అండగా ఉంటాం
కంబాలచెరువు (రాజమండ్రి), న్యూస్‌లైన్ :‘అండగా ఉంటాం... మీరేమీ భయపడవద్ద’ని...ధవళేశ్వరం పడవ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. పడవ ప్రమాద మృతుల కుటుంబ సభ్యులను ఆయన రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో బుధవారం పరామర్శించారు. ఆయన జరిగిన సంఘటనను పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. సుమారు గంటకుపైగా ఆయన బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి బాధను పంచుకున్నారు. జరిగిన సంఘటన చాలా బాధాకరమని, అయితే మీ అందరికీ తోడుగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. మృతురాలు రాజేశ్వరి తల్లి సుగుణ, వృద్ధురాలు అయిన జ్యోతి తల్లి, ఇతర మృతుల కుటుంబాల సభ్యుల వద్దకు వెళ్లి వారిని ఓదార్చారు.
వారి కన్నీటిని ఆయన చేతితో తుడిచారు. ఏడవ వద్దని, చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేకపోయినా కొండంత అండగా ఉంటామని ఆయన వారికి భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు తనవంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. చాలా సమయం బాధితులతో పాటు అలాగే కిందకూర్చుని మాట్లాడి వారిని ఓదార్చారు. మార్చురీ వద్ద మృతదేహాలను పరిశీలించిన ఆయన పోస్టుమార్టం పూర్తిచేసి మృతదేహాలను త్వరగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆసుపత్రి వైద్యాధికారులకు సూచించారు. జగన్‌మోహన్‌రెడ్డి రాకతో తమ గుండెల్లో కొంత బాధ తగ్గినట్టయిందని బాధిత కుటుంబాలు తెలిపాయి.