోవలో ఇప్పుడు వ్యయప్రయాసలకోర్చి వస్తే వైద్యాధికారణి లేరు. తిరిగి వెళ్లిపోతున్నాను. -
ఇది అపోలో కాదు.. ధర్మాస్పత్రి
చిత్తూరు అర్బన్:‘ఆస్పత్రిని మీకు క్లినికల్ అటాచ్‌మెంట్‌కు మాత్రమే ఇచ్చాం. అంతమాత్రన ఇది అపోలో ఆస్పత్రి అయిపోదు. ఇది ఎప్పటికీ ధర్మాస్పత్రే. డాక్టర్ల కొరత ఉంది. రావట్లేదు అంటే ఎలా..? అది మీ సమస్య. రూ.లక్ష కాకుంటే మరింత ఇవ్వండి. ఇక్కడ సామాన్యుడికి వైద్యం అందాల్సిందే. ఏదైనా జరిగినప్పుడు జ నం ప్రభుత్వం, ధర్మాస్పత్రి, కలెక్టర్‌ను అంటున్నారే తప్ప మిమ్మల్ని కాదు. మీ రు తీరు మార్చుకోవాల్సింది ఉంది..’ అని రాష్ట్ర వైద్యవిధాన్ పరిషత్ జాయిం ట్ కమిషనర్ డాక్టర్ జయచంద్రారెడ్డి అపోలో అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. బుధవారం చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో డీసీహెచ్ఎస్ డాక్టర్ సరళమ్మతో కలిసి అపోలో వైద్యులు, అధికారులతో పాటు ప్రభుత్వ డాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల ఆస్పత్రిలో సరైన వైద్య సేవలు అందక పలువురు చనిపోయారంటూ ఆందోళనలు, ధర్నాలు చేస్తుండటంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాడింగ్ (ఎం ఓయూ)లో కుదుర్చున్న ఒప్పందం ప్ర కారం చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో అపోలో యాజమాన్యం ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులు భర్తీ చేయాల్సిం దేదన్నారు. ద్విపరిపాలన కుదరదని, ప్రభుత్వ వైద్యులతో కలిసి సమన్వయం చేసుకుని వెళ్లాలన్నారు. ఆస్పత్రిలో గైనకాలజిస్టులున్నా ఎందుకు 24 గంటలు ఇక్కడ ఉండటంలేదని అపోలో సూపరింటెండెంట్ డాక్టర్ ఉమామహేశ్వరరావును ప్రశ్నించారు. తాము నెలకు రూ.1.20 లక్షలిస్తామన్నా ఈ పోస్టుకు వచ్చేవాళ్లు రాత్రి విధులు చేయడానికి ఒప్పుకోవడంలేదన్నారు. దీనిపై జేసీ స్పందిస్తూ ఇది తమ సమస్య కాదని, మీ తిప్పలు మీరు పడి గైనకాలజిస్టులకు 24 గంటల పాటు ఉంచాల్సిందేనన్నారు. జి ల్లాలో మదనపల్లె ఆస్పత్రిలో కంటే చి త్తూరులో కాన్పుల సంఖ్య తక్కువగా ఉందన్నారు. అపోలో రావడం వల్ల ప్రజ ల్లో మరింత నమ్మకం పెరగాలే తప్ప.. ఎందుకు వీళ్లకిచ్చారనే నిందలు వేయకూడదన్నారు. జేసీ విచారణ కాగా ఇటీవల ఆస్పత్రిలో ఎస్ఆర్ పురానికి చెందిన గర్భిణి మృతి చెం దడం, యాదమరికి చెందిన అంగన్వాడీ టీచర్ చనిపోవడంపై వైద్యులను జేసీ విచారించారు. టీచర్ పరిస్థితి విషమించడంతో ఇతర ఆస్పత్రికి రెఫర్ చేస్తే వేలూ రుకు వెళుతూ మధ్యలో డబ్బుల్లేవని వ చ్చేశారని అపోలో వైద్యులు పేర్కొన్నా రు. టీచర్‌కు ఎందుకు సీటీ స్కాన్ తీయలేదని జేసీ ప్రశ్నిస్తే.. కేసు తామే చూశామని, సీటీ నిపుణుడు అందుబాటులో ఉండటంలేదని అపోలో వైద్యులు చెప్పా రు. దీనిపై ప్రభుత్వ వైద్యులు స్పందిస్తూ రాత్రి విధులకు అపోలో డాక్టర్లు ఉండకపోవడంతో గర్భిణి మృతి చెందిందన్నా రు. సమావేశంలో ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ పాండురంగయ్య, ఆర్ఎంఓ డాక్టర్ రాజేంద్రబాబు, సీనియర్ వైద్యులు అరుణ్‌కుమార్, హరిప్రసాద్, శిరీష, లత తదితరులు పాల్గొన్నారు. -
అన్నీ ఉన్నాయ్.. డాక్టర్ లేడు
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ ఆస్పత్రుల రంగులు మారాయి. కొత్తగా ఖరీదైన మంచాలు తెచ్చారు. కొన్ని ఆస్పత్రుల్లో కొత్త దుప్పట్లు వేశారు. అత్యవసర వైద్య సేవలకు అవసరమైన పరికరాలను కొనుగోలు చేస్తున్నారు. పరికరాల కొనుగోలులో వైద్య, ఆరోగ్య శాఖ ఎక్కువగానే శ్రద్ధ చూపుతోంది. కాకపోతే ఆ పరికరాలను ఆపరేట్ చేసేందుకు అవసరమైన సిబ్బంది నియామకంలో మాత్రం ఎక్కడ లేని అశ్రద్ధ కనబరుస్తోంది. పరికరాలు, యంత్రాలే కాదు ప్రాథమిక వైద్య సేవల పరిస్థితి కూడా దారుణంగా ఉంటోంది. ఏ ఆస్పత్రిలో చూసినా, ఏ విభాగంలో చూసినా ఒకరిద్దరు వైద్యులే కన్పిస్తున్నారు. ప్రభుత్వ పరిధిలోని సూపర్ స్పెషాలిటీ, ప్రాంతీయ ఆస్పత్రుల్లోనూ కీలకమైన విభాగాలకు సైతం వైద్యుల్లేని పరిస్థితి. భవనాల నిర్మాణాలు, పరికరాల కొనుగోలుపై ఉన్న శ్రద్ధ వైద్యుల సంఖ్య పెంచే విషయంలో లేకపోవడం పేద రోగుల పాలిట శాపంగా మారుతోంది. అవసరానికి తగ్గ పోస్టులేవీ? వైద్యులు, సహాయక సిబ్బంది కొరతతో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు అల్లాడుతున్నాయి. పెరిగిన అవసరాలకు తగ్గట్లు కొత్తగా పోస్టులను మంజూరు చేయాల్సిన అవసరం ఉన్నా వైద్య, ఆరోగ్య శాఖ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తోంది. కొత్త పోస్టుల సంగతి దేవుడెరుగు.. కనీసం ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీలోనూ ఆ శాఖ అధ్వానంగా వ్యవహరిస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని అన్ని విభాగాల్లో కలిపి 37,141 పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం 26,016 మందే పని చేస్తున్నారు. మొత్తం 11,125 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరో 12 వేల పోస్టులు అవసరం.. కొత్త పరికరాలు, యంత్రాలు.. పెరిగిన ఆస్పత్రుల సంఖ్య.. 24 గంటల పాటు సేవలు అందించాలంటే మరో 12,353 పోస్టులు అవసరమవుతాయని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ధారించింది. ఇప్పటికే ఖాళీగా ఉన్న 11,125 పోస్టులు, కొత్తగా అవసరమైన 12,353 పోస్టులు కలిపితే.. మొత్తం 23,478 పోస్టులను తక్షణం భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం అన్ని విభాగాల్లో కలిపి 6,180 పోస్టుల భర్తీకే అనుమతి ఇచ్చింది. అందులోనూ కొన్నింటికే నోటిఫికేషన్ జారీ అయ్యింది. మరికొన్ని ఇంకా నోటిఫికేషన్ దశకు కూడా చేరుకోలేదు. కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం కోసం 82 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. రెగ్యులర్ ప్రాతిపదికన ఇప్పటికీ ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదు. ఆహార కల్తీ నియంత్రణ విభాగంలోని 23 పోస్టులకు అనుమతిచ్చినా ఇప్పటికీ అతీగతీ లేదు. నిమ్స్ విస్తరణకు మంజూరు చేసిన 1,472 పోస్టుల పరిస్థితీ ఇలాగే ఉంది. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి కోసం మంజూరు చేసిన 251 పోస్టుల భర్తీ ముందుకు కదలట్లేదు. పెరుగుతున్న రోగులు.. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది. ఇదే వైద్య సిబ్బందికి ఇబ్బందిగా మారుతోంది. వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం 2016–17లో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు 4.6 కోట్ల మంది వైద్య సేవల కోసం వచ్చారు. ప్రజారోగ్యం విభాగం ఆస్పత్రులకు సుమారు 2.62 కోట్ల మంది, వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులకు 1.5 కోట్ల మంది, వైద్య విద్య ఆస్పత్రులకు 48 లక్షల మంది రోగులు వచ్చారు. కేసీఆర్ కిట్, డయాలసిస్ వంటి సేవలతో ఈ ఏడాది రోగుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. ప్రస్తుత రోగుల సంఖ్యకు అనుగుణంగానే వైద్యులు, సిబ్బంది లేరు. ఇక పెరిగే రోగుల పరిస్థితేంటనేది అయోయమంగా మారింది. మౌలిక వసతుల కల్పన కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది. ఆస్పత్రులకు వస్తున్నా ఆశించిన మేరకు వైద్య సేవలు అందకపోవడంతో తప్పనిసరై రోగులు పూర్తి స్థాయి వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పోస్టుల వివరాలిలా.. -
వైద్యం మెరుగయ్యేనా?
ఉత్తమ ఆసుపత్రిలో వైద్యుల కొరత పనిభారంతో డాక్టర్ల సతమతం ఏళ్ల తరబడి ఇదే తంతు స్పందించని ఉన్నతాధికారులు సరైన వైద్యం అందక రోగుల అవస్థలు మెదక్: మెదక్ ఏరియా ఆసుపత్రి వైద్య సేవల్లో ముందుంది. లక్ష్యానికి మించి డెలివరీలు చేసి రికార్డు సృష్టించింది. ప్రభుత్వం నుంచి ఉత్తమ ఆసుపత్రిగా అవార్డు కూడా అందుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నా వైద్యులు మాత్రం పనిభారంతో సతమతమవుతున్నారు. వైద్యుల పోస్టులు భారీగా ఖాళీలుండడంతో అదనపు భారాన్ని మోస్తున్నారు. ఇంకెంత కాలంగా ఈ భారం మోయాలంటూ ఆవేదన చెందుతున్నారు. ఖాళీలను భర్తీ చేస్తే మరింత మెరుగైన సేవలందించే అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. మెదక్ ఏరియా ఆస్పత్రి డివిజన్లో పెద్దది. ఈ ఆస్పత్రిలో వంద పడకలు ఉన్నాయి. మెదక్ మండలం, మెదక్ పట్టణం, పాపన్నపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట, కొల్చారం, కౌడిపల్లి, చేగుంట, టేక్మాల్, అల్లాదుర్గం, నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట, లింగంపేట తదితర 13 మండలాలకు చెందిన రోగులు వస్తుంటారు. ఇరవై ఏళ్ల క్రితమే ఇక్కడ వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. అందుకనుగుణంగానే సిబ్బందిని నియమించారు. కానీ నేడు రెండింతల జనం ఆస్పత్రికి వస్తున్నారు. సిబ్బందిని సైతం దానికనుగుణంగా పెంచాల్సింది పోయి రెండు దశాబ్దాల క్రితం నియమించిన వంద పడకల సామర్థ్యానికి సరిపోను సిబ్బందే కొనసాగుతోన్నారు. ఈ ఆస్పత్రిలో మొత్తం 22మంది వైద్యులు ఉండాలి. కేవలం 15 మంది మాత్రమే ఉన్నారు. గతంతో పోలిస్తే రోగుల తాకిడి రెట్టింపైంది. వైద్యులు, సిబ్బంది కొరతతో ఉన్నవారిపైనే భారం పడుతోంది. ఆస్పత్రిలో ఇద్దరు మత్తు వైద్యులు ఉండాల్సి ఉండగా కేవలం ఒకరు మాత్రమే ఉన్నారు. ఆయన అందుబాటులో లేకుంటే రోగులను గాంధీ ఆస్పత్రికి తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్న పిల్లలవైద్యులు ఇద్దరికి గాను ఒక్కరే ఉన్నారు. మరో నాలుగు మెడికల్ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో ఈ ఆస్పత్రిలో ఓ సివిల్ అసిస్టెంట్ సర్జన్ వైద్యులు రాజీనామా చేయగా ఆ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. ఇలా వైద్యుల పోస్టులు ఏడు ఖాళీగా ఉండటంతో ఉన్నవారిపై అదనపు భారం పడుతుందని పలువురు డాక్టర్లు పేర్కొంటున్నారు. ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వారంటున్నారు. పని ఒత్తిడిని తట్టుకోలేక ఆస్పత్రిలోని కొంతమంది వైద్యులు దీర్ఘకాలిక సెలవు పెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆస్పత్రిలో హైరిస్క్ సెంటర్ (ప్రసూతి కేంద్రం) ఏర్పాటు చేసిన నాటినుంచి మరింత భారం పడుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులతో రోజుకు 500 నుంచి 600 మంది రోగులు ఆస్పత్రికి వస్తున్నారు. ఇందులో ఎక్కువగా విష జ్వరాలు, పాము, కుక్కకాటు, మలేరియా, డయేరియా వంటి బాధితులు ఉంటున్నారు. నిత్యం 50 నుంచి 60 మంది ఇన్పేషెంట్లుగా ఉంటున్నారు. ఈ లెక్కన నెలకు 15,870 మంది ఔట్పేషెంట్లు వస్తుండగా, 1740 మంది ఇన్ పేషెంట్లుగా వైద్యం పొందుతున్నారు. రికార్డు స్థాయి డెలివరీలు రోజూ 50మందికిపైగా గర్భిణులు చికిత్స పొందుతున్నారు. సోమ, శుక్రవారాల్లో గర్భిణులకు స్కానింగ్‌తోపాటు ఇతర వైద్య పరీక్షలు చేస్తుండటంతో సుమారు 250నుంచి 350మంది వస్తున్నారు. ఇంత సిబ్బంది కొరత ఉన్నా గత ఏడాది 1,500 డెలీవరీలకు గాను 2,500 చేసిన ఆస్పత్రి వైద్యులు రికార్డు సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఆస్పత్రిగా అవార్డు కూడా అందజేసింది. కానీ ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేయడం లేదని ఉన్న సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను వెంటనే భర్తీ చేసి మరింత మెరుగైన వైద్యం అందించాలని పలువురు కోరుతున్నారు. -
ఆయు..ష్
కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్ : జిల్లాలోని ఆయుష్ వైద్యశాలల పరిస్థితి దయనీయంగా మారుతోంది. భారతీయ పురాతన వైద్యమైన ఆయుర్వేదం, దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తాయనే నమ్మకం ఉన్న హోమియో, యునాని, ప్రకృతిసిద్ధంగా చికిత్సనందించే నేచురోపతి కేంద్రాలకు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. వైద్యులు, సిబ్బంది తగినంతమంది లేకపోవడం.. మందుల కొరత వేధిస్తుండడంతో ప్రజలకు సరైన సేవలు అందడం లేదు. అన్ని రకాల వైద్యసేవలనూ ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో 2007లో ఆయుష్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా జిల్లాలో ప్రస్తుతం 44 ఆయుర్వేద, 17 యునాని, 25 హోమియో, 3 నేచురోపతి(ప్రకృతివైద్యం) కలిపి మొత్తం 89 కేంద్రాలు పనిచేస్తున్నాయి. ప్రధానంగా ఆయుర్వేద డిస్పెన్సరీల్లో 22 రెగ్యులర్, 22 ఎన్ఆర్హెచ్ఎం కింద పనిచేస్తున్నాయి. ప్రతి డిస్పెన్సరికీ ఓ మెడికల్ ఆఫీసర్, కాంపౌండ్, స్వీపర్/స్కావెంజర్ పోస్టులు మంజూరు చేశారు. ప్రస్తుతం రామదుర్గం డిస్పెన్సరీలో ఎవ్వరూ లేకపోవడంతో మూతపడింది. జలదుర్గం, బదినేహాలు, హాలహర్వి(రెగ్యులర్), కోడుమూరు, మద్దూర్, ఓర్వకల్లు, పెద్దకడబూరు, యాళ్లూరు, ఆళ్లగడ్డ, హర్దగేరి, దైవందిన్నె, గోస్పాడు, కలుదేవకుంట్ల, పగిడిరాయి, డబ్ల్యు. కొత్తపల్లి, గోకవరం, కొత్తబురుజు, పత్తికొండ(ఎన్ఆర్హెచ్ఎం)లలో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్ని చోట్ల అల్లోపతి వైద్యులకు ఆయుష్ వైద్యులు అసిస్టెంట్లుగా పనిచేయాల్సి వస్తోంది. మరికొన్ని చోట్ల ఆయుష్ విభాగం వైద్యులే సేవలందిస్తున్నారు. వేధిస్తున్న మందుల కొరత ప్రతి డిస్పెన్సరికీ ప్రభుత్వం ఏడాదికి రూ.50 వేల విలువజేసే మందులను సరఫరా చేస్తోంది. ఈ మందులు కొన్నిచోట్ల మిగిలిపోగా, కర్నూలు, నం ద్యాల, ఆదోని తదితర ప్రాంతాల్లో చాలడం లేదు. పంపిణీ చేసిన చోట కూడా సరిపోయినన్ని ఇవ్వ డం లేదు. దగ్గు, జ్వరం, జలుబు, ఒంటి నొప్పు లు, గ్యాస్టైటీస్, హేమారైడ్స్, పైల్స్, కిడ్నీలో రాళ్లు, చర్మ వ్యాధులు, నుసిపురుగులు తదితర 30 రకాల జబ్బులకుగాను 20 రకాల జబ్బులకు సం బంధించిన మందులే సరఫరా అవుతున్నాయి. ఆయుష్ ఆసుపత్రుల్లో ఇదీ పరిస్థితి ఆదోనిలో ముగ్గురు వైద్యులకు గాను సోమవారం ఇద్దరు గైర్హాజరయ్యారు. జూనియర్ మెడికల్ ఆఫీసర్ షబానా డ్యూటీకి హాజరై సేవలందించారు. ఆదోని యునాని ఆస్పత్రిలో మందుల కొరత వేధిస్తోంది. పది పడకల ఆస్పత్రి అయినప్పటకీ రెండు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. మిగిలిన 8 మంచాలు స్టోర్ రూంలో తుప్పుపట్టి పోతున్నాయి. ఆళ్లగడ్డ పట్టణంలోని ఆయుర్వేద వైద్యశాలలో డాక్టర్ పో స్టు ఖాళీగా ఉంది. కాంపౌడర్, స్వీఫర్ ఉన్నారు. అహోబిలంలో ఉన్న ఆయుర్వేద ఆసుపత్రిలో వైద్యుడు లేరు. మందులు నిలువ ఉంచడానికి గదికూడా లేదు. రుద్రవరం మండలంలోని ఆలమూరు వైద్యురాలు సెలవుపై వెళ్లడంతో ముత్యాలపాడు డాక్టర్‌ను ఇన్చార్జ్గా నియమించారు. వారంలో ఒక్క రోజు మాత్రమే చుట్టపుచూపుగా వచ్చి పోతుంటారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ముత్యాలపాడులో డాక్టర్, మందులు ఉన్నా ఆసుపత్రిని గదుల కొరత వేధిస్తోంది. హాలహర్వి మండల పీహెచ్ కేంద్రంలో పనిచేస్తున్న వైద్యుడు రామకృష్ణారావు విరమణ పొంది మూడేళ్లు పూరైయింది. అప్పుడు వేసిన తాళం ఇప్పటి వరకు తెరవలేదు. అర్ధగేరి గ్రామంలో ఉన్న కేంద్రంలో కాంట్రాక్టు కింద పనిచేస్తున్న అటెండర్ గణేష్, జూనియర్ అసిస్టెంట్ రాజేశ్వరి వచ్చిన రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. దేవనకొండలో డాక్టర్ రమణారెడ్డి వైద్యసేవలు అందిస్తున్నారు. అయితే సరైన ప్రచారం లేకపోవడంతో ప్రజలు ఎవ్వరూ వెళ్లడం లేదు. ఆస్పరిలో యునాని ఆసుపత్రికి వేసిన తాళాలు ఎప్పుడూ తీయడం లేదు. కొంతకాలం వేచి చూసిన ప్రజలు చివరికి అటువైపు వెళ్లడమే మానేశారు. ఆత్మకూరు, వెలుగోడు, బండి ఆత్మకూరు ఆయుర్వేద వైద్యశాలల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది. బనగానపల్లెలోని 10 పడకల ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి కూలేందుకు సిద్ధంగా ఉంది. గోస్పాడు పీహెచ్సీలో ఏర్పాటు చేసిన ఆయుర్వేద డిస్పెన్సరీలో రెండేళ్లుగా వైద్యాధికారి పోస్టు ఖాళీగా ఉంది. కోడుమూరు ఆరోగ్య కేంద్రంలో ఆయుర్వేద ఆసుపత్రిని చిన్న గదిలో ఏర్పాటు చేశారు. ఏడాది కాలంగా వైద్యుడు లేక పోవడంతో కాంపౌండరే రోగులకు మందులను పంపిణీ చేస్తున్నాడు. సి.బెళగల్ మండలంలోని సి.బెళగల్, పొలకల్లు గ్రామాల్లో ఆయుర్వేద ఆసుపత్రులున్నాయి. .బెళగల్, పోలకల్ వైద్యాధికారులు వారంలో రెండు, మూడు రోజులు మాత్రమే విధులకు హాజరవుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. మందులు లేక పోవడం వల్ల రోగుల సంఖ్య తగ్గి పోయింది. మద్దికెర ప్రభుత్వ వైద్యశాలలోనే యునాని ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రిలో 90 రకాల మందులు అందజేయాల్సి ఉంది. అయితే రెండు రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తుగ్గలి మండలంలోని పగిడిరాయి కేంద్రంలో వైద్యులు లేనందుకు కేంద్రం మూతపడింది. ఉన్న అటెండర్ ఎప్పుడు వస్తాడో ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. పత్తికొండ పట్టణంలో ఆయుర్వేద కేంద్రం ఏర్పాటు చేసినా వైద్యున్ని నియమించడం మరిచారు. ఇక్కడ కాంపౌండర్‌గా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణమ్మనే వైద్యురాలిగా సేవలు అందిస్తున్నారు. ఓర్వకల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యురాలు డాక్టర్ సుభద్రమ్మ ఏడాదిన్నర క్రితం సంజామల పీహెచ్‌సీకి బదిలీపై వెళ్లారు. అప్పటి నుంచి ఆ పోస్టును భర్తీ చేయలేదు. దీంతో కాంపౌండరే వైద్యురాలిగా సేవలు అందించాల్సి వస్తోంది.