Dr. నర్స్‌.. నర్సులే దిక్కాయె | Doctors Shortage in Hyderabad | Sakshi
Sakshi News home page

Dr. నర్స్‌.. నర్సులే దిక్కాయె

Published Sat, Jun 15 2019 8:02 AM | Last Updated on Fri, Jun 21 2019 11:10 AM

Doctors Shortage in Hyderabad - Sakshi

ఇది చర్లపల్లిలోని బస్తీ దవాఖానా. ఇక్కడ రోజుకు వందమందికి పైగా రోగులు వస్తుంటారు. ఈ ఆస్పత్రిలో రెండు నెలలుగా డాక్టర్‌ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో ఇక్కడి స్టాఫ్‌నర్సేఇన్నిరోజులుగా వైద్య సేవలు అందిస్తున్నారు.  

ఇది ఒక్క చర్లపల్లిలోనే కాదు.. నగరంలోని దాదాపు అన్ని బస్తీ దవాఖానాల్లోనూ ఇదే పరిస్థితి. బస్తీల్లో ఏర్పాటు చేసిన దవాఖానాల్లో పూర్తిస్థాయి వైద్యులను నియమించకపోవడం వల్ల ఇలాంటి దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. ఉన్న ఒక్క వైద్యుడు సెలవు పెట్టినా.. అత్యవసర పరిస్థితిలో విధులకు రాలేకపోయినా, పోస్టులు ఖాళీ అయినా... ఆస్పత్రికి వచ్చిన రోగులకు నర్సులే వైద్యులుగా సేవలందించే పరిస్థితి గ్రేటర్‌లో నెలకొంది. అత్యంత జాగ్రత్తతో చేయాల్సిన వైద్యం గాలికి వదిలేసినట్టవుతోంది. నగరంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలపై ‘సాక్షి’ ఫోకస్‌..  

సాక్షి నెట్‌వర్క్‌: ప్రజలకు ప్రభుత్వం అందించే సేవల్లో అత్యంత ప్రధానమైంది వైద్యం. గ్రేటర్‌లోని బోధనాస్పత్రుల్లో నిత్యం వేలాది మంది రోగులు వస్తుంటారు. చిన్నచిన్న రోగాలకు పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ఉండనే ఉన్నాయి. అయితే ఈ ఆస్పత్రుల్లో రోగుల తాకిడికి పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ తరహాలో హైదరాబాద్‌ నగరంలోనూ బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తద్వారా ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిలోఫర్‌ వంటి టీచింగ్‌ ఆస్పత్రులపై భారం తగ్గించవచ్చని భావించింది. ఈ మేరకు ప్రతి పదివేల మందికి ఒకటి చొప్పున ఇప్పటి దాకా 96 బస్తీల్లో దవాఖానాలను ఏర్పాటు చేశారు. మందులు, మౌలిక వసతులను సమకూర్చారు. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన ఒక డ్యూటీ డాక్టర్‌తో పాటు ఇద్దరు స్టాఫ్‌ నర్సులు, ఒక అటెండర్‌ను నియమించారు. ఇంటికి సమీపంలోనే ఆస్పత్రి ఉండడం, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య సేవలు అందిస్తుండడంతో స్థానిక ప్రజలు వీటికి క్యూ కడుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పోలిస్తే వీటిలో అందిస్తున్న సేవలు బాగుండడంతో మంచి ఆదరణ లభిస్తోంది. అవసరమైన రోగులకు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులతో టెలిమెడిసిన్‌ సేవలు అందిస్తుండటంతో రోగులు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా ఫీవర్‌ ఆస్పత్రిపై జ్వర పీడితుల భారం ఇటీవల భారీగా తగ్గింది. ఒకప్పుడు రోజువారీ సగటు ఓపీ 900 నుంచి 1200 ఉండగా, ప్రస్తుతం 400 నుంచి 600 మించడం లేదంటే బస్తీ దవాఖానాలు రోగులపై ఎంతటి ప్రభావం చూపాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆయా దవాఖానాల్లో ఉన్న ఒక్క వైద్యుడు/వైద్యురాలు సెలవు పెడితే మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు.  

డాక్టర్‌ లేకుంటే నర్సులే దిక్కు
ఒక్కో బస్తీ దవాఖానాకు రోజుకు సగటున 30–60 మంది వరకు రోగులు వస్తున్నారు. జ్వర పీడితులతో పాటు హైపర్‌ టెన్షన్, మధుమేహ బాధితులు ఎక్కువగా సేవలు పొందుతున్నారు. ఒక్కో ఆస్పత్రికి ఒకే వైద్యుడిని నియమించడంతో అత్యవసర పరిస్థితుల్లో వారు సెలవులో పెడితే ప్రత్యామ్నాయంగా మరో డాక్టర్‌ను అందుబాటులో ఉంచాలి. కానీ బస్తీ దవాఖానాల్లో ఆ పరిస్థితి లేకపోవడంతో ప్రాధమిక వైద్య సేవలను నర్సులే అందించే పరిస్థితి తలెత్తింది. హస్తినాపురం డివిజన్‌ పరిధిలోని నందనవనంలోని బస్తీ దవాఖానా డ్యూటీ డాక్టర్‌ గురువారం సెలవులో వెళ్లారు. ప్రత్యామ్నాయం లేకపోవడంతో వచ్చిన రోగులకు నర్సులే వైద్యసేవలు అందించారు. ఇదిలా ఉంటే ఆయా కేంద్రాల్లో వైద్య పరీక్షలకు సంబంధించిన లేబొరేటరీ లేకపోవడం, రోగుల నుంచి నమూనాలు సేకరించి ఐపీఎంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్‌కు పంపాల్సి వస్తుండటం, రిపోర్టుల జారీలో జాప్యం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారు. బస్తీ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందాలంటే ఒక్కో దవాఖానాలో కనీసం ఇద్దరు వైద్యులను నియమించాల్సి ఉంది.

ల్యాబ్‌ సౌకర్యాలు కల్పించాలి
శంకర్‌నగర్‌లో బస్తీ దవాఖానాకు విశేష స్పందన లభిస్తోంది. రోజుకు 100–110 మంది రోగులు వస్తున్నారు. మరిన్ని సౌకర్యాలు కల్పించటం ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించగలం. ముఖ్యంగా ల్యాబొరేటరీ అవసరముంది.– డాక్టర్‌ సైదా, బస్తీ దవాఖానా వైద్యులు

మచ్చుకు కొన్ని సమస్యలు..
కుత్బుల్లాపూర్‌ జంట సర్కిళ్ల పరిధిలో దేవేందర్‌నగర్, అయోధ్యనగర్, శివాలయనగర్, ఓల్డ్‌ జీడిమెట్లలో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారు. ఇవి ఉన్నట్లు స్థానికులకే తెలియని పరిస్థితి. కేవలం ఆయా దవాఖానాల చుట్టూ ఉన్న వారికి మాత్రం తప్ప మిగిలిన వారికి తెలియని పరిస్థితి. శివాలయనగర్‌లో పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలతో బస్తీ దవాఖానాను ఏర్పాటు చేసినా దాని గురించి తెలియక స్థానికులు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడం లేదు.  
ఓల్డ్‌ జీడిమెట్లలో బస్తీ దవాఖానా ఏర్పాటు చేసినా అక్కడ వైద్యులు లేరు. గత రెండు, మూడు నెలల కాలంలో ఇద్దరు వైద్యులు మానేశారు. ఇక్కడ కేవలం సపోర్టింగ్‌ సిబ్బంది ఒకరు, ఒక స్టాఫ్‌నర్సు మాత్రమే ఉన్నారు. అయితే, ఆ స్టాఫ్‌నర్సు కూడా రెండు రోజులుగా సెలవులో ఉన్నారు.  
ఫతేనగర్‌ డివిజన్‌లోని ఇందిరాగాంధీపురంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానా ఉదయం 9.30 గంటలైనా తెరుచుకోదు. ఇక్కడ వైద్యుడితో పాటు ముగ్గురు సిబ్బంది పనిచేస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేయాల్సి ఉండగా సిబ్బంది కూడా ఎవరూ అందుబాటులో లేకపోవటంతో వైద్యం కోసం వచ్చిన రోగులు నిరాశతో వెనుతిరగాల్సిన పరిస్థితి.  
నాచారం ఎర్రకుంటలో ఏప్రిల్‌ 14, 2018లో నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ బస్తీ దవాఖానాను ప్రారంభించారు. ఇందులో తాగునీరు, విద్యుత్‌ సరఫరాకు ఇబ్బందిగా మారింది. ఇది కాలనీలకు దూరంగా ఉండడంతో ప్రజలు రావడంలేదు.  
ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ పరిధిలోని సౌత్‌ కమలానగర్‌ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానా ప్రారంభోత్సవానికే నోచుకోలేదు. గతంలో ఇక్కడ కమలానగర్‌ ఆరోగ్య ఉపకేంద్రం ఉండేది. దీనికి మరమ్మతులు చేసి బస్తీ దవాఖానా అని పేరు పెట్టి చేతులు దులుపుకున్నారు.
చర్లపల్లిలోని బస్తీ దవాఖానాలో రెండు నెలలుగా డాక్టర్‌ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో ఇన్నిరోజులుగా ఇక్కడి స్టాఫ్‌నర్సే వైద్య సేవలు అందిస్తోంది.  
ఉప్పల్‌ సర్కిల్‌ చిలుకానగర్‌ డివిజన్‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలోని డాక్టర్‌ సెలవుల్లో ఉండడంతో స్టాఫ్‌నర్సే ఇక్కడ అన్నితానై  చూసుకుంటోంది. ప్రతిరోజు 40 నుంచి 50 మంది రోగులు ఇక్కడకు వస్తుంటారు.

త్వరలో టెలి మెడిసిన్‌  
బాగ్‌ లింగంపల్లి ఈడబ్ల్యూఎస్‌ క్వార్టర్స్‌లోని కమ్యూనిటీ హాల్‌లో త్వరలో టెలి మెడిసిన్‌ విధానం అందుబాటులోకి వస్తుంది. పెద్ద రోగాలకు ప్రత్యేక వైద్యులతో వీడియో కాల్స్‌ ద్వారా చికిత్స అందిస్తాం. ఏమైనా సర్జరీలు అవసరమైతే అలాంటి వారిని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు పంపిస్తున్నాం.         – డాక్టర్‌ దివాకర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement