ఆస్పత్రి సొమ్ము.. ఆర్భాటానికా? | Doctors Surgeries own campaign expense? | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి సొమ్ము.. ఆర్భాటానికా?

Published Sat, Aug 8 2015 12:46 AM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM

ఆస్పత్రి సొమ్ము.. ఆర్భాటానికా?

ఆస్పత్రి సొమ్ము.. ఆర్భాటానికా?

వైద్యుల శస్త్రచికిత్సల సొమ్ముతో సొంత ప్రచారమా?
రిపేరు పనులకు శిలాఫలకాలా..!
గతంలో ఇచ్చిన హామీలు మరిచారా
నేడు ప్రభుత్పాస్పత్రిలో మంత్రి కామినేని పర్యటన
 

అంతన్నారు.. ఇంతన్నారు.. ప్రభుత్వాస్పత్రిని ప్రక్షాళన చేసేస్తానని మాటలు కోటలు దాటించారు. అమలులో అన్నీ మరిచిపోగా.. ఆస్పత్రి సొమ్ముతో సొంత ప్రచారం చేసుకుంటున్నారు రాష్ట్ర వైద్యశాఖ మంత్రివర్యులు కామినేని శ్రీనివాస్. వైద్యులు శస్త్రచికిత్సలు చేయడం ద్వారా సమకూరిన రివాల్వింగ్ ఫండ్‌తో ఆస్పత్రిలోని రిపేరు పనులు చేయించడమే కాకుండా మునుపెన్నడూ లేనట్టుగా.. తమ సొంత నిధులతో    ఆ పనులు చేయిస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ శిలాఫలకం వేయించు కోవడం వివాదాస్పదమవుతోంది.
 
లబ్బీపేట : వైద్యశాఖ మంత్రిగా కామినేని శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టిన ఈ ఏడాది కాలంలో ప్రభుత్వాస్పత్రి కనీస మౌలిక సదుపాయాలకు రూపాయి కేటాయించింది లేదు. ‘రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ పనితీరు ఏం బాగోలేదు. పేదలకు సరైన వైద్యం అందుతుందని నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను.’ అంటూ బాధ్యతలు చేపట్టిన కొద్దికాలం వరకూ మంత్రివర్యులు ఇదే మాట చెబుతూ వచ్చారు. మార్పు రావాలని, పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏం కావాలో చెప్పాలంటూ పదేపదే ప్రశ్నిస్తూ వచ్చారు. ఆస్పత్రిలో రాత్రి నిద్రచేసి మరీ సమస్యలు తెలుసుకున్నారు. కానీ, ఒక్క రూపాయి కూడా కేటాయించిన సందర్భాలు లేవు. కనీసం రిపేరైన పరికరాలకు మరమ్మతులు చేయించేందుకు రూపాయి విదల్చలేదు.

 మరి ఇదేం కథ మంత్రివర్యా!
 ప్రభుత్వాస్పత్రి దుస్థితి ఇలా ఉంటే.. మంత్రిగారి ప్రచార ఆర్భాటం కోసం ఏకంగా ప్రభుత్వాస్పత్రి సొమ్మునే వాడుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ పథకం అమలుచేసిన 2008వ సంవత్సరం నుంచి ఆస్పత్రికి రావాల్సిన నిధుల మొత్తంలో 20 శాతం ప్రభుత్వం వద్దే ఉంచారు. వాటితో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయాల్సి ఉంది. అలా.. ప్రభుత్పాస్పత్రిలో ఆరోగ్యశ్రీ శస్త్రచికిత్సలు నిర్వహించిన వైద్యుల కృషి కారణంగా నిధులు క్రమేణా పెరుగుతూ వచ్చాయి. ఆ డబ్బుతో సుమారు రూ.4 కోట్లతో ప్రస్తుతం ఆస్పత్రిలో పలు రిపేర్లు చేయనున్నారు. ఇప్పటివరకు ఇలాంటి సొమ్ముతో చేసిన అభివృద్ధి పనులకు ప్రచారం చేసుకున్న సందర్భాలేమీ లేవు. కానీ, ప్రస్తుతం వైద్యశాఖ మంత్రి మాత్రం రిపేరు పనుల ప్రారంభోత్సవానికి శిలాఫలకం వేయనున్నారు. ఇదేమిటని వైద్యులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏడాది కిందట ఆస్పత్రిలో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అనేక సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని, ఒక్క పనికూడా చేయలేదని, ఇప్పుడు ఆస్పత్రి నిధులతో మరమ్మతులు చేస్తూ సొంత ప్రచారం చేసుకుంటున్నారని పలువురు వైద్యులే వ్యాఖ్యానిస్తున్నారు.

 వీటి సంగతేంటి సార్?
ఫిజియోథెరఫీ విభాగంలో పరికరాలన్నీ మూలన పడ్డాయి. కొత్త పరికరాలు కొనుగోలు చేయాలని విన్నవించినా ఫలితం లేదు.న్యూరాలజీలో ఫిట్స్ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు చేసే ఈఈజీ పనిచేయడం లేదు.కార్డియాలజీలో ట్రెడ్‌మిల్ మూలనపడింది. సీటీ స్కాన్ కొని పదేళ్లు దాటింది. దాని స్థానంలో ఎంఆర్ ఐ కొనుగోలు చేయాలని అధికారులు ప్రతిపాదించినా ఆ ఊసే లేదు.రెండేళ్లుగా రెండు ఆపరేషన్ థియేటర్‌లు మూతపడ్డాయి. శ్లాబ్ నుంచి నీరు కారడంతో సర్జరీలు నిలిపివేశారు. నేటికీ అవి మరమ్మతులు నోచుకోలేదు.
 
ప్రభుత్వాస్సత్రికి గత ఏడాది ఏప్రిల్‌లో డిజిటల్ ఎక్స్‌రే మిషన్ సమకూరింది. దానిని ఒక గదిలో ఉంచి భద్రపరచడం మిన హా వినియోగంలోకి తీసుకు రాలేదు. సుమారు రూ.25 లక్షలు వెచ్చించి కొన్న మిషన్ నిరుపయోగంగా మారింది. అందుకు ఆస్పత్రిలో రేడియోగ్రాఫర్ల కొరతే కారణమని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై అనేకసార్లు మంత్రి కామినేని శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారానికి నోచుకోలేదు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement