ఆయు..ష్ | doctors shortage in Ayurveda, Unani, Homeopathic divisions | Sakshi
Sakshi News home page

ఆయు..ష్

Published Tue, Jan 21 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM

doctors shortage in Ayurveda, Unani, Homeopathic divisions

కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్ : జిల్లాలోని ఆయుష్ వైద్యశాలల పరిస్థితి దయనీయంగా మారుతోంది. భారతీయ పురాతన వైద్యమైన ఆయుర్వేదం, దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తాయనే నమ్మకం ఉన్న హోమియో, యునాని, ప్రకృతిసిద్ధంగా చికిత్సనందించే నేచురోపతి కేంద్రాలకు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. వైద్యులు, సిబ్బంది తగినంతమంది లేకపోవడం.. మందుల కొరత వేధిస్తుండడంతో ప్రజలకు సరైన సేవలు అందడం లేదు.

అన్ని రకాల వైద్యసేవలనూ ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో 2007లో ఆయుష్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా  జిల్లాలో ప్రస్తుతం 44 ఆయుర్వేద, 17 యునాని, 25 హోమియో, 3 నేచురోపతి(ప్రకృతివైద్యం) కలిపి మొత్తం 89 కేంద్రాలు పనిచేస్తున్నాయి. ప్రధానంగా ఆయుర్వేద డిస్పెన్సరీల్లో 22 రెగ్యులర్, 22 ఎన్‌ఆర్‌హెచ్‌ఎం కింద పనిచేస్తున్నాయి. ప్రతి డిస్పెన్సరికీ ఓ మెడికల్ ఆఫీసర్, కాంపౌండ్, స్వీపర్/స్కావెంజర్ పోస్టులు మంజూరు చేశారు.

 ప్రస్తుతం రామదుర్గం డిస్పెన్సరీలో ఎవ్వరూ లేకపోవడంతో మూతపడింది. జలదుర్గం, బదినేహాలు, హాలహర్వి(రెగ్యులర్), కోడుమూరు, మద్దూర్, ఓర్వకల్లు, పెద్దకడబూరు, యాళ్లూరు, ఆళ్లగడ్డ, హర్దగేరి, దైవందిన్నె, గోస్పాడు, కలుదేవకుంట్ల, పగిడిరాయి, డబ్ల్యు. కొత్తపల్లి, గోకవరం, కొత్తబురుజు, పత్తికొండ(ఎన్‌ఆర్‌హెచ్‌ఎం)లలో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.   కొన్ని చోట్ల అల్లోపతి వైద్యులకు ఆయుష్ వైద్యులు అసిస్టెంట్లుగా పనిచేయాల్సి వస్తోంది. మరికొన్ని చోట్ల  ఆయుష్ విభాగం వైద్యులే సేవలందిస్తున్నారు.

 వేధిస్తున్న మందుల కొరత
 ప్రతి డిస్పెన్సరికీ ప్రభుత్వం ఏడాదికి రూ.50 వేల విలువజేసే మందులను సరఫరా చేస్తోంది. ఈ మందులు కొన్నిచోట్ల మిగిలిపోగా, కర్నూలు, నం ద్యాల, ఆదోని తదితర ప్రాంతాల్లో చాలడం లేదు. పంపిణీ చేసిన చోట కూడా సరిపోయినన్ని ఇవ్వ డం లేదు. దగ్గు, జ్వరం, జలుబు, ఒంటి నొప్పు లు, గ్యాస్‌టైటీస్, హేమారైడ్స్, పైల్స్, కిడ్నీలో రాళ్లు, చర్మ వ్యాధులు, నుసిపురుగులు తదితర 30 రకాల జబ్బులకుగాను 20 రకాల జబ్బులకు సం బంధించిన మందులే సరఫరా అవుతున్నాయి.

 ఆయుష్ ఆసుపత్రుల్లో ఇదీ పరిస్థితి

 ఆదోనిలో ముగ్గురు వైద్యులకు గాను సోమవారం ఇద్దరు గైర్హాజరయ్యారు. జూనియర్ మెడికల్ ఆఫీసర్ షబానా డ్యూటీకి హాజరై సేవలందించారు.

ఆదోని యునాని ఆస్పత్రిలో మందుల కొరత వేధిస్తోంది. పది పడకల ఆస్పత్రి అయినప్పటకీ రెండు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. మిగిలిన 8 మంచాలు స్టోర్ రూంలో తుప్పుపట్టి పోతున్నాయి.

 ఆళ్లగడ్డ పట్టణంలోని ఆయుర్వేద వైద్యశాలలో డాక్టర్ పో స్టు ఖాళీగా ఉంది. కాంపౌడర్, స్వీఫర్ ఉన్నారు.

 అహోబిలంలో ఉన్న ఆయుర్వేద ఆసుపత్రిలో వైద్యుడు లేరు. మందులు నిలువ ఉంచడానికి గదికూడా లేదు.

రుద్రవరం మండలంలోని ఆలమూరు వైద్యురాలు సెలవుపై వెళ్లడంతో ముత్యాలపాడు డాక్టర్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించారు. వారంలో ఒక్క రోజు మాత్రమే చుట్టపుచూపుగా వచ్చి పోతుంటారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

 ముత్యాలపాడులో డాక్టర్, మందులు ఉన్నా ఆసుపత్రిని గదుల కొరత వేధిస్తోంది. హాలహర్వి మండల పీహెచ్ కేంద్రంలో పనిచేస్తున్న వైద్యుడు రామకృష్ణారావు విరమణ పొంది మూడేళ్లు పూరైయింది. అప్పుడు వేసిన తాళం ఇప్పటి వరకు తెరవలేదు.

 అర్ధగేరి గ్రామంలో ఉన్న కేంద్రంలో కాంట్రాక్టు కింద పనిచేస్తున్న అటెండర్ గణేష్, జూనియర్ అసిస్టెంట్ రాజేశ్వరి వచ్చిన రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు.

 దేవనకొండలో డాక్టర్ రమణారెడ్డి వైద్యసేవలు అందిస్తున్నారు. అయితే సరైన ప్రచారం లేకపోవడంతో ప్రజలు ఎవ్వరూ వెళ్లడం లేదు.

 ఆస్పరిలో యునాని ఆసుపత్రికి వేసిన తాళాలు ఎప్పుడూ తీయడం లేదు. కొంతకాలం వేచి చూసిన ప్రజలు చివరికి అటువైపు వెళ్లడమే మానేశారు.
 ఆత్మకూరు, వెలుగోడు, బండి ఆత్మకూరు ఆయుర్వేద వైద్యశాలల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది.
 బనగానపల్లెలోని 10 పడకల ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి కూలేందుకు సిద్ధంగా ఉంది.  గోస్పాడు పీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన ఆయుర్వేద డిస్పెన్సరీలో  రెండేళ్లుగా వైద్యాధికారి పోస్టు ఖాళీగా ఉంది.

     కోడుమూరు ఆరోగ్య కేంద్రంలో ఆయుర్వేద ఆసుపత్రిని చిన్న గదిలో ఏర్పాటు చేశారు. ఏడాది కాలంగా వైద్యుడు లేక పోవడంతో కాంపౌండరే రోగులకు మందులను పంపిణీ చేస్తున్నాడు.

 సి.బెళగల్ మండలంలోని సి.బెళగల్, పొలకల్లు గ్రామాల్లో ఆయుర్వేద ఆసుపత్రులున్నాయి. .బెళగల్, పోలకల్ వైద్యాధికారులు వారంలో రెండు, మూడు రోజులు మాత్రమే విధులకు హాజరవుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. మందులు లేక పోవడం వల్ల రోగుల సంఖ్య తగ్గి పోయింది.

     మద్దికెర ప్రభుత్వ వైద్యశాలలోనే యునాని ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రిలో 90 రకాల మందులు అందజేయాల్సి ఉంది. అయితే రెండు రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
     తుగ్గలి మండలంలోని పగిడిరాయి కేంద్రంలో వైద్యులు లేనందుకు కేంద్రం మూతపడింది. ఉన్న అటెండర్ ఎప్పుడు వస్తాడో ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు.

     పత్తికొండ పట్టణంలో ఆయుర్వేద కేంద్రం ఏర్పాటు చేసినా వైద్యున్ని నియమించడం మరిచారు. ఇక్కడ కాంపౌండర్‌గా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణమ్మనే వైద్యురాలిగా సేవలు అందిస్తున్నారు.
     ఓర్వకల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యురాలు డాక్టర్ సుభద్రమ్మ ఏడాదిన్నర క్రితం సంజామల పీహెచ్‌సీకి బదిలీపై వెళ్లారు. అప్పటి నుంచి ఆ పోస్టును భర్తీ చేయలేదు. దీంతో కాంపౌండరే వైద్యురాలిగా సేవలు అందించాల్సి వస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement