ఆరుబయటే పోస్టుమార్టం
మెదక్ రూరల్ :పేరుకే డివిజన్‌లో పెద్దాస్పత్రి. ఇక్కడ పోస్టుమార్టం చేయడానికి కనీస వసతులు లేవు. ముఖ్యంగా గదులు సమస్య వేధిస్తోంది. దీంతో ఆస్పత్రికి వచ్చిన మృతదేహాలకు ఆరుబయటే పోస్టుమార్టం నిర్వహించాల్సి వస్తోంది. ఒక వేళ అనాథ మృతదేహాలు వస్తే వాటిని భద్రపరిచేందుకు ఫ్రీజర్లు కూడా లేవు. దీంతో సచ్చినా కష్టాలు తప్పడం లేదు. మెదక్ ఏరియా ఆస్పత్రికి మెదక్, చిన్నశంకరంపేట, పాపన్నపేట, కొల్చారం, చేగుంట, కౌడిపల్లితో పాటు పలు పీహెచ్‌సీల నుంచి ప్రజలు చికిత్సల నిమిత్తంతో పాటు ప్రమాదాల్లో మరణిస్తే పోస్టుమార్టం కోసం ఇక్కడికి రావాల్సిందే.
కానరాని సౌకర్యాలు...
మెదక్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం కోసం ఓ గదిని కేటాయించారు. కానీ అది చాలా ఇరుకుగా ఉంది. కనీసం అందులోకి గాలి, వెలుతురు కూడా రాని పరిస్థితి. మరో ఇరుకు గదిలో శవాలను భద్రపరిచే ఒక ఫ్రీజర్ ఉంది. అది దశాబ్దాల క్రితం చెడిపోవడంతో అది కూడా మూలన పడింది. దీంతో గత్యంతరం లేక ఆరు బయటనే మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తున్నారు. కనీసం నీటి సౌకర్యం కూడా లేక పోవడంతో బయట నుంచి బకెట్లలో నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. పోస్టుమార్టం మృతదేహాలను బద్రపరిచేందుకు కావాల్సిన ఫ్రీజర్ల, (మార్చురీ) యూనిట్ లేదు. పోస్టుమార్టం చేయాలి అంటే రెండు పెద్ద సైజు బెంచీలతో పాటు విశాలమైన గది ఉండాలి.
అదే గదిలో కనీసం 3 నుంచి 4 మృతదేహాలను భద్ర పరిచేందుకు ఫ్రీజర్లు అందుబాటులో ఉండాలి. గదిలో మృతదేహం వాసన రాకుండా ఉండేందుకు వాడే రసాయనాలను అందుబాటులో ఉంచుకోవాలి. అయితే ఏరియా ఆస్పత్రిలో ఇటువంటి సౌకర్యాలు ఏవీ లేవు. దీంతో అనాథ మృతదేహాలను రోజుల తరబడి ఓ గదిలో ఉంచ డంతో కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించేందుకు అన్నిసౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా ఈ సమస్యను గతంలోనే ఉన్నతాధికారుల దృష్టి కి తీసుకెళ్లడం జరిగిందన్నారు. నిధులు మంజూరైతే విశాలమైన గదితో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.