
బాబు సంతకాల్లో స్పష్టత లేదు : డేవిడ్‌రాజు
యర్రగొండపాలెం : రైతులను మోసం చేసే ప్రభుత్వం మనుగడ సాగించలేదని ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు చెప్పారు. మంగళవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు రుణాల రద్దుపై తొలి సంతకం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం తన మనుగడ కోల్పోక తప్పదన్నారు. దాదాపు రూ.50కోట్లతో ఆర్భాటంగా ప్రమాణ స్వీకారం చే సిన సీఎం చంద్రబాబు రుణమాఫీపై ఒక కమిటీని వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
దీనిపై రైతులు గందరగోళంలో ఉన్నారన్నారు. వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో తమ పార్టీ రాష్ట్ర ప్రజలకు అండగా నిలుస్తుందని చెప్పారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు దిగుతున్నారని, అధికార మదంతో చేసే చర్యలను అడ్డుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు ఎం మంత్రూనాయక్, పుల్లలచెరువు మండల పార్టీ కన్వీనర్ ఉడుముల శ్రీనివాసరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు వేగినాటి శ్రీనివాస్, నాయకులు షేక్ కరీముల్లా, నర్రెడ్డి వెంకటరెడ్డి, షేక్ జానీబాషా పాల్గొన్నారు.