
కళ్లజోడు ఉందని కళ్లు పొడుచుకుంటారా?
అన్యభాషలను నెత్తిన పెట్టుకుని అమ్మ బాషను అణగదొక్కేందుకు తెలుగు నేలపై జరుగుతున్న దురగతాలు మాతృభాషాభిమానులను నివ్వెరపరుస్తున్నాయి.
అన్యభాషలను నెత్తిన పెట్టుకుని అమ్మ బాషను అణగదొక్కేందుకు తెలుగు నేలపై జరుగుతున్న దురాగతాలు మాతృభాషాభిమానులను నివ్వెరపరుస్తున్నాయి. కళ్లజోడు ఉందని కళ్లను పొడుచుకున్నట్టుగా ఉంది నేడు తెలుగువారి పరిస్థితి. అన్యభాషను అందల మెక్కించేందుకు అమ్మభాషను చిన్నచూపు చూస్తున్నారు. తెలుగులో మాట్లాడితే పాపమన్నట్టుగా చూస్తున్నారు. వచ్చీరానీ ఇంగ్లీషు కక్కేవారిని మాత్రం ఆకాశం నుంచి ఊడిపడినట్టు ఆదరిస్తున్నారు. అమ్మ భాష అంటే అంత లోకువా?
తెలుగు గడ్డపై అమ్మభాషలో మాట్లాడడమే నేరమైపోతోంది. తెలుగులో మాట్లాడినందుకు దాదాపు 42 విద్యార్థులను ఓ టీచరమ్మ తీవ్రంగా దండించింది. అమ్మ భాషలో మాట్లాడితే తప్పేంటని అడిగిన పాపానికి పిల్లల చేతులపై వాతలు తేలేలా వాయించేసింది. హైదరాబాద్ లోని ఎర్రగడ్డ డాన్‌బాస్కో స్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై మాతృభాషాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు మాట్లాడి టీచర్ల చేతిలో విద్యార్థులు దెబ్బలు తింటున్న దౌర్భగ్య ఘటనలు నానాటికీ పెరుగుతుండడం శోచనీయం.
బతకుతెరువు కోసం బహు బాషాలు నేర్చుకోవడం తప్పుకాదు. బలవంతంగా రుద్దడం తప్పు. మాతృభాషపై ఏమాత్రం అవగాహన లేనివారే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. అన్యభాషలో అభ్యసించిన విద్యార్థులతో పోల్చితే మాతృభాషలో చదివిన పిల్లలకు మేథోవికాసం మెండుగా ఉంటుందని శాస్త్రీయంగా రుజువైనా కళ్లుతెరవడం లేదు. పాలకుల నిష్క్రియకు తల్లిదండ్రుల ఆంగ్ల వ్యామోహం తోడవడం అమ్మ భాష పాలిట శాపంగా మారింది. తెలుగు పరీక్షలోనే అత్యధిక మంది విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వేరే చెప్పక్కర్లేదు. తల్లిపాలు వదులుకుని డబ్బా పాలు కోసం పాకులాడుతున్నట్టుగా ఉంది తెలుగువారి పరిస్థితి. ఇదిలా కొనసాగితే తెలుగు జాతి అంతరించిపోవడం ఖాయం. కాదంటారా?