మెదక్ ఏరియా ఆస్పత్రి
- ఉత్తమ ఆసుపత్రిలో వైద్యుల కొరత
- పనిభారంతో డాక్టర్ల సతమతం
- ఏళ్ల తరబడి ఇదే తంతు
- స్పందించని ఉన్నతాధికారులు
- సరైన వైద్యం అందక రోగుల అవస్థలు
మెదక్: మెదక్ ఏరియా ఆసుపత్రి వైద్య సేవల్లో ముందుంది. లక్ష్యానికి మించి డెలివరీలు చేసి రికార్డు సృష్టించింది. ప్రభుత్వం నుంచి ఉత్తమ ఆసుపత్రిగా అవార్డు కూడా అందుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నా వైద్యులు మాత్రం పనిభారంతో సతమతమవుతున్నారు. వైద్యుల పోస్టులు భారీగా ఖాళీలుండడంతో అదనపు భారాన్ని మోస్తున్నారు. ఇంకెంత కాలంగా ఈ భారం మోయాలంటూ ఆవేదన చెందుతున్నారు. ఖాళీలను భర్తీ చేస్తే మరింత మెరుగైన సేవలందించే అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు.
మెదక్ ఏరియా ఆస్పత్రి డివిజన్‌లో పెద్దది. ఈ ఆస్పత్రిలో వంద పడకలు ఉన్నాయి. మెదక్ మండలం, మెదక్ పట్టణం, పాపన్నపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట, కొల్చారం, కౌడిపల్లి, చేగుంట, టేక్మాల్, అల్లాదుర్గం, నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట, లింగంపేట తదితర 13 మండలాలకు చెందిన రోగులు వస్తుంటారు. ఇరవై ఏళ్ల క్రితమే ఇక్కడ వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. అందుకనుగుణంగానే సిబ్బందిని నియమించారు.
కానీ నేడు రెండింతల జనం ఆస్పత్రికి వస్తున్నారు. సిబ్బందిని సైతం దానికనుగుణంగా పెంచాల్సింది పోయి రెండు దశాబ్దాల క్రితం నియమించిన వంద పడకల సామర్థ్యానికి సరిపోను సిబ్బందే కొనసాగుతోన్నారు. ఈ ఆస్పత్రిలో మొత్తం 22మంది వైద్యులు ఉండాలి. కేవలం 15 మంది మాత్రమే ఉన్నారు. గతంతో పోలిస్తే రోగుల తాకిడి రెట్టింపైంది. వైద్యులు, సిబ్బంది కొరతతో ఉన్నవారిపైనే భారం పడుతోంది. ఆస్పత్రిలో ఇద్దరు మత్తు వైద్యులు ఉండాల్సి ఉండగా కేవలం ఒకరు మాత్రమే ఉన్నారు.
ఆయన అందుబాటులో లేకుంటే రోగులను గాంధీ ఆస్పత్రికి తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్న పిల్లలవైద్యులు ఇద్దరికి గాను ఒక్కరే ఉన్నారు. మరో నాలుగు మెడికల్ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో ఈ ఆస్పత్రిలో ఓ సివిల్ అసిస్టెంట్ సర్జన్ వైద్యులు రాజీనామా చేయగా ఆ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. ఇలా వైద్యుల పోస్టులు ఏడు ఖాళీగా ఉండటంతో ఉన్నవారిపై అదనపు భారం పడుతుందని పలువురు డాక్టర్లు పేర్కొంటున్నారు.
ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వారంటున్నారు. పని ఒత్తిడిని తట్టుకోలేక ఆస్పత్రిలోని కొంతమంది వైద్యులు దీర్ఘకాలిక సెలవు పెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఆస్పత్రిలో హైరిస్క్ సెంటర్ (ప్రసూతి కేంద్రం) ఏర్పాటు చేసిన నాటినుంచి మరింత భారం పడుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులతో రోజుకు 500 నుంచి 600 మంది రోగులు ఆస్పత్రికి వస్తున్నారు. ఇందులో ఎక్కువగా విష జ్వరాలు, పాము, కుక్కకాటు, మలేరియా, డయేరియా వంటి బాధితులు ఉంటున్నారు. నిత్యం 50 నుంచి 60 మంది ఇన్‌పేషెంట్లుగా ఉంటున్నారు. ఈ లెక్కన నెలకు 15,870 మంది ఔట్‌పేషెంట్లు వస్తుండగా, 1740 మంది ఇన్ పేషెంట్లుగా వైద్యం పొందుతున్నారు.
రికార్డు స్థాయి డెలివరీలు
రోజూ 50మందికిపైగా గర్భిణులు చికిత్స పొందుతున్నారు. సోమ, శుక్రవారాల్లో గర్భిణులకు స్కానింగ్‌తోపాటు ఇతర వైద్య పరీక్షలు చేస్తుండటంతో సుమారు 250నుంచి 350మంది వస్తున్నారు. ఇంత సిబ్బంది కొరత ఉన్నా గత ఏడాది 1,500 డెలీవరీలకు గాను 2,500 చేసిన ఆస్పత్రి వైద్యులు రికార్డు సృష్టించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఆస్పత్రిగా అవార్డు కూడా అందజేసింది. కానీ ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేయడం లేదని ఉన్న సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను వెంటనే భర్తీ చేసి మరింత మెరుగైన వైద్యం అందించాలని పలువురు కోరుతున్నారు.