గరీబోళ్లంతా గాంధీకే! | Medak Area Hospital problems | Sakshi
Sakshi News home page

గరీబోళ్లంతా గాంధీకే!

Published Sat, Jan 10 2015 3:54 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

గరీబోళ్లంతా గాంధీకే! - Sakshi

గరీబోళ్లంతా గాంధీకే!

మెదక్ ఏరియా ఆస్పత్రి.. 100 పడకల దవాఖాన.. మెదక్, రామాయంపేట, చిన్నశంకరంపేట, పాపన్నపేట, కొల్చారం, టేక్మాల్, కౌడిపల్లి, చేగుంట మండలాలతో పాటు పొరుగున ఉన్న నిజామాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాల వారికి ఏ చిన్న జ్వరమొచ్చినా ఈ ఆస్పత్రికే వస్తారు. రోజుకు ఇక్కడ ఓపీ 400 వరకు ఉంటుంది. అయితే ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య మాత్రం 20 దాటదు. ఎందుకంటే ఇక్కడి వైద్యులు రోగులతో బంతాట ఆడుకుంటున్నారు. చేయి కూడా పట్టుకోకుండానే పైసలుంటే.. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లమని, గరీబోళ్లయితే గాంధీకి పోవాలని ఉచిత సలహాలిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. కాదుకూడదంటే మాత్రం సెలైన్ పెట్టి సరిపెడుతున్నారు. దీంతో ఎంతో ఆశతో ఇక్కడికొస్తున్న పేదరోగులంతా పడరానిపాట్లు పడుతున్నారు.

మెదక్ ఏరియా ఆస్పత్రి వైద్యుల ఇష్టారాజ్యం
⇒ డిప్యూటీ స్పీకర్ ఆదేశించినా కానరాని ఫలితం
⇒ సిబ్బంది లేరంటూ చేతులెత్తేస్తున్న వైనం
⇒ చిన్నపాటి వైద్యానికీ గాంధీకి రెఫర్

 
మెదక్ టౌన్: ప్రభుత్వాలు మారినా.. ప్రజాప్రతినిధులు మారినా.. మెదక్ ఏరియా ఆస్పత్రి వైద్యుల తీరు మారడం లేదు. దీంతో వైద్యులనే దేవుళ్లుగా భావించి ఇక్కడికొస్తున్న పేద రోగులు పడరానిపాట్లు పడుతున్నారు. అత్యవసర సమయంలోనూ వైద్యం అందకపోవడంతో ప్రైవేటు క్లినిక్‌లకు పరుగులు తీస్తున్నారు. పేద ప్రజల సౌకర్యార్థం మెదక్ పట్టణంలో 1999లో అప్పటి  ప్రభుత్వం వంద పడకల ఆస్పత్రిని నిర్మించింది. క్షేత్రస్థాయిలో ప్రజలకు వైద్యాన్ని అందించాలని ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో వైద్యులు ప్రవర్తిస్తున్న తీరు పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడి వైద్యులంతా ప్రైవేటుగా ప్రాక్టీస్ చేస్తూ..ఆస్పత్రికి వచ్చే రోగులను అక్కడికే రావాలని సూచిస్తున్నారు. పైసల్లేని గరీబోళ్లయితే గాంధీ ఆస్పత్రికి వెళ్లమంటూ సలహాలు ఇస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే మాత్రం సిబ్బంది కొరత ఉంటే ఇంత పని ఎట్టా చేసేదంటూ అంతెత్తున లేస్తున్నారు.
 
ఎన్నాళ్లీ సిబ్బంది కొరత
మెదక్ ఏరియా ఆస్పత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీనికి సంబంధించి సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులకు, జిల్లా వైద్యాధికారులకు ఇప్పటికే ఎన్నోసార్లు విన్నవించినా...ప్రతిపాదనలు పంపినా సమస్య మాత్రం తీరడం లేదు. తెలంగాణ సర్కారైనా సిబ్బంది కొరత తీరుస్తుందని ఆశపడ్డ జనం ఆశలు అడియాశలే అయ్యాయి. రోజుకురోజుకూ ఇక్కడికొచ్చే రోగుల సంఖ్య పెరుగుతున్నా, 1999లో అప్పటి జనా భా ప్రకారం నిర్ణయించిన 12 మంది వైద్యులే ప్రభుత్వం నియమిస్తోంది. దీంతో రోగులకు వైద్యసేవలంద డం లేదు. ఉన్నవారిలోనూ కొద్దిమంది వైద్యులు పైసలకోసం పేద రోగులను ప్రైవేటు ఆస్పత్రులకు పంపుతున్నారు.
 
ప్రత్యామ్నాయం ఏది?
ఇటీవల పట్టణంలోని నవాబుపేట వీధికి చెందిన లక్ష్మి అనే మహిళ తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తన మూడేళ్ల చిన్నారిని ఆస్పత్రికి తీసుకొస్తే పిల్లల డాక్టర్ అందుబాటులో లేరు. దీంతో ఆ తల్లి జ్వరంతో అల్లాడిపోతున్న బిడ్డను చూస్తూ సుమారు 2 గంటలపాటు ప్రత్యక్ష నరకం అనుభవించింది. ఇక్కడి వైద్యులు అసలు పట్టించుకోరని, జ్వరమని వస్తే చేయికూడా పట్టుకోకుండానే గాంధీకి వెళ్లాలని చెప్తారని రోగులు ఆరోపిస్తున్నారు.

అందువల్లే ఇటీవల డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి స్వయంగా ఆస్పత్రిని పరిశీలించారు. రోగులను పరామర్శించడంతో పాటు వైద్యులకు పలు సూచనలు చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నందున 24 గంటల పాటూ వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.  కానీ ఆమె ఆదేశాలనూ స్థానిక వైద్యులు బేఖాతర్ చేస్తున్నారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో నిరుపేదలు అప్పులు చేసి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి నిలువునా మోసపోతున్నారు. ‘‘డిప్యూటీ స్పీకర్ ఆదేశించినా పట్టించుకోని వైద్యులు.. మా అసొంటి పేదోళ్ల మాటను పట్టించు కుంటారా?’ అని పేదజనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
ప్రైవేట్‌కు సిఫార్సు
సర్కార్ దవాఖానలో వైద్యం మాట దేవుడెరుగు. గంపెడాశతో వైద్యం కోసం వస్తున్న రోగులకు వైద్యులు, సిబ్బంది కొరత తీవ్ర ఇబ్బందులకు గురిచే స్తోంది. కొరత అనే ఏకైక సాకుతో రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు సిఫార్సు చేస్తున్నట్లు విమర్శలున్నాయి. సర్కార్ దవాఖానలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు దర్జాగా ప్రైవేట్ ఆస్పత్రులు నడిపిస్తున్నారు. టెస్టుల పేరుతో పేదల ప్రజల నుంచి వేలాది రూపాయలు దండుకుంటున్నారు. అడపా దడపా జిల్లా అధికారులు తనిఖీ చేసినా..ప్రయోజనం మాత్రం కనిపించడం లేదు.
 
కనీస సౌకర్యాలు కరువు
పేరుకు 100 పడకల ఆస్పత్రైనా ఇక్కడ  కనీస సౌకర్యాలు కూడా రోగులకు అందడం లేదు. ఫ్యాన్లున్నా అవి తిరగకపోవడంతో రోగులకు దోమలతో జాగారం చేయాల్సిన దుస్థితి నెలకొంది. కనీసం తాగేందుకు పరిశుభ్రమైన నీరు కూడా దొరకక రోగులంతా సమీపంలోని దుకాణాల్లో వాటర్ ప్యాకెట్లు కొనుక్కుని తాగుతున్నారు.

ఇక మంచాలైతే మరీ అధ్వాన్నంగా ఉన్నాయి. పరుపులు చనిగిపోయి పడుకునేందుకు వీలులేని పరిస్థితిలో ఉన్నాయి. ఇంకొన్ని మంచాలకైతే పరుపులే లేకపోవడంతో రోగులు తమవెంట తెచ్చుకున్ని దుప్పట్లు పరుచుకుని వైద్యం పొందుతున్నారు. ఇక రోగులవెంట వచ్చే కుటుంబీకుల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. వారు ఉండేందుకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో వారంతా చలికి వణుకుతూ ఆస్పత్రి ఆవరణలో పడుకుంటున్నారు.
 
ఉన్నతాధికారులు స్పందించాలి
మెదక్ ఏరియా ఆస్పత్రిలో వైద్యుల తీరు మారాలంటే...ప్రస్తుతం కొనసాగుతున్న వైద్యులను సిబ్బందిని ఇతర చోట్లకు బదిలీచేసి...కొత్త వారిని నియమించాలని పట్టణ ప్రజలు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ విషయంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్, జిల్లా వైద్యాధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement