పెనుగాలే మృత్యుపాశమై | Boat Rollover, 2 Women Died at Dhavaleswaram Barriage | Sakshi
Sakshi News home page

పెనుగాలే మృత్యుపాశమై

Published Wed, Jun 4 2014 1:23 AM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM

పెనుగాలే మృత్యుపాశమై - Sakshi

పెనుగాలే మృత్యుపాశమై

 ధవళేశ్వరం, న్యూస్‌లైన్ :ధవళేశ్వరం వాడపేటలో దౌడుపల్లి అప్పలరాజు ఇంట జరిగే వివాహ వేడుకలో పాల్గొనేందుకు కోరుకొండ నుంచి కొమర పోలరాజు తన భార్య మల్లేశ్వరి, కుమార్తె సత్య, కుమారుడు శివన్నారాయణ(బన్ని), మేనకోడళ్లు సురాడ జ్యోతి, సురాడ రాజేశ్వరి తదితరులతో కలిసి వచ్చారు. మంగళవారం వాడపేటలో జరిగిన విందులో బంధువులంతా పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం గోదావరి అందాలు చూసేందుకు కొందరు బంధువులు సమీపంలోని సున్నంబట్టీ రేవు వద్దకు  వచ్చారు. స్థానికంగా ఉన్న ఫైబర్ పడవలో ఏడుగురు అవతల వైపు ఉన్న గోంగుర లంకకు వెళ్లారు.
 
 అనంతరం తిరిగి వస్తుండగా మంగళవారం సాయంత్రం ఆరుగంటల సమయంలో ఒక్కసారిగా పెనుగాలులు వీయడంతో పడవ బోల్తా పడింది. పడవ నడుపుతున్న ఎరుపల్లి గురివి, మున్నా ఈదుకుంటూ లంకలోకి వెళ్లగా సురాడ జ్యోతి (18), సురాడ రాజేశ్వరి(17), కొమర మల్లేశ్వరి(30), కొమర సత్య(11), కొమర శివన్నారాయణ (బన్ని) (10) గల్లంతయ్యారు. విషయం తెలిసి పెద్దసంఖ్యలో ప్రజలు సంఘటనా స్థలానికి తరలివచ్చారు. ధవళేశ్వరం సీఐ ఎ శివాజీరావు గాలింపు చర్యలు చేపట్టారు. బోల్తా పడిన పడవ దిగువన తల్లి కూతుళ్లు కొమర మల్లేశ్వరి, కొమర సత్య మృతదేహాలు లభించాయి. గల్లంతయిన మిగిలిన ముగ్గురి మృతదేహాలు కోసం గాలిస్తున్నారు.
 
 పెళ్లి ఇంట పెను విషాదం
 తెల్లారితే పెళ్లి జరగాల్సిన ఆ ఇంట పెను విషాదం నెలకొంది. పెళ్లిలో పాల్గొనేందుకు వచ్చిన బంధువులు ఇద్దరు మృతిచెందారన్న వార్త విని శోకసంద్రంలో మునిగిపోయారు.
 
 పెళ్లైన పది రోజులకే...
 పడవ బోల్తా ప్రమాదంలో గల్లంతైన సురాడ జ్యోతికి పది రోజుల క్రితమే గణేష్‌తో వివాహం అయింది. బంధువుల ఇంట్లో జరిగే వివాహ వేడుకలో పాల్గొనేందుకు వచ్చి పడవ ప్రమాదంలో గల్లంతయింది. జ్యోతి అత్త సంఘటనా స్థలంలో విలపిస్తున్న తీరు అక్కడి వారిని కలచివేసింది.
 
 గాలింపునకు ఆటంకం
 పెనుగాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో గాలింపునకు ఆటంకం ఏర్పడింది. దీంతో సున్నంబట్టీ రేవు వద్ద జనరేటర్లను ఏర్పాటు చేశారు. మూడు పడవల్లో 30 మంది గజ ఈతగాళ్లు  గాలింపులో పాల్గొన్నారు. చీకటి ఎక్కువగా ఉండడంతో రాత్రి 11 గంటలకు గాలింపు నిలిపివేశారు.

 ఇంటికి వెళ్లిపోతే దక్కేవారేమో
 మంగళవారం మధ్యాహ్నం విందు పూర్తయిన అనంతరం ఇంటికి వెళ్లిపోదామని తనతో భార్య మల్లేశ్వరి, కూతురు సత్య అన్నారని కొమర పోలరాజు సంఘటనా స్థలం వద్ద రోదించాడు. అప్పుడే వారిని తీసుకొని వెళ్లిపోతే ప్రాణాలతో దక్కెవారేమో అంటూ విలపించాడు.
 
 సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు
 ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే అర్బన్ ఎస్పీ టి.రవికుమార్‌మూర్తి, ఆర్‌డీఓ వర్దనపు నాన్‌రాజ్, క్రైమ్ డీఎస్పీ ఉమాపతివర్మ, తహశీల్దార్ ఎమ్‌సీహెచ్ నాగేశ్వరరావు అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు.
 
 పలువురి పరామర్శ
 సంఘటన విషయం తెలుసుకున్న వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజిసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ రూరల్ కో-ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ తదితరులు బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. పెళ్లికి వచ్చి మృత్యువాత పడడం బాధాకరమని జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
 
 బోరున విలపిస్తున్న బంధువులు

 కోరుకొండ  : ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద జరిగిన బోటు ప్రమాదంలో కోరుకొండకు చెందిన మత్స్యకారులు (వాడీలు) ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకొన్నాయి. ప్రమాదంలో కొమ్మర మల్లేశ్వరి, సత్య మృతి చెందారు. వీరు మృతితో మామ్మ సురాడ లక్ష్మమ్మతో పాటు బంధువులు బోరున విలపిస్తున్నారు. మల్లేశ్వరి భర్త పోలరాజు మంగళవారం వ్యవసాయ పనికి వెళ్లాడు. భార్యతో పాటు కుమార్తెను కోల్పోవడంతో బోరున విలపించాడు. పెళ్ళిరూపంలో మృత్యువు ఇద్దరిని బలిగొందని గ్రామస్తులు వ్యాఖ్యానించారు.
 
 షికారుకు రమ్మన్నందుకే వెళ్లా
 తనకు పరిచయమున్న మున్నా ఇంటికి చుట్టాలు వచ్చారు. వారిని బోటు షికారుకు తీసుకువెళ్లాలని చెప్పి మధ్యాహ్న భోజనానికి ఇంటికి రమ్మన్నాడని ఎరుపల్లి గురివి పేర్కొన్నాడు. భోజనం అనంతరం మధ్యాహ్నం మూడుగంటలకు గోంగూర లంకకు తీసుకు వెళ్లానని పేర్కొన్నాడు. అక్కడ ఇసుక తిప్పల్లో వారు ఆడుకున్న అనంతరం తిరిగి వస్తుండగా ఒక్కసారిగా ఈదురు గాలులు రావడంతో పడవ తిరగబడిందని నీటిలో ఉండగా మున్నా కనిపించడంతో తనని రక్షించగలిగానని గురివి పేర్కొన్నాడు. కెరటాలు వేగానికి మిగిలిన వారిని రక్షించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement