Dhavaleswaram Barriage
-
వరద వదిలింది.. బురద మిగిలింది
కొవ్వూరు/పోలవరం : గోదావరిలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ప్రమాద హెచ్చరికలను గురువారం ఉపసంహరించారు. గోష్పాద క్షేత్రంలోని ఆలయాలు వరద ముంపు నుంచి తేరుకున్నాయి. శ్రీబాలా త్రిపురసుందరి సమేత సుందరేశ్వరస్వామి ఆలయం, గీతా మందిరం, షిర్డీసాయి ఆలయంలో ఒండ్రు మట్టి, ఇసుక మేటలు వేశారుు. మూడు రోజులపాటు ఆలయాలు ముంపులోనే ఉండటంతో ధూపదీప నైవేద్యాలు నిలిచిపోయాయి. ఆలయాల్లో పేరుకుపోయిన బురదను గురువారం ఉదయం తొలగించి, శుభ్రం చేసే పనులు చేపట్టారు. గోష్పాద క్షేత్రంలోకి వెళ్లే రహదారులు బురదమయంగా మారాయి. పలుచోట్ల ఇసుక, ఒండ్రు మేటలు వేశారుు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం తగ్గడంతో బుధవారం రాత్రి 11 గంటలకు రెండో ప్రమాద హెచ్చరికను, గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. సాయంత్రం 4 గంటలకు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 10.40 అడుగులు నమోదైంది. గోదావరి నుంచి 8,49,625 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. ఆనకట్టకు గల 175 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదనీరు తగ్గడంతో లంక భూములు ముంపు బారినుంచి తేరుకుంటున్నాయి. జల దిగ్బంధంలోనే గిరిజన గ్రామాలు పోలవరం/పోలవరం రూరల్ : గోదావరి శాంతించినా ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిపై పలుచోట్ల వరద నీరు ఇంకా తొలగిపోలేదు. గిరిజనులు గ్రామాలను విడిచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. స్పిల్‌వే నిర్మాణ ప్రాంతంలో ఇంకా సుమారు ఐదు అడుగుల నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. మామిడిగొంది, దేవరగొంది, చేగొండపల్లి గిరిజనులు మాత్రం కొండల పైనుంచి అంచెలంచెలుగా పోలవరం చేరుకుని నిత్యావసర సరుకులు, అవసరమైన మందులు కొనుగోలు చేసి తీసుకువెళుతున్నారు. స్పిల్‌వే ప్రాంతంలో విద్యుత్ స్తంభం విరిగి పోవడంతో ఏజెన్సీ గ్రామాలకు సింగల్ ఫేజ్ విద్యుత్ మాత్రమే సరఫరా అవుతోంది. దీంతో ఏజెన్సీ గ్రామాల్లో మంచినీటి పథకాలు పనిచేయడం లేదు. మంచినీటి కోసం గిరి జనులు ఇబ్బందులు పడుతున్నారు. కోండ్రుకోట, మాదాపురం గ్రామాల్లో విద్యుత్ సరఫరా లేదు. కొత్తూరు కాజ్వే మీదుగా ఇంకా వరద నీరు ప్రవహిస్తోంది. కొన్నిచోట్ల రోడ్లు బయటపడినా బురద పేరుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. -
'బాధితులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించండి'
తూ.గో: నవాబుపేట, దవళేశ్వరం పడవ ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు తక్షణమే రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. శుక్రవారం ఆ ప్రమాద బాధితుల కుటుంబాల్లో ఎనిమిది మందికి రూ.లక్ష చొప్పున వైఎస్సార్ సీపీ పంపిణీ చేసింది. బుధవారం మృతుల కుటుంబాలను పరామర్శించిన జగన్ అండంగా ఉంటామని భరోసా ఇచ్చారు. పడవ ప్రమాద మృతుల కుటుంబ సభ్యులను ఆయన రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించారు. ఆయన జరిగిన సంఘటనను పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. సుమారు గంటకుపైగా ఆయన బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి బాధను పంచుకున్నారు. జరిగిన సంఘటన చాలా బాధాకరమని, అయితే మీ అందరికీ తోడుగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. -
అండగా ఉంటాం
కంబాలచెరువు (రాజమండ్రి), న్యూస్‌లైన్ :‘అండగా ఉంటాం... మీరేమీ భయపడవద్ద’ని...ధవళేశ్వరం పడవ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. పడవ ప్రమాద మృతుల కుటుంబ సభ్యులను ఆయన రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో బుధవారం పరామర్శించారు. ఆయన జరిగిన సంఘటనను పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. సుమారు గంటకుపైగా ఆయన బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి బాధను పంచుకున్నారు. జరిగిన సంఘటన చాలా బాధాకరమని, అయితే మీ అందరికీ తోడుగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. మృతురాలు రాజేశ్వరి తల్లి సుగుణ, వృద్ధురాలు అయిన జ్యోతి తల్లి, ఇతర మృతుల కుటుంబాల సభ్యుల వద్దకు వెళ్లి వారిని ఓదార్చారు. వారి కన్నీటిని ఆయన చేతితో తుడిచారు. ఏడవ వద్దని, చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేకపోయినా కొండంత అండగా ఉంటామని ఆయన వారికి భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు తనవంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. చాలా సమయం బాధితులతో పాటు అలాగే కిందకూర్చుని మాట్లాడి వారిని ఓదార్చారు. మార్చురీ వద్ద మృతదేహాలను పరిశీలించిన ఆయన పోస్టుమార్టం పూర్తిచేసి మృతదేహాలను త్వరగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆసుపత్రి వైద్యాధికారులకు సూచించారు. జగన్మోహన్రెడ్డి రాకతో తమ గుండెల్లో కొంత బాధ తగ్గినట్టయిందని బాధిత కుటుంబాలు తెలిపాయి. -
పెనుగాలే మృత్యుపాశమై
ధవళేశ్వరం, న్యూస్‌లైన్ :ధవళేశ్వరం వాడపేటలో దౌడుపల్లి అప్పలరాజు ఇంట జరిగే వివాహ వేడుకలో పాల్గొనేందుకు కోరుకొండ నుంచి కొమర పోలరాజు తన భార్య మల్లేశ్వరి, కుమార్తె సత్య, కుమారుడు శివన్నారాయణ(బన్ని), మేనకోడళ్లు సురాడ జ్యోతి, సురాడ రాజేశ్వరి తదితరులతో కలిసి వచ్చారు. మంగళవారం వాడపేటలో జరిగిన విందులో బంధువులంతా పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం గోదావరి అందాలు చూసేందుకు కొందరు బంధువులు సమీపంలోని సున్నంబట్టీ రేవు వద్దకు వచ్చారు. స్థానికంగా ఉన్న ఫైబర్ పడవలో ఏడుగురు అవతల వైపు ఉన్న గోంగుర లంకకు వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా మంగళవారం సాయంత్రం ఆరుగంటల సమయంలో ఒక్కసారిగా పెనుగాలులు వీయడంతో పడవ బోల్తా పడింది. పడవ నడుపుతున్న ఎరుపల్లి గురివి, మున్నా ఈదుకుంటూ లంకలోకి వెళ్లగా సురాడ జ్యోతి (18), సురాడ రాజేశ్వరి(17), కొమర మల్లేశ్వరి(30), కొమర సత్య(11), కొమర శివన్నారాయణ (బన్ని) (10) గల్లంతయ్యారు. విషయం తెలిసి పెద్దసంఖ్యలో ప్రజలు సంఘటనా స్థలానికి తరలివచ్చారు. ధవళేశ్వరం సీఐ ఎ శివాజీరావు గాలింపు చర్యలు చేపట్టారు. బోల్తా పడిన పడవ దిగువన తల్లి కూతుళ్లు కొమర మల్లేశ్వరి, కొమర సత్య మృతదేహాలు లభించాయి. గల్లంతయిన మిగిలిన ముగ్గురి మృతదేహాలు కోసం గాలిస్తున్నారు. పెళ్లి ఇంట పెను విషాదం తెల్లారితే పెళ్లి జరగాల్సిన ఆ ఇంట పెను విషాదం నెలకొంది. పెళ్లిలో పాల్గొనేందుకు వచ్చిన బంధువులు ఇద్దరు మృతిచెందారన్న వార్త విని శోకసంద్రంలో మునిగిపోయారు. పెళ్లైన పది రోజులకే... పడవ బోల్తా ప్రమాదంలో గల్లంతైన సురాడ జ్యోతికి పది రోజుల క్రితమే గణేష్‌తో వివాహం అయింది. బంధువుల ఇంట్లో జరిగే వివాహ వేడుకలో పాల్గొనేందుకు వచ్చి పడవ ప్రమాదంలో గల్లంతయింది. జ్యోతి అత్త సంఘటనా స్థలంలో విలపిస్తున్న తీరు అక్కడి వారిని కలచివేసింది. గాలింపునకు ఆటంకం పెనుగాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో గాలింపునకు ఆటంకం ఏర్పడింది. దీంతో సున్నంబట్టీ రేవు వద్ద జనరేటర్లను ఏర్పాటు చేశారు. మూడు పడవల్లో 30 మంది గజ ఈతగాళ్లు గాలింపులో పాల్గొన్నారు. చీకటి ఎక్కువగా ఉండడంతో రాత్రి 11 గంటలకు గాలింపు నిలిపివేశారు. ఇంటికి వెళ్లిపోతే దక్కేవారేమో మంగళవారం మధ్యాహ్నం విందు పూర్తయిన అనంతరం ఇంటికి వెళ్లిపోదామని తనతో భార్య మల్లేశ్వరి, కూతురు సత్య అన్నారని కొమర పోలరాజు సంఘటనా స్థలం వద్ద రోదించాడు. అప్పుడే వారిని తీసుకొని వెళ్లిపోతే ప్రాణాలతో దక్కెవారేమో అంటూ విలపించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే అర్బన్ ఎస్పీ టి.రవికుమార్‌మూర్తి, ఆర్డీఓ వర్దనపు నాన్‌రాజ్, క్రైమ్ డీఎస్పీ ఉమాపతివర్మ, తహశీల్దార్ ఎమ్సీహెచ్ నాగేశ్వరరావు అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. పలువురి పరామర్శ సంఘటన విషయం తెలుసుకున్న వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజిసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ రూరల్ కో-ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ తదితరులు బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. పెళ్లికి వచ్చి మృత్యువాత పడడం బాధాకరమని జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. బోరున విలపిస్తున్న బంధువులు కోరుకొండ : ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద జరిగిన బోటు ప్రమాదంలో కోరుకొండకు చెందిన మత్స్యకారులు (వాడీలు) ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకొన్నాయి. ప్రమాదంలో కొమ్మర మల్లేశ్వరి, సత్య మృతి చెందారు. వీరు మృతితో మామ్మ సురాడ లక్ష్మమ్మతో పాటు బంధువులు బోరున విలపిస్తున్నారు. మల్లేశ్వరి భర్త పోలరాజు మంగళవారం వ్యవసాయ పనికి వెళ్లాడు. భార్యతో పాటు కుమార్తెను కోల్పోవడంతో బోరున విలపించాడు. పెళ్ళిరూపంలో మృత్యువు ఇద్దరిని బలిగొందని గ్రామస్తులు వ్యాఖ్యానించారు. షికారుకు రమ్మన్నందుకే వెళ్లా తనకు పరిచయమున్న మున్నా ఇంటికి చుట్టాలు వచ్చారు. వారిని బోటు షికారుకు తీసుకువెళ్లాలని చెప్పి మధ్యాహ్న భోజనానికి ఇంటికి రమ్మన్నాడని ఎరుపల్లి గురివి పేర్కొన్నాడు. భోజనం అనంతరం మధ్యాహ్నం మూడుగంటలకు గోంగూర లంకకు తీసుకు వెళ్లానని పేర్కొన్నాడు. అక్కడ ఇసుక తిప్పల్లో వారు ఆడుకున్న అనంతరం తిరిగి వస్తుండగా ఒక్కసారిగా ఈదురు గాలులు రావడంతో పడవ తిరగబడిందని నీటిలో ఉండగా మున్నా కనిపించడంతో తనని రక్షించగలిగానని గురివి పేర్కొన్నాడు. కెరటాలు వేగానికి మిగిలిన వారిని రక్షించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.