వరకట్న హత్య? | Dowry murder? | Sakshi
Sakshi News home page

వరకట్న హత్య?

Published Thu, Nov 20 2014 1:24 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

వరకట్న హత్య? - Sakshi

వరకట్న హత్య?

నెల్లూరు (క్రైమ్) : వైవాహిక జీవితంపై ఎన్నో కలలతో మెట్టింట్లోకి అడుగుపెట్టింది. కొద్ది రోజులకే అదనపు కట్నం కోసం అత్తంటి వేధింపులకు గురైంది. సంసార మాధుర్యాన్ని ఆస్వాదించే లోపే అత్తింటి వరకట్న దాహం ఆమెను బలి తీసుకుంది. ఈ దారుణ ఘటన వెంగళరావ్‌నగర్ సీ బ్లాక్‌లో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. రాపూరు కొత్తపేటకు చెందిన షేక్ మాసుమ్‌సాహెబ్, షంషాద్‌లు దంపతులు.

వారికి రియాజ్, ఇలియాజ్, ఇంతియాజ్, హసీనా అలియాస్ షాహీనా(26) పిల్లలు.  మసూమ్‌సాహెబ్ పిల్లలు చిన్న తనంలోనే మృతి చెందాడు. అప్పటి నుంచి కుమారులే అన్నీ తామై కుటుంబాన్ని నెట్టుకువచ్చారు. ఒకే ఒక ఆడపిల్ల కావడంతో షాహీనాను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఉన్నత చదువులు చదివించారు. అన్నల ఆశయాలకు అనుగుణంగా షాహీనా ఎంఏ బీఈడీ పూర్తి చేసింది. వెంగళరావ్ నగర్‌కు చెందిన షేక్ మీరాసాహెబ్ (విశ్రాంత ఏఆర్ ఎస్‌ఐ), బీబీజాన్ దంపతుల కుమారుడు షేక్ ఖాసింవలి ఏఆర్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.

షాహీనా బంధువులు వెంగళరావునగర్‌లో నివాసముంటున్నారు. వారి ద్వారా సంబంధాలు చూసుకున్నారు. అమ్మాయి చదుకుని ఉండటంతో తమ కుమారుడు ఖాసింవలికి ఇచ్చి పెళ్లి చేయాలని అతడి తల్లిదండ్రులు షాహీనా కుటుంబ సభ్యులను ఒప్పించారు. ఈ మేరకు రూ.8 లక్షలు కట్నం, 25 సవర్ల బంగారు ఇచ్చేలా ఇరుపెద్దల అంగీకారంతో వివాహం నిశ్చయం అయింది.

అనంతరం రూ.10 లక్షలు కట్నం, 30 సవర్ల బంగారు ఆభరణాలు ఇవ్వాలని ఖాసింవలి తల్లి డిమాండ్ చేసింది. తాము ఇచ్చుకోలేమని షాహీనా కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 22వ తేదీ ఖాసింవలి, షాహీనా వివాహం జరిగింది.    
 
 అదనపుకట్నం కోసం వేధింపులు
 వివాహామైన కొద్ది రోజుల నుంచే అత్త అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించింది. రూ.5 లక్షలు అదనంగా కట్నం తీసుకురావాలని డిమాండ్ చేసేది. తమ కొడుక్కి మంచి మంచి సంబంధాలొచ్చాయంటూ షాహీనాను సూటిపోటి మాటలతో హింసించ సాగింది. ఈ విషయాన్ని షాహీనా తన భర్తకు తెలిపింది. అతను తనకు ఏమీ పట్టనట్లు వ్యవహరించ సాగాడు.

ఆమె అత్తింటి వేధింపులను మౌనంగా భరిస్తూ వచ్చింది. ఖాసింవలి ఎవరితోను ఆమెను కలవనిచ్చేవాడు కాదు. నెల కిందట అత్త, భర్తతో షాహీనాకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ విషయం తెలిసి ఆమె కుటుంబ సభ్యులు వచ్చి మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. వేరు కాపురం పెట్టేందుకు అంగీకరించారు. మంగళవారం రాత్రి అత్త షాహీనాను తీవ్రంగా కొట్టింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఎడమ చెవిలో నుంచి తీవ్ర రక్తస్రావం అయింది.

అత్తింటివారు తనపై దాడి చేశారని బాధితురాలు తన అన్నలకు తెలిపింది. వారు ఖాసింవలికి ఫోన్ చేసి జరిగిన విషయంపై ఆరా తీశారు. ఇక్కడ ఏం జరగలేదనీ, చిన్న గొడవ జరిగిందని, ఇంటికి వెళ్లి ఫోన్ చేయిస్తానని ఖాసింవలి చెప్పారు. అప్పటికే వారు నెల్లూరుకు బయలు దేరేందుకు సిద్ధపడుతుండగా అలాంటిదేమి లేదని, నేను వెళ్లి చెబుతానని ఖాసింవలి వారిని వారించడంతో ఆగిపోయారు.  
 
 గాయాలతో మృతి....
 బుధవారం ఉదయం చెవిలో నుంచి తీవ్ర రక్తస్రావం, ముఖం, కంటిపై గాయాలతో షాహీనా తన ఇంట్లోనే మృతి చెంది ఉంది. భర్త, మామ ఇంట్లో ఉండగా అత్త తన సమీప బంధువుల ఇంట్లో వెళ్లిపోయింది. అయితే షాహీనా ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని అత్తింటివారు బాధిత కుటుంబ సభ్యులకు ఫోన్‌లో సమాచారమందించారు.

వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. షాహీనా మృతదేహానిన చూసి జీర్ణించుకోలేని బాధిత కుటుంబ సభ్యులు అత్తింటి వారికి దేహశుద్ధి చేశారు. ఖాసింవలి తల్లిని సైతం చితకబాదారు. అనంతరం ఐదో నగర పోలీసులకు సమాచారమందించారు. సంఘటన స్థలాన్ని నగర డీఎస్పీ మగ్బుల్, ఐదో నగర ఇన్‌స్పెక్టర్ ఎస్వీ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ విజయకుమార్, తహశీల్దార్ జనార్దన్ పరిశీలించారు.  

అత్తింటివారే హత్యచేశారు
అత్తింటివారే షాహీనాను హత్య చేసి ఆత్మహత్యగా చీత్రీకరించేందుకు యత్నిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లైన నాటి నుంచే అత్త ఆమెను అదునపు కట్నం కోసం వేధించడం ప్రారంభించింది. మంగళవారం రాత్రి సైతం షాహీనాను అత్త, భర్త కొట్టారని, దీంతోనే ఆమె మృతి చెందిందన్నారు.

షాహీనా మృతికి కారకులైన ఆమె భర్త, అత్తమామలు, ఆడ పడుచులు, మరుదులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఐదోనగర ఇన్‌స్పెక్టర్ ఎస్వీ రాజశేఖర్‌రెడ్డి 304బి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు తహశీల్దార్ మృత దేహానికి శవపంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భర్తను, అత్తింటివారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement