రైతు శ్రమను గుంజుకుంటారా..?
► బలవంతపు భూ సేకరణ వ్యతిరేకిస్తున్నాం
► టీడీపీ ప్రభుత్వం అరచేతిలో స్వర్గం చూపిస్తోంది
► ఉద్యోగాలంటూ ఊరించడమే.. అమలు చేసింది లేదు
► సీపీఎం నేత పి.మధు ధ్వజం
► దొనకొండలో పార్టీ శ్రేణుల ర్యాలీ
► ప్రకాశంను కరువు జిల్లాల జాబితాలో చేర్చాలరి డిమాండ్
దొనకొండ : రైతులు తమ రక్తం ధారపోసి, నిరుపయోగంగా ఉన్న కొండలు, గుట్టలను చదును చేసుకున్నారు. సేద్యానికి అనువుగా మార్చుకుని అందులో సాగుచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఇప్పుడు ఆ భూములను భూసేకరణ పేరుతో బలవంతంగా లాక్కుంటారా..? అని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ మాజీ సభ్యుడు పి.మధు ప్రశ్నించారు. బలవంతపు భూ సేకరణకు తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రకాశం జిల్లాను కరువు జిల్లాల జాబితాలో చేర్చాలని, దొనకొండ మండలాన్ని అభివృద్ధి చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. పార్టీ మండల కార్యదర్శి చిరుపల్లి అంజయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మధు మాట్లాడుతూ నిత్యం కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రకాశం జిల్లాలో ప్రజలు జీవనం సాగించడం రాబోయే రోజుల్లో చాలా కష్టంగా ఉంటుందన్నారు.
పట్టా భూములతో సమంగా పరిహారమివ్వాలి..
రైతు సమస్యలు తెలుసుకునేందుకే కమ్యూనిస్టు పార్టీ పాదయాత్ర ఏర్పాటు చేసిందని మధు చెప్పారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో పంటలు ఎండు ముఖం పట్టాయని, భూగర్భ జలాలు సైతం అడుగంటిపోవడంతో రైతులు పెట్టుబడులైనా వస్తాయో రావోననే ఆందోళనతో ఉన్నారన్నారు. గ్రామాల్లో ఉపాధి పనులు లేక చాలా మంది వలస బాట పట్టారని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా అభివృద్ధిని అరచేతిలో స్వర్గం చూపిస్తుందన్నారు. దొనకొండ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామని అనేక దేశాల నుంచి పారిశ్రామిక వేత్తలు వస్తున్నారని, వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామని ఊరించడమే తప్ప అమలు చేసిందేమి లేదన్నారు. 2103 భూసేకరణ చట్టం ప్రకారం సెటిల్‌మెంట్ పట్టా భూములతో సమానంగా అసైన్‌డ, ప్రభుత్వ భూముల సాగుదారులకు పరిహారం ఇవ్వాలని, ఆ భూముల్లో పనులు కోల్పోతున్న కూలీలకు పింఛన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల కోరిక వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు కేటారుుంచి వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. దొనకొండ నుంచి బయలుదేరిన పాదయాత్ర ఆరు నియోజక వర్గాలు, 15 మండలాలు, 102 గ్రామాలలో 350 కిమీ 15 రోజుల్లో పర్యటించి డిసెంబర్ 23వ తేదీకి ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకుంటామన్నారు. పార్టీ రాష్ట్ర నాయకులు జాలా అంజయ్య మాట్లాడుతూ గ్రామాలలో ఉపాధి పనుల్లేక ప్రజలు అప్పుల్లో కూరుకుపోయారని, జిల్లాలో 65 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన సందర్భంలో ఏడు జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రభుత్వం గుర్తించిన సమయంలో అందులో మన జిల్లాను చేర్చాలని పట్టుబట్టిన ప్రజాప్రతినిధి జిల్లాలో లేకపోవడం సిగ్గుచేటన్నారు.
నిత్యం కరువు, వలసలు, అనావృష్టి, పాలకుల నిర్లక్ష్యంతో ప్రజలు దారిద్య్రంలో జీవిస్తున్నారన్నారు. సీపీఎం పాదయాత్ర ప్రజలను జాగృతం చేసేందుకు నిర్వహిస్తుందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల కాంట్రాక్టు అధ్యాపకులు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మధుకు అందజేశారు. అనంతరం పాదయాత్రను వారు ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కంకణాల ఆంజనేయులు, వెంకటరామిరెడ్డి, జిల్లా కార్యదర్శి సోమయ్య, రమేష్, స్థానిక నాయకులు తాండవ రంగారావు, వెంకటేశ్వరరెడ్డి, కళావతి, కర్నా హనుమయ్య, జొన్నలగడ్డ రాజు, కె.అనిల్, చంటి, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.