
న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో ఆయుర్వేద ఔషధాల విక్రయాలను నిర్వహించే కంపెనీలకు సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది.
కొన్ని ఎంపిక చేసిన ఆయుర్వేద, సిద్ధ, యునానీ ఔషధాలను, చెల్లుబాటు అయ్యే వైద్యుడి ప్రిస్క్రిప్షన్ అప్‌లోడ్ చేసిన తర్వాతే, నిర్ధారించుకుని విక్రయించాలని పేర్కొంది. డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ నిబంధనలు 1945 చట్టంలోని షెడ్యూల్ ఈ (1)లో పేర్కొన్న ఔషధాలకు ఈ నిబంధనలు అమలవుతాయని తెలిపింది.
ఆయుర్వేద, సిద్ధ, యునానీకి సంబంధించి విషపూరితమైన పదార్థాలతో తయారు చేసిన ఔషధాల జాబితా షెడ్యూల్ ఈ(1)లో ఉంది. ఈ ఔషధాలను వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలని చట్టం చెబుతోంది.