Medak area hospital
-
చేరువలో వైద్యం
మెదక్‌జోన్: పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో పేద ప్రజలకు వైద్యం మరింత చేరువ కానుంది. ఏరియా ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)ను భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి శనివారం ప్రారంభించనున్నారు. దీంతో అత్యవసర చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. పాము కాటు, విషం సేవించిన బాధితులు, రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారిని ప్రాణా పా యం నుంచి రక్షించేందుకు ఈ యూనిట్ ఉపయోగపడుతుంది. గతంలో బాధితులను హైదరాబాద్‌కు రెఫర్ చేసేవారు. అందులో చాలా మంది హైదరాబాద్‌కు చేరుకునేలోపే మరణిం చేవారు. ఇక నుంచి అలాంటి పరిస్థితి ఉండదు. ఈ యూనిట్లో ఐదుగురు వైద్యులతో పాటు, ఐదుగురు ప్రత్యేక నిపుణులు, ఎక్స్‌రే, ల్యాబ్ టెక్నిషియన్స్, స్టాఫ్ నర్స్‌లు, నర్స్‌లు, అనస్తీషియా వైద్యులు ఉంటారు. ప్రత్యేక నిపుణులు ఇద్దరే వచ్చారు. మరో ముగ్గురు రావాల్సి ఉంది. -
వైద్యం మెరుగయ్యేనా?
ఉత్తమ ఆసుపత్రిలో వైద్యుల కొరత పనిభారంతో డాక్టర్ల సతమతం ఏళ్ల తరబడి ఇదే తంతు స్పందించని ఉన్నతాధికారులు సరైన వైద్యం అందక రోగుల అవస్థలు మెదక్: మెదక్ ఏరియా ఆసుపత్రి వైద్య సేవల్లో ముందుంది. లక్ష్యానికి మించి డెలివరీలు చేసి రికార్డు సృష్టించింది. ప్రభుత్వం నుంచి ఉత్తమ ఆసుపత్రిగా అవార్డు కూడా అందుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నా వైద్యులు మాత్రం పనిభారంతో సతమతమవుతున్నారు. వైద్యుల పోస్టులు భారీగా ఖాళీలుండడంతో అదనపు భారాన్ని మోస్తున్నారు. ఇంకెంత కాలంగా ఈ భారం మోయాలంటూ ఆవేదన చెందుతున్నారు. ఖాళీలను భర్తీ చేస్తే మరింత మెరుగైన సేవలందించే అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. మెదక్ ఏరియా ఆస్పత్రి డివిజన్లో పెద్దది. ఈ ఆస్పత్రిలో వంద పడకలు ఉన్నాయి. మెదక్ మండలం, మెదక్ పట్టణం, పాపన్నపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట, కొల్చారం, కౌడిపల్లి, చేగుంట, టేక్మాల్, అల్లాదుర్గం, నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట, లింగంపేట తదితర 13 మండలాలకు చెందిన రోగులు వస్తుంటారు. ఇరవై ఏళ్ల క్రితమే ఇక్కడ వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. అందుకనుగుణంగానే సిబ్బందిని నియమించారు. కానీ నేడు రెండింతల జనం ఆస్పత్రికి వస్తున్నారు. సిబ్బందిని సైతం దానికనుగుణంగా పెంచాల్సింది పోయి రెండు దశాబ్దాల క్రితం నియమించిన వంద పడకల సామర్థ్యానికి సరిపోను సిబ్బందే కొనసాగుతోన్నారు. ఈ ఆస్పత్రిలో మొత్తం 22మంది వైద్యులు ఉండాలి. కేవలం 15 మంది మాత్రమే ఉన్నారు. గతంతో పోలిస్తే రోగుల తాకిడి రెట్టింపైంది. వైద్యులు, సిబ్బంది కొరతతో ఉన్నవారిపైనే భారం పడుతోంది. ఆస్పత్రిలో ఇద్దరు మత్తు వైద్యులు ఉండాల్సి ఉండగా కేవలం ఒకరు మాత్రమే ఉన్నారు. ఆయన అందుబాటులో లేకుంటే రోగులను గాంధీ ఆస్పత్రికి తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్న పిల్లలవైద్యులు ఇద్దరికి గాను ఒక్కరే ఉన్నారు. మరో నాలుగు మెడికల్ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో ఈ ఆస్పత్రిలో ఓ సివిల్ అసిస్టెంట్ సర్జన్ వైద్యులు రాజీనామా చేయగా ఆ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. ఇలా వైద్యుల పోస్టులు ఏడు ఖాళీగా ఉండటంతో ఉన్నవారిపై అదనపు భారం పడుతుందని పలువురు డాక్టర్లు పేర్కొంటున్నారు. ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వారంటున్నారు. పని ఒత్తిడిని తట్టుకోలేక ఆస్పత్రిలోని కొంతమంది వైద్యులు దీర్ఘకాలిక సెలవు పెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆస్పత్రిలో హైరిస్క్ సెంటర్ (ప్రసూతి కేంద్రం) ఏర్పాటు చేసిన నాటినుంచి మరింత భారం పడుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులతో రోజుకు 500 నుంచి 600 మంది రోగులు ఆస్పత్రికి వస్తున్నారు. ఇందులో ఎక్కువగా విష జ్వరాలు, పాము, కుక్కకాటు, మలేరియా, డయేరియా వంటి బాధితులు ఉంటున్నారు. నిత్యం 50 నుంచి 60 మంది ఇన్పేషెంట్లుగా ఉంటున్నారు. ఈ లెక్కన నెలకు 15,870 మంది ఔట్పేషెంట్లు వస్తుండగా, 1740 మంది ఇన్ పేషెంట్లుగా వైద్యం పొందుతున్నారు. రికార్డు స్థాయి డెలివరీలు రోజూ 50మందికిపైగా గర్భిణులు చికిత్స పొందుతున్నారు. సోమ, శుక్రవారాల్లో గర్భిణులకు స్కానింగ్‌తోపాటు ఇతర వైద్య పరీక్షలు చేస్తుండటంతో సుమారు 250నుంచి 350మంది వస్తున్నారు. ఇంత సిబ్బంది కొరత ఉన్నా గత ఏడాది 1,500 డెలీవరీలకు గాను 2,500 చేసిన ఆస్పత్రి వైద్యులు రికార్డు సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఆస్పత్రిగా అవార్డు కూడా అందజేసింది. కానీ ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేయడం లేదని ఉన్న సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను వెంటనే భర్తీ చేసి మరింత మెరుగైన వైద్యం అందించాలని పలువురు కోరుతున్నారు. -
ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు
పాపన్నపేట(మెదక్): ఆటోబోల్తా పడి ఇద్దరికి గాయాలైన సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం యూసుఫ్‌పేట గ్రామ శివారులో ఆదివారం రాత్రి జరిగింది. పాపన్నపేట నుంచి మెదక్‌వైపు వెళ్తున్న ప్యాసింజర్ యూసుఫ్‌పేట వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న రాములు, సుశీల అనే ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని వెంటనే 108లో మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
గరీబోళ్లంతా గాంధీకే!
మెదక్ ఏరియా ఆస్పత్రి.. 100 పడకల దవాఖాన.. మెదక్, రామాయంపేట, చిన్నశంకరంపేట, పాపన్నపేట, కొల్చారం, టేక్మాల్, కౌడిపల్లి, చేగుంట మండలాలతో పాటు పొరుగున ఉన్న నిజామాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాల వారికి ఏ చిన్న జ్వరమొచ్చినా ఈ ఆస్పత్రికే వస్తారు. రోజుకు ఇక్కడ ఓపీ 400 వరకు ఉంటుంది. అయితే ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య మాత్రం 20 దాటదు. ఎందుకంటే ఇక్కడి వైద్యులు రోగులతో బంతాట ఆడుకుంటున్నారు. చేయి కూడా పట్టుకోకుండానే పైసలుంటే.. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లమని, గరీబోళ్లయితే గాంధీకి పోవాలని ఉచిత సలహాలిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. కాదుకూడదంటే మాత్రం సెలైన్ పెట్టి సరిపెడుతున్నారు. దీంతో ఎంతో ఆశతో ఇక్కడికొస్తున్న పేదరోగులంతా పడరానిపాట్లు పడుతున్నారు. మెదక్ ఏరియా ఆస్పత్రి వైద్యుల ఇష్టారాజ్యం ⇒ డిప్యూటీ స్పీకర్ ఆదేశించినా కానరాని ఫలితం ⇒ సిబ్బంది లేరంటూ చేతులెత్తేస్తున్న వైనం ⇒ చిన్నపాటి వైద్యానికీ గాంధీకి రెఫర్ మెదక్ టౌన్: ప్రభుత్వాలు మారినా.. ప్రజాప్రతినిధులు మారినా.. మెదక్ ఏరియా ఆస్పత్రి వైద్యుల తీరు మారడం లేదు. దీంతో వైద్యులనే దేవుళ్లుగా భావించి ఇక్కడికొస్తున్న పేద రోగులు పడరానిపాట్లు పడుతున్నారు. అత్యవసర సమయంలోనూ వైద్యం అందకపోవడంతో ప్రైవేటు క్లినిక్‌లకు పరుగులు తీస్తున్నారు. పేద ప్రజల సౌకర్యార్థం మెదక్ పట్టణంలో 1999లో అప్పటి ప్రభుత్వం వంద పడకల ఆస్పత్రిని నిర్మించింది. క్షేత్రస్థాయిలో ప్రజలకు వైద్యాన్ని అందించాలని ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో వైద్యులు ప్రవర్తిస్తున్న తీరు పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడి వైద్యులంతా ప్రైవేటుగా ప్రాక్టీస్ చేస్తూ..ఆస్పత్రికి వచ్చే రోగులను అక్కడికే రావాలని సూచిస్తున్నారు. పైసల్లేని గరీబోళ్లయితే గాంధీ ఆస్పత్రికి వెళ్లమంటూ సలహాలు ఇస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే మాత్రం సిబ్బంది కొరత ఉంటే ఇంత పని ఎట్టా చేసేదంటూ అంతెత్తున లేస్తున్నారు. ఎన్నాళ్లీ సిబ్బంది కొరత మెదక్ ఏరియా ఆస్పత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీనికి సంబంధించి సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులకు, జిల్లా వైద్యాధికారులకు ఇప్పటికే ఎన్నోసార్లు విన్నవించినా...ప్రతిపాదనలు పంపినా సమస్య మాత్రం తీరడం లేదు. తెలంగాణ సర్కారైనా సిబ్బంది కొరత తీరుస్తుందని ఆశపడ్డ జనం ఆశలు అడియాశలే అయ్యాయి. రోజుకురోజుకూ ఇక్కడికొచ్చే రోగుల సంఖ్య పెరుగుతున్నా, 1999లో అప్పటి జనా భా ప్రకారం నిర్ణయించిన 12 మంది వైద్యులే ప్రభుత్వం నియమిస్తోంది. దీంతో రోగులకు వైద్యసేవలంద డం లేదు. ఉన్నవారిలోనూ కొద్దిమంది వైద్యులు పైసలకోసం పేద రోగులను ప్రైవేటు ఆస్పత్రులకు పంపుతున్నారు. ప్రత్యామ్నాయం ఏది? ఇటీవల పట్టణంలోని నవాబుపేట వీధికి చెందిన లక్ష్మి అనే మహిళ తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తన మూడేళ్ల చిన్నారిని ఆస్పత్రికి తీసుకొస్తే పిల్లల డాక్టర్ అందుబాటులో లేరు. దీంతో ఆ తల్లి జ్వరంతో అల్లాడిపోతున్న బిడ్డను చూస్తూ సుమారు 2 గంటలపాటు ప్రత్యక్ష నరకం అనుభవించింది. ఇక్కడి వైద్యులు అసలు పట్టించుకోరని, జ్వరమని వస్తే చేయికూడా పట్టుకోకుండానే గాంధీకి వెళ్లాలని చెప్తారని రోగులు ఆరోపిస్తున్నారు. అందువల్లే ఇటీవల డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి స్వయంగా ఆస్పత్రిని పరిశీలించారు. రోగులను పరామర్శించడంతో పాటు వైద్యులకు పలు సూచనలు చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నందున 24 గంటల పాటూ వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కానీ ఆమె ఆదేశాలనూ స్థానిక వైద్యులు బేఖాతర్ చేస్తున్నారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో నిరుపేదలు అప్పులు చేసి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి నిలువునా మోసపోతున్నారు. ‘‘డిప్యూటీ స్పీకర్ ఆదేశించినా పట్టించుకోని వైద్యులు.. మా అసొంటి పేదోళ్ల మాటను పట్టించు కుంటారా?’ అని పేదజనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్‌కు సిఫార్సు సర్కార్ దవాఖానలో వైద్యం మాట దేవుడెరుగు. గంపెడాశతో వైద్యం కోసం వస్తున్న రోగులకు వైద్యులు, సిబ్బంది కొరత తీవ్ర ఇబ్బందులకు గురిచే స్తోంది. కొరత అనే ఏకైక సాకుతో రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు సిఫార్సు చేస్తున్నట్లు విమర్శలున్నాయి. సర్కార్ దవాఖానలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు దర్జాగా ప్రైవేట్ ఆస్పత్రులు నడిపిస్తున్నారు. టెస్టుల పేరుతో పేదల ప్రజల నుంచి వేలాది రూపాయలు దండుకుంటున్నారు. అడపా దడపా జిల్లా అధికారులు తనిఖీ చేసినా..ప్రయోజనం మాత్రం కనిపించడం లేదు. కనీస సౌకర్యాలు కరువు పేరుకు 100 పడకల ఆస్పత్రైనా ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా రోగులకు అందడం లేదు. ఫ్యాన్లున్నా అవి తిరగకపోవడంతో రోగులకు దోమలతో జాగారం చేయాల్సిన దుస్థితి నెలకొంది. కనీసం తాగేందుకు పరిశుభ్రమైన నీరు కూడా దొరకక రోగులంతా సమీపంలోని దుకాణాల్లో వాటర్ ప్యాకెట్లు కొనుక్కుని తాగుతున్నారు. ఇక మంచాలైతే మరీ అధ్వాన్నంగా ఉన్నాయి. పరుపులు చనిగిపోయి పడుకునేందుకు వీలులేని పరిస్థితిలో ఉన్నాయి. ఇంకొన్ని మంచాలకైతే పరుపులే లేకపోవడంతో రోగులు తమవెంట తెచ్చుకున్ని దుప్పట్లు పరుచుకుని వైద్యం పొందుతున్నారు. ఇక రోగులవెంట వచ్చే కుటుంబీకుల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. వారు ఉండేందుకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో వారంతా చలికి వణుకుతూ ఆస్పత్రి ఆవరణలో పడుకుంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించాలి మెదక్ ఏరియా ఆస్పత్రిలో వైద్యుల తీరు మారాలంటే...ప్రస్తుతం కొనసాగుతున్న వైద్యులను సిబ్బందిని ఇతర చోట్లకు బదిలీచేసి...కొత్త వారిని నియమించాలని పట్టణ ప్రజలు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ విషయంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్, జిల్లా వైద్యాధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పజలు కోరుతున్నారు. -
పనిచేయకపోతే..పంపించేస్తాం
మెదక్ మున్సిపాలిటీ/ సిద్దిపేట జోన్: ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్న రోగులకు సమగ్ర వైద్య సేవల్ని అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచాలకులు సాంబశివరావు పేర్కొన్నారు. సిద్దిపేట, మెదక్ ఏరియా ఆస్పత్రుల్లో మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఆయన పలు విభాగాలను సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సాంబశివరావు తీవ్రంగా హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైద్యులు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండి నిస్వార్థంగా సేవలందించాలన్నారు. పీహెచ్‌సీల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కచ్చితంగా విధుల్లో ఉండాలన్నారు. విధులకు గైర్హాజర్ కావడం, రోగుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేయడం వంటి ఫిర్యాదులు వస్తే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఏరియా ఆస్పత్రుల్లో నిర్వహించే అత్యవసర సేవలకు సంబంధించి తప్పనిసరిగా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్న 325 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం 107 జీఓను విడుదల చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగానే మెదక్ జిల్లాలోని 21 పోస్టులకు గానూ 160 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిని పరిశీలించి త్వరలోనే అన్ని పోస్టులను భర్తీ చేస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ ఆదేశాల మేరకు మెదక్ ఏరియా ఆస్పత్రిలో త్వరలోనే బ్లడ్‌బ్యాంకును ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం సిద్దిపేట ఏరియా ఆస్పత్రిలో పలు విభాగాల ను సాంబశివరావు సందర్శించారు. బ్లడ్ బ్యా ంక్ పని తీరు, ఓపీ, ల్యాబ్, స్టోర్‌రూం, వీ ఆర్టీ కేంద్రాలను పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కుక్క కాటుకు మం దులు సెంట్రల్ మెడిసిన్ స్టోర్‌లో పుష్కలంగా ఉన్నాయని ప్రతిపాదనలు పంపి సిద్దిపేటకు తెప్పించుకోవాలని స్టోర్ ఇన్చార్జిని ఆదేశిం చారు. అనంతరం ఆయా వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. నవజాత శిశు సంరక్షణ కేంద్రం.. సిద్దిపేటలో నవజాత శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభించడానికి చర్యలు చేపడతామన్నారు. బ్లడ్ బ్యాంక్‌ల పనితీరును మెరుగుపర్చడం, 104 వాహనంలో అవసరమైతే తాత్కాలిక వైద్యుల నియామకానికి కృషి చేస్తామన్నారు. కు.ని. శిబిరాలకు కనీస మౌలిక వసతుల కల్పిస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మూత్ర, రక్త, ఈజీసీ, అల్ట్రా, ల్యాబ్ లాంటి పరీక్షలను బయటకు రాస్తే ఊరుకోబోమన్నారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి బాలాజి పవర్, క్లస్టర్ అధికారులు సునీల్,శివానందం, ఆస్పత్రుల సూపరింటెండెంట్స్ పీసీ శేఖర్, శివరాం, తదితరులు ఉన్నారు. -
వైద్య సౌకర్యాల కోసం రూ.113 కోట్లు
- పీహెచ్‌సీలను కార్పొరేట్ ఆస్పత్రులుగా తీర్చిదిద్దుతాం - విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వైద్యులపై చర్యలు - మెదక్ ఏరియా అస్పత్రిని 200 పడకలుగా మారుస్తాం - డిప్యూటీ సీఎం రాజయ్య మెదక్: ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్లకు దీటుగా తీర్చి దిద్దుతామని డిప్యూటీ సీఎం రాజయ్య పేర్కొన్నారు. శనివారం మెదక్ పట్టణానికి వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల కల్పనకు రూ.113 కోట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సిఫారసుల మేరకు కావల్సిన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన కాళోజీ మెడికల్ పీజీ యూనివర్సిటీ తెలంగాణకు ఒక వరమన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిపుణులైన వైద్యులు ఉన్నారన్న విషయాన్ని గ్రామీణులు తెలుసుకోవాలన్నారు. అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వైద్యులు విధుల పట్ల నిర్లక్ష ్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య సిబ్బంది ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామన్నారు. ఇటీవలే 1,273 వైద్యుల పోస్టులకు నోటిఫికేషన్ జారీచేశామన్నారు. దంత వైద్యులు, పారామెడికల్ పోస్టులను కూడా భర్తీ చేస్తామన్నారు. అన్ని ఆస్పత్రులలో మెస్ చార్జీలు, శానిటేషన్ చార్జీలు పెంచనున్నట్లు ప్రకటించారు. ప్రతి పీహెచ్‌సీని 30 పడకల ఆస్పత్రిగా, నియోజకవర్గ ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. మెదక్ ఏరియా ఆస్పత్రిని 200 పడకల స్థాయికి పెంచుతామన్నారు. దీంతోపాటు బ్లడ్‌బ్యాంకును ఏర్పాటుచేసి, అవసరమైన పోస్టులను మంజూరు చేస్తామన్నారు. ఈ సందర్భంగా మెదక్ ఏరియా ఆస్పత్రి వైద్యుల బృందం సమస్యలపై డిప్యూటీ సీఎంకు వినతి పత్రం సమర్పించారు. 104 ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని 104 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నుస్రత్, సంతోష్ప్రసాద్లు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వైద్యులు, కౌన్సిలర్లు డిప్యూటీ సీఎం రాజయ్యను సన్మానించారు. -
ఆరుబయటే పోస్టుమార్టం
మెదక్ రూరల్ :పేరుకే డివిజన్లో పెద్దాస్పత్రి. ఇక్కడ పోస్టుమార్టం చేయడానికి కనీస వసతులు లేవు. ముఖ్యంగా గదులు సమస్య వేధిస్తోంది. దీంతో ఆస్పత్రికి వచ్చిన మృతదేహాలకు ఆరుబయటే పోస్టుమార్టం నిర్వహించాల్సి వస్తోంది. ఒక వేళ అనాథ మృతదేహాలు వస్తే వాటిని భద్రపరిచేందుకు ఫ్రీజర్లు కూడా లేవు. దీంతో సచ్చినా కష్టాలు తప్పడం లేదు. మెదక్ ఏరియా ఆస్పత్రికి మెదక్, చిన్నశంకరంపేట, పాపన్నపేట, కొల్చారం, చేగుంట, కౌడిపల్లితో పాటు పలు పీహెచ్‌సీల నుంచి ప్రజలు చికిత్సల నిమిత్తంతో పాటు ప్రమాదాల్లో మరణిస్తే పోస్టుమార్టం కోసం ఇక్కడికి రావాల్సిందే. కానరాని సౌకర్యాలు... మెదక్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం కోసం ఓ గదిని కేటాయించారు. కానీ అది చాలా ఇరుకుగా ఉంది. కనీసం అందులోకి గాలి, వెలుతురు కూడా రాని పరిస్థితి. మరో ఇరుకు గదిలో శవాలను భద్రపరిచే ఒక ఫ్రీజర్ ఉంది. అది దశాబ్దాల క్రితం చెడిపోవడంతో అది కూడా మూలన పడింది. దీంతో గత్యంతరం లేక ఆరు బయటనే మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తున్నారు. కనీసం నీటి సౌకర్యం కూడా లేక పోవడంతో బయట నుంచి బకెట్లలో నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. పోస్టుమార్టం మృతదేహాలను బద్రపరిచేందుకు కావాల్సిన ఫ్రీజర్ల, (మార్చురీ) యూనిట్ లేదు. పోస్టుమార్టం చేయాలి అంటే రెండు పెద్ద సైజు బెంచీలతో పాటు విశాలమైన గది ఉండాలి. అదే గదిలో కనీసం 3 నుంచి 4 మృతదేహాలను భద్ర పరిచేందుకు ఫ్రీజర్లు అందుబాటులో ఉండాలి. గదిలో మృతదేహం వాసన రాకుండా ఉండేందుకు వాడే రసాయనాలను అందుబాటులో ఉంచుకోవాలి. అయితే ఏరియా ఆస్పత్రిలో ఇటువంటి సౌకర్యాలు ఏవీ లేవు. దీంతో అనాథ మృతదేహాలను రోజుల తరబడి ఓ గదిలో ఉంచ డంతో కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించేందుకు అన్నిసౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా ఈ సమస్యను గతంలోనే ఉన్నతాధికారుల దృష్టి కి తీసుకెళ్లడం జరిగిందన్నారు. నిధులు మంజూరైతే విశాలమైన గదితో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. -
హై రిస్క్ కాదు.. నోరిస్క్!
మెదక్ మున్సిపాలిటీ: గర్భిణులకు ఎటువంటి వైద్య సేవలనైనా క్షణాల్లో అందించేందుకు మెదక్ ఏరియా ఆస్పత్రిలో దాదాపు రూ.11లక్షలతో ఏర్పాటు చేసిన హైరిస్క్ కేంద్రం వల్ల ఈ ప్రాంత మహిళలకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. అత్యవసర సమయాల్లో గర్భిణులను హైదరాబాద్ తదితర ప్రాంతాలకు పంపించకుండా ఇక్కడే వైద్య సేవలందిస్తామని అధికారులు ఊదరగొట్టారు. అయితే ఈ హైరిస్క్ ఆస్పత్రి పనితీరు ప్రకటనలకు మాత్రమే పరిమితమైంది. ఎవరైనా అధికారులు ఈ ఆస్పత్రిని తనిఖీ చేసేందుకు వచ్చినప్పుడు మాత్రం కేంద్రంలో రిస్క్‌చేసి ఆపరేషన్లు చేస్తున్నామంటూ ఊదరగొడుతున్న వైద్యు లు అత్యవసర సమయాల్లో గర్భిణులను ప్రైవేట్ ఆంబులెన్స్‌ల్లో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. వీరిని 108లో పంపించాలంటే సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుందని గర్భిణులను ప్రైవేట్ ఆంబులెన్స్‌ల్లో తరలిస్తున్నారు. చీటికి మాటికి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన ఇబ్బందులు హైరిస్క్ సెంటర్ ఏర్పాటుతో తప్పుతాయని భావించిన గర్భిణులకు అవస్థలు మాత్రం తప్పడం లేదు. సోమవారం వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ తండాకు చెందిన మాలి అనే గర్భిణి మెదక్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. కాగా ఆమెకు రక్తం తక్కువగా ఉందంటూ చికిత్స చేశారు. నెలలు నిండటంతో ఆపరేషన్ చేయాల్సి రావడంతో ఆమెను ప్రైవేట్ అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించారు. హైరిస్క్ కేంద్రంలో ఆపరేషన్ చేయాలని బంధువులు కోరినప్పటికీ రక్తం అందుబాటులో లేదంటూ వైద్యులు ఆమెను హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. అదే విధంగా మెదక్ పట్టణంలోని నవాబుపేట వీధికి చెందిన పుష్ప అనే గర్భిణిని ఆపరేషన్ నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. కాగా ఈమెకు షుగర్ లెవల్ అధికంగా ఉండటంతో ఇక్కడ ఆపరేషన్ చేస్తే ఇబ్బందులు తలె త్తుతాయని, అందుకని హైదరాబాద్‌కు రెఫర్ చేసినట్లు వైద్యులు చెబుతున్నారు. హైరిస్క్ వస్తే గర్భిణులకు అవస్థలు తప్పుతాయని, చీటికి మాటికి హైదరాబాద్ వెళ్లాల్సిన దుస్థితి రాదని భావించామని పలువురు గర్భిణులు వాపోతున్నారు. ఈ మాత్రం దానికే హైరిస్క్ అంటూ లక్షలు ఖర్చుపెట్టి ఆర్భాటం చేయడం దేనికని గర్భిణులు, వారి బంధువులు ప్రశ్నిస్తున్నారు. వసతులు లేవు: సూపరింటెండెంట్ సెంటర్లో అన్ని వసతులు లేక పోవడంతోనే గర్భిణులను హైదరాబాద్‌కు రెఫర్ చేయాల్సి వస్తుందని మెదక్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ పీసీ శేఖర్ తెలిపారు. ఆస్పత్రిలో ముఖ్యంగా బ్లడ్ బ్యాంకు తదితర వసతులు లేని కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు.